సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికలకు సంబంధించి 70 స్థానాలకు గాను 62 (అకాళీదళ్‌కి కేటాయించిన నాలుగు స్థానాలతో కలిపి) మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ. మరో ఎనిమిది స్థానాలలో బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లు వెల్లడించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాతే ఎనిమిది మంది అభ్యర్థులెవరన్నది వెల్లడించనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు చూశాక అవసరమైన మార్పులు, చేర్పులకు అనువుగా ఉండేందుకే ఈ స్థానాలను ప్రకటించడం లేదని పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రకటించిన స్థానాలకు సంబంధించి అసంతృప్త నేతలు ఒక్కరొక్కరుగా రోడ్డు ఎక్కుతుండడంతో రెండోవిడత జాబితా విడుదల జాప్యం చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్త కలహాలు ముదిరాక మిగిలిన సీట్లను ప్రకటిస్తే కాస్తయినా నష్టం కలగకుండా ఉంటుందన్నది బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. అసంతృప్త నేతలు పార్టీ కార్యాలయంలో ఘర్షణలకు దిగుతుండడాన్ని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ లైట్ తీసుకున్నారు. ఇలాంటివి మామూలే అని, మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ తర్వాతే బీజేపీ రెండో జాబితా
Published Tue, Nov 12 2013 12:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement