న్యూఢిల్లీ: రాజధాని నగరంలో మొన్నటి లోక్‌సభ, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా లభించిన ఈ తరుణంలోనైనా తన ప్రతిష్టను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అవసరమైతే అసెంబ్లీ బరిలో మాజీ ఎంపీలను దించాలని యోచిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీరథ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్‌నగర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ఓ నాయకుడు చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తీరథ్ ‘‘పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధం’’ అని ప్రకటించారు. తన పూర్వ స్థానమైన పటేల్‌నగర్ నుంచే పోటీ చేయాలన్నది తన అభీష్టమని పేర్కొన్నారు. కాగా మరికొంత మంది మాజీ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, కొందరు మాజీ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించే అవకాశాలు లేకపోలేదని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ అన్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనుభవం, యువతకు ప్రాధాన్యతనిస్తామని ఆయన చెప్పారు. మొదటి జాబితాలోనే మాజీ ఎంపీల పేర్లు చోటు చేసుకోవచ్చని ఆయన సూత్రప్రాయంగా వెల్లడించారు. ప్రాథమిక చర్చల సందర్భంగా, మాజీ ఎంపీలు అజయ్ మాకెన్, కపిల్‌సిబల్, సందీప్ దీక్షిత్‌లు అసెంబ్లీకి పోటీ చేయడంపై ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే పూర్వాంచల్ నాయకుడు, పశ్చిమ ఢిల్లీ మాజీ ఎంపీ మహాబాల్ మిశ్రా మాత్రం పాలం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మాజీ ఎంపీల కరిష్మా ఆసరాగా మరికొన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఢిల్లీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ప్రస్తుతమున్న షకీల్ అహ్మద్ స్థానంలో పీసీ చాకో బాధ్యతలు స్వీకరించగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కావచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్ షీలాదీక్షిత్‌ను కూడా ఈ ఎన్నికల్లో భాగస్వామిని చేయాలని కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. షీలాదీక్షిత్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేదు. శాసనసభకు పోటీ చేసే 70 మంది పార్టీ అభ్యర్థుల్లో మూడో వంతు కొత్తవారే ఉండవచ్చని డీపీసీసీ నాయకుడొకరు తెలిపారు.
ప్రముఖుల కుమార్తెల అరంగేట్రం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమార్తె లతికా సయ్యద్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కథక్ నర్తకి షర్మిష్టలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేయవచ్చని ఆ నాయకుడు చెప్పారు. తన తల్లి పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే లతికా సయ్యద్ బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది. గ్రేటర్ కైలాష్ నివాసి అయిన షర్మిష్ట తన స్వస్థలం నుంచే పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా పార్టీ ఇక్కడ నిర్వహించిన అనేక ఆందోళనలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఈ పోరాటం తనకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చవచ్చని షర్మిష్ట ఆశిస్తున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ గత ఏడాది ఎనిమిది స్థానాలకు పడిపోయి పరువు పోగొట్టుకుంది. తిరిగి తన పూర్వప్రతిష్టను నిలబెట్టుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు అనేక ఎత్తుగడలను రూపొందిస్తున్నారు.
ఎంపీ పోయింది ఎమ్మెల్యే దక్కేనా?
Published Mon, Nov 24 2014 10:16 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
Advertisement