న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘బోగస్ ఓటర్ల’ ఏరివేతపై దృష్టి సారించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు అరవిందర్ సింగ్ ఆధ్వర్యంలో నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ర్ వీఎస్ సంపత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ముండ్‌కా, వికాస్‌పురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు లక్ష బోగస్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం డీపీసీసీ నేత అరవిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారని, ఈ నియోజకవర్గాల్లో కొందరు 10 నుంచి 15 ఓట్లు కలిగి ఉన్నారని గుర్తించారని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈసీఐ ప్రత్యేక బృందాలు ఆయా నియోజకవర్గాల్లో సర్వే జరిపి, బోగస్ ఓటర్ల ఏరివేతకు చర్యలు తీసుకొంటామని ఈసీఐ హామీ ఇచ్చినట్లు సింగ్ వెల్లడించారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయకుండా దేశరాజధానిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐని కోరినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్ట కుండా చర్యలు తీసుకోవాలన్నారు.
‘ఢిల్లీపై ఎలాంటి ప్రభావం ఉండదు’
జార్ఖాండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని అరవిందర్ సింగ్ అన్నారు. సాధారణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారని, రాబోయే ఎన్నికల ఫలితాలు ప్రతిఒక్కరూ ఆశ్చర్యపడేలా రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో డీపీసీసీ అధ్యక్షుడితోపాటు పార్టీ సీనియర్ నాయకులు హరూన్ యూసఫ్, డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ ఉన్నారు.
బోగస్ ఓటర్లను తొలగించాలి
Published Tue, Dec 23 2014 11:24 PM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement