దళితులు, జాట్‌ల ఓట్లే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో వాయవ్య ఢిల్లీ అన్నింటికన్నా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్.. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కృష్ణా తీరథ్‌కు, బీజేపీ.. దళిత నేత ఉదిత్‌రాజ్‌కు టికెట్ ఇచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ముందుగా ప్రకటించిన అభ్యర్థి మహేంద్ర సింగ్ టికెట్ వాపస్ చేయడంతో మాజీ మంత్రి రాఖీ బిర్లాను బరిలోకి దింపింది.
కృష్ణాతీరథ్ పదేళ్లుగా వాయవ్య ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె బీజేపీకి చెందిన మీరా కన్వరియాను 1.8 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ప్రస్తు తం గట్టిగా వీస్తోన్న కాంగ్రెస్ వ్యతిరేకపవనాల దృష్ట్యా కృష్ణాతీరథ్ విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
మహేంద్రసింగ్‌ను ఎన్నికల బరిలోనుంచి తప్పించి, ఢిల్లీ కాంగ్రెస్ నేతలలో దిగ్గజంగా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించిన రాఖీ బిర్లాను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపడం వల్ల ఆప్ విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. వాల్మీకీ సమాజం అండ ఆమెకు లాభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే రాఖీ అభ్యర్థిత్వాన్ని మహేంద్రసింగ్ వ్యతిరేకించారు . ప్రచారం చేయడం కోసం రాఖీ తనను డబ్బు అడిగారని కూడా ఆయన ఆరోపించారు.
రాఖీకి తాను మద్దతు ఇవ్వబోనని ప్రకటించారు. మహేంద్ర సింగ్‌కు టికెట్ ఇవ్వడానికి ముందు కూడా రాఖీ అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానిక నేతలు కూడా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజలకు తగ్గిన మోజువల్ల రాఖీని కూడా విజయలక్ష్మి అంత సులువుగా వరించే సూచనలు కనిపించడం లేదంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఉదిత్‌రాజ్ కూడా వాల్మీకీ సమాజం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో అడుగుపెట్టిన ఉదిత్‌రాజ్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ , ఎస్టీలకు అధినేత. అయన గత నెలలోనే బీజేపీలో చేరారు. పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ఉదిత్ రాజ్‌కు టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. అయితే ఉదిత్‌రాజ్ మాత్రం తాను 34 సంవత్సరాలుగా ఢిల్లీవాసినని, జాతీయస్థాయి నేతనని అంటున్నారు. ఈ రిజర్వుడు నియోజకవర్గంపై బీఎస్పీ కూడా ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ ఇక్కడి నుంచి బసంత్ పవార్‌ను నిలబెట్టింది.
ఔటర్ ఢిల్లీ నియోకవర్గం నుంచి విడదీసిన ప్రాంతాలతో 2008లో ఆవిర్భవించిన వాయవ్య ఢిల్లీ నియోజకవర్గంలోని 17 లక్షలకు పైగా ఓటర్ల లో 21 శాతం మంది దళిత ఓటర్లున్నారు. జాట్ ఓటర్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. ఓటర్లలో 16 శాతం మంది జాట్లున్నారు.
బ్రాహ్మణులు 12 శాతం, వైశ్యులు 10 నుంచి 11 శాతం, ముస్లింలు 5 నుంచి 8 శాతం ఉన్నారు. హర్యానాను ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం పరిధిలో 100కి పైగా గ్రామాలున్నాయి. 20 జేజే కాలనీలు, పలు అనధికార కాలనీలు ఉన్నాయి. అనధికార కాలనీలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవి. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీరు మారిపోయింది. ఓటర్లు కాంగ్రెస్ కన్నా ఢిల్లీ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గుచూపారు.
వాయవ్య ఢిల్లీ ఎన్నికల చిత్రం
Published Fri, Mar 21 2014 10:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement