దీపావళి తర్వాతే!
Published Fri, Nov 1 2013 2:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ సైతం కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. దీపావళి తర్వాతే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ స్పష్టం చేశారు. ఆశావహుల్లో మరింత ఉత్కంఠను పెంచుతూ గురువారం మధ్యాహ్నం గోయల్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ..ఉత్తమ పనితీరు కనబర్చిన ఎమ్మెల్యేలకు మరలా టికెట్లు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ టికెట్ల పంపిణీలో అన్ని సామాజిక వర్గాల వారికి సమప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీసుకుంటున్న ప్రాధమ్యాలను వివరిస్తూ ‘క్షేత్రస్థాయిలో పనితీరు, ఎలాంటి ఆరోపణలు లేకపోవడం, పార్టీ విధివిధానాలను పాటించడంతోపాటు గెలుపు అవకాశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి చర్యలు
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంతోపాటు వీలైనంత ఎక్కువ మందికి చేరువయ్యేందుకు నిర్ణయించిన ‘ఘర్ ఘర్ బీజేపీ’ కార్యక్రమం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించనున్నట్టు గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని మొత్తం 11,763 పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రతి బూత్‌కి సంబంధించి 32 మంది సభ్యుల బృందాలను నియమించినట్టు తెలిపారు. ఇప్పటికే 14 జిల్లాల్లోని 280 మండలాల్లో కార్యకర్త సమ్మేళనాలు నిర్వహించినట్టు చెప్పారు. గడపగడపకు ప్రచారం, బహిరంగ సభలు, స్థానికంగా ఉన్న ఆర్‌డబ్ల్యూఏలతో సమావేశాల రూపంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఢిల్లీని అవినీతి రహితంగా చేయడంతోపాటు పారదర్శక పాలన అందిచాలన్న ధ్యేయంతో బీజేపీ కృషి చేస్తోందన్నారు. 15 ఏళ్ల ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పాలనకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో చరమగీతం పాడనున్నామని ధీమా వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ప్రజలు ఇప్పటికే ఎంతో విసిగిపోయారని, బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రతి ఢిల్లీవాసి కోరు కుంటున్నారన్నారు.
మీ పరిధిలో చూసుకోండి: హర్షవర్ధన్
రాజధాని నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామంటూ బదర్ పురాలో బుధవారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేసిన ప్రసంగాన్ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా. హర్షవర్ధన్ తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను షీలాదీక్షిత్ మోసగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో కన్నాట్‌ప్లేస్ పునరుద్దరణ పనులు సైతం పదిహేనేళ్లలో చేపట్టలేకపోయారనిఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి పనులు కొనసాగుతుండడంతో గోతుల్లో ఎంతో మంది పడి గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిస్థితి మారుమూల గ్రామంలా ఉందని ఎద్దేవా చేశారు. పదమూడు మురికివాడల్లోని 30 వేల మంది ప్రజలకు నేటికీ తాగునీరు అందని దుస్థితి ఉందన్నారు.
వాల్మీకి బస్తీల్లోని 15 వేల మంది అత్యంత దయనీయమైన జీవనాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గ పరిధిలోనే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక మైన రాష్ట్రపతి భవనం, పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసం, కేంద్ర మంత్రులు, ఎంపీల నివాసాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు కన్నాట్‌ప్లేస్, జన్‌పథ్, గోల్ మార్కెట్, కాలిబడీమార్గ్, పంచ్‌కున్యారోడ్, ఖాన్‌మార్కెట్, జోర్‌బాగ్, సుజన్‌సింగ్ పార్క్, పండారారోడ్డు, లక్ష్మిబాయినగర్, కిద్వాయి నగర్, సరోజిని నగర్, సఫ్దర్‌జంగ్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు షీలాదీక్షిత్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు.
2009 మార్చి నుంచి 2012 వరకు ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.8.85 కోట్లు ఖర్చుచేశారన్నారు. దీనిలో ఎక్కువగా 30.9 శాతం నిధులు పోర్టాక్యాబిన్లు (తాత్కాలిక షెల్టర్లు), మంత్రులు, ఎంపీల ఇళ్లకు ప్రహ రీ గోడల నిర్మాణానికి 13.7 శాతం, 14.2 శాతం నిధులు రోడ్ల నిర్మాణానికి, 12.4 శాతం నిధులు మెట్లు నిర్మిచేందుకు, 5.3 శాతం నిధులు ఇతర పనులకు వినియోగించినట్టు హర్షవర్ధన్ వెల్లడిం చారు. నేటికీ ముఖ్యమంత్రి నిధుల్లో రూ.కోటీ 75 లక్షలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి పనులను పట్టించుకోని సీఎం ఢిల్లీ నగరాన్ని అభివృద్ధిబాట పట్టించామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Advertisement
Advertisement