భత్కల్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
Published Fri, Aug 30 2013 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: నగరంలో ఐదేళ్ల క్రితంనాటి వరుస బాంబు పేలుళ్లు సహా వివిధ కేసులకు సంబంధించి ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను స్థానిక పోలీసులు ప్రశ్నించనున్నారు. ‘జామా మసీదు వద్ద నిలిపి ఉన్న బస్సుపై కాల్పులు, పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో ఆయుధ కర్మాగారం నిర్వహణ తదితర కేసుల్లో యాసిన్ ప్రమేయం ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం అరెస్టయిన యాసిన్... 2008లో మధ్య ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌తోపాటు గఫార్ మార్కెట్, దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్‌ల వద్ద జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనల్లో కీలక నిందితుడన్నారు. కాగా ఆనాటి పేలుళ్లలో 26 మంది చనిపోగా, 133 మంది గాయపడిన సంగతి విదితమే. 2008 నాటి పేలుళ్లకు వ్యూహం రూపొందించి, అమలుచేసింది యాసిన్ అని తెలిపారు.
ఇదిలాఉండగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను అనేకమందిని అప్పట్లో పట్టుకున్న నగర పోలీసుశాఖకు చెందిన ప్రత్యేక విభాగానికి యాసిన్ ... కేవలం షారుఖ్‌గానే తెలుసు. 2008నాటి పేలుళ్ల ఘటనకు ముందు నగరానికి చెందిన అనేకమంది యువకులను యాసిన్... ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించాడు. నంగ్లోయిలోని ఆయుధ కర్మాగారంలో పిస్తోళ్లు, పేలుడు పదార్థాలను తయారు చేయించినట్టు యాసిన్‌పై కేసు నమోదైందని, 2011, నవంబర్‌లో సదరు కర్మాగారంపై దాడులు జరిపి, 16 మంది ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
Advertisement