‘భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తాం’
Published Wed, Oct 30 2013 11:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 20 ఏళ్ల వరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్టు ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశరాజధాని మురికి నగరంగా,అత్యాచారాల రాజధానిగా అపప్రద మూటగట్టుకుందన్నారు. నగరాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, మంచినీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, అర్బన్‌ప్లానింగ్, ఇళ్ల నిర్మాణం, మహిళల రక్షణ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని అనధికారిక కాలనీల్లో రూ.2,800 కోట్లు ఖర్చుచేసినట్టు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది.
అయినా అనధికారిక కాలనీవాసులకు మంచినీరు, విద్యుత్ సరఫరా సక్రమంగాలేదు. రోడ్లు లేవు. రూ.3000 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నా డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగానే ఉంది. రోడ్ల దుస్థితి అంతే ఉంది. ట్రాఫిక్‌జాంలు, రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి’అని గోయల్ విమర్శించారు. ఢిల్లీలోని ప్రధాన రోడ్లన్నీ గోతులమయంగా మారాయన్నారు. సమస్యను పరిష్కరంచాల్సిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని, రోడ్లు బాగుపడాలంటే వానలు రాకుండా వానదేవుణ్ణి ప్రార్థించాలని ప్రజలకు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన మంచినీరు అందించడంలోనూ ఢిల్లీ జల్ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్న ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. విద్యుత్ సరఫరా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్నారు.
1,500 మంది దరఖాస్తు: హర్షవర్దన్
డిసెంబర్ నాలుగున జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్దన్ బుధవారం తెలిపారు. ‘వీరిలో అభ్యర్థులను వడబోసే ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపిక విధానానికి చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిటీ వివిధ సమావేశాలు నిర్వహిస్తోంద’న్నారు. అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుందని, అయితే కేంద్ర ఎన్నికల కమిటీనే తుదినిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement