Udit raj
-
Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు!
న్యూఢిల్లీ: మహిళలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగానే చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ పార్టీ అభ్యర్థి ఉదిత్ రాజ్ తరఫున గురువారం ఢిల్లీలోని మంగోల్‌పురిలో మహిళలు మాత్రమే పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ఎంతో ఆర్భాటంగా ఇప్పుడే మహిళాలోకం కలలు సాకారం చేస్తున్నట్లు పార్లమెంట్లో నారీశక్తి వందన్ అధినయమ్(మహిళా రిజర్వేషన్ బిల్లు) ప్రవేశపెట్టారు. ఆ చట్టం ఇప్పుడు కాదు ఏకంగా పదేళ్ల తర్వాత అమలుచేస్తామని తీరిగ్గా చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఒక సిద్దాంతముంది. అదే ఆర్ఎస్ఎస్. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అయితే ఏకంగా మహిళలను కనీసం ‘శాఖ’లోకి అడుగుపెట్టనివ్వడంలేదు. మహిళలను రెండో తరగతి పౌరులుగా భావించాలని ఆర్ఎస్ఎస్ నరనరాల్లో నాటుకుపోయింది’ అని విమర్శలు గుప్పించారు. వర్కింగ్ ఉమెన్ పనికి గుర్తింపు దక్కట్లేదు ‘‘భారత్‌లో ప్రతీ రంగం గురించి మాట్లాడతాంగానీ వర్కింగ్ ఉమెన్ ఇంట్లోనూ చేసే శ్రమకు ఎక్కడా గుర్తింపు దక్కట్లేదు. రోజంగా ఆఫీస్/కార్యస్థలంలో పనిచేసి అలసిపోయిన మహిళలు ఇంటికొచ్చాక మళ్లీ రెండో షిప్ట్ మొదలెడతారు. పిల్లల ఆలనాపాలనా చూసుకుని ఇంటి పనులన్నీ చేస్తారు. ఈ పనికి వాళ్లకు ఎలాంటి చెల్లింపులు ఉండవు. పురుషులు రోజుకు 8 గంటలు పనిచేస్తే మహిళలు 16 గంటలపైనే పనిచేస్తారు. వారి శ్రమకు ప్రతిఫలంగా ఏమీ దక్కట్లేదు. ఇది ఒక రకంగా చెల్లింపులులేని గుర్తింపులేని పని. మేం అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏటా రూ.1 లక్ష వారి ఖాతాలో జమచేస్తాం’’ అని రాహుల్ అన్నారు. మే 25నాటి పోలింగ్‌కు ప్రచారం గురువారంతో ముగుస్తుండటంతో ఢిల్లీ మెట్రోలోనూ రాహుల్ ప్రయాణించారు. ‘‘నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ తరఫున సైతం రాహుల్ దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ భవన్లో మధ్యాహ్న భోజనం ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన రాహుల్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్/తెలంగాణ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌సహా దాదాపు 10 మందితో కలిసి రాహుల్ భోజనం చేశారు. రాహుల్ పూరీలు, చపాతీలు, కోడికూర వేపుడు, రొయ్యల వేపుడు ఆర్డర్ ఇచ్చారు. తొలుత పూరీ/చపాతీని పప్పుతో కలిపి తిన్నారు. తర్వాత చికెన్ ఫ్రై, రొయ్యల ఫ్రైతో చపాతీ/పూరీ తిన్నారు.మీ కీలక పాత్ర పోషించండి...సోనియా గాంధీ ఢిల్లీ పరిధిలో ప్రచారం చివరిరోజు సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఓటర్లకు ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న కీలక ఎన్నికలివి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగబద్ధ సంస్థలపై దాడులు కొనసాగుతున్న వేళ వచి్చన ఎన్నికలివి. ఈ పోరాటంలో మీరు మీ కీలక పాత్ర పోషించండి. మీ ఓటు ఉపాధి కల్పనకు బాటలువేస్తుంది. ఎగసిన ధరలను కిందకు దింపుతుంది. మహిళలకు సాధికారతను కట్టబెడుతుంది. మెరుగైన భవిష్యత్తుతో సమానత్వాన్ని సాధిస్తుంది. ఢిల్లీ పరిధిలోని ఏడు ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని సోనియా సందేశమిచ్చారు. -
రాష్ట్రపతి ముర్ముపై అనుచిత ట్వీట్లు!
ఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన ప్రకటనలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లపై బీజేపీ మండిపడుతోంది. ‘‘ద్రౌపది ముర్ముగారి లాంటి వ్యక్తి ఏ దేశానికి కూడా ప్రెసిడెంట్ కాకూడదు. చెంచాగిరికి కూడా ఓ హద్దు అంటూ ఉంటుంది. దేశంలో 70 శాతం మంది గుజరాత్ నుంచి తయారైన ఉప్పును తింటున్నారని ఆమె చెప్పారు. ఒకవేళ మీ అంతట మీరుగా ఉప్పు తిని బతికితేనేగా.. ఆ విషయం మీకు తెలిసేది’’ అంటూ ఉదిత్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ, ఉదిత్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ద్రౌపది ముర్ముగారి మీద తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ముర్మూజీని అభ్యర్థిగా చేసి ఆదివాసీ పేరుతో ఓట్లు అభ్యర్థించారు. ఆమె దేశానికి రాష్ట్రపతి మాత్రమే కాదు.. గిరిజనుల ప్రతినిధి కూడా. ఎస్సి/ఎస్టి పేరుతో పదవులకు వెళ్లి మౌనంగా ఉంటే ఏడుపు వస్తుంది అంటూ మరో ట్వీట్ చేశారాయన. My statement as regard to Draupadi Murmuji is mine & nothing to do with Congress.Her candidature & campaign were in the name adivasi, it doesn’t mean she is no longer adivasi. My heart cries that when SC/ST reach to higher position, they ditch their communities & become mum. — Dr. Udit Raj (@Dr_Uditraj) October 6, 2022 అక్టోబర్ 3న ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. ‘‘భారత దేశం పాల ఉత్పత్తిలో, వినియోగంలో మొదటిస్థానంలో ఉంది. శ్వేత విఫ్లవం అనేది గుజరాత్ నుంచే మొదలైంది. అంతెందుకు గుజరాత్లో తయారైన ఉప్పునే దేశంలో 76 శాతం మంది తింటున్నారు. కాబట్టి.. గుజరాత్ ఉప్పునే దేశం మొత్తం తింటోంది అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఉదిత్ రాజ్ ఇలా తీవ్రంగా స్పందించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఉదిత్ రాజ్ తొలుత బీజేపీలో ఉండేవారు. 2014 నుంచి 2019 మధ్య బీజేపీ తరపున నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో.. బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. అప్పటి నుంచి బీజేపీని ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పార్టీగా అభివర్ణిస్తూ విమర్శిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ అధిర్ రంజన్ చౌదురీ.. పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి.. రాష్ట్రపత్ని అని సంబోధించడం.. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై అధికార బీజేపీ ఆందోళన చేపట్టగా.. ఎట్టకేలకు ఆయన రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణలు తెలియజేశారు. -
కుంభమేళాకు అన్ని కోట్లు అవసరమా?
లక్నో : కుంభమేళా నిర్వాహణకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ప్రభుత్వం కుంభమేళా పేరిట అలహాబాద్‌లో 4200 కోట్ల రూపాయలు ఖర్చుచేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ర్టానికి సొంతంగా ఒక మతం అంటూ ఉండదని, అలాంటప్పుడు మత ప్రచారాలు, బోధనలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉదిత్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఓ కార్యక్రమానికి హాజరైనప్పడు వారికి మౌలిక సదుపాయలు ఏర్పాటుచేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. (లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు కోసమే ప్రభుత్వం పనిచేయదని, కుంభమేళా అన్నది కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. భక్తుల కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఇదే అంశంపై యూపీ మంత్రి బ్రిజేష్ పాథక్ మాట్లాడుతూ.. కుంభమేళా అన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు హాజరవుతారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. (తెలంగాణ సీఎస్‌కు కేరళ సీఎస్ లేఖ) -
‘రాహుల్, కేజ్రీవాల్ నన్ను హెచ్చరించారు’
న్యూఢిల్లీ : ఒక వేళ ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే.. బీజేపీకి గుడ్‌బై చెబుతానంటున్నారు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్. ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో ఉదిత్ రాజ్ తన ఇండియన్ జస్టిస్ పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బీజేపీ తరఫున వాయువ్య ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి మాత్రం ఆయనకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదిత్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. I am waiting for ticket if not given to me I will do good bye to party — Dr. Udit Raj, MP (@Dr_Uditraj) April 23, 2019 ‘నాకు పార్టీ వీడే ఆలోచన లేదు. ఒక వేళ నాకు గనక టికెట్ ఇవ్వకపోతే.. పార్టీనే నన్ను బలవంతంగా బయటకు పంపినట్లు అవుతుంది. ఎందుకంటే టికెట్ ఇవ్వకపోతే నేను ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండన’ని ఉదిత్ రాజ్ స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంతో శ్రమించానని.. ఈ విషయం పార్టీకి కూడా తెలుసన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ తనకు టికెట్ కేటాయింకపోవచ్చంటూ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ నాలుగు నెలల క్రితమే తనను హెచ్చరించారన్నారు. ఈ విషయం గురించి వారిద్దరితో కూడా చర్చించినట్లు ఉదిత్ రాజ్ తెలిపారు. అంతేకాక ‘నాకు టికెట్ కేటాయింపు గురించి అమిత్ షాతో మాట్లాడటానికి ప్రయత్నించాను. మెసేజ్ కూడా చేశాను. కానీ ఆయన స్పందించలేదు. మనోజ్ తివారీ మాత్రం నాకు టికెట్ వస్తుందని చెప్పారు. అరుణ్ జైట్లీతో కూడా మాట్లాడాను. ఇప్పటికి కూడా బీజేపీ దళితులను మోసం చేయదనే నమ్ముతున్నాను’ అన్నారు. ప్రస్తుతానికి ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు ఢిల్లీలో దుమారం రేపుతున్నాయి. -
శబరిమలపై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలను అనుమతించడం మంచి నిర్ణయమని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సమర్ధించారు. లింగ సమానత్వం సాధించే దిశగా ఇది ముందడుగు వంటిదని అన్నారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిసంఘ్ చైర్మన్‌గా తాను వ్యక్తిగత హోదాలో అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. పురుషుడి పుట్టుకకు మూలమైన స్ర్తీ అపవిత్రురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఆలయం వెలుపలా దేవుడు ఉంటాడని, రాజ్యాంగం దృష్టిలో మహిళలు, పురుషులూ సమానమేనని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. సంప్రదాయాలు కాలానుగుణంగా మారుతాయని, గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం సైతం దేశంలో సంప్రదాయాలుగా ఉండేవని తదనంతరం మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. కాగా, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్యకు ఉదిత్ రాజ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
#మీటూ : ‘మగాడి జీవితాన్ని నాశనం చేస్తోంది’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న #మీటూ ఉద్యమం గురించి అధికార బీజేపీ పార్టీ ఎంపీ ఉదిత్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమం వల్ల చాలా మంది పురుషుల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. ఉదిత్ రాజ్ మీటూ ఉద్యమం గురించి స్పందిస్తూ.. ‘అవును లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఇది మగవాని స్వభావం. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా..? ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? దీన్ని అడ్డం పట్టుకుని వారు ఒక్కో పురుషుని దగ్గర నుంచి 2 - 4 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలా డబ్బు చేతికి రాగానే మరో మగవాడి మీద పడుతున్నారు. ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ వ్యాఖ్యల పట్ల జనాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కేవలం స్త్రీలకు జరిగిన అన్యాయాల గురించే కాదు.. పురుషులు ఎదుర్కొన్న వేధింపుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి దరిద్రాలు జరగకుండా చూడాల్సిన నాయకులే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమంటూ కామెంట్ చేస్తున్నారు. -
జనం ఆర్తనాదాలు చేస్తూ చస్తుంటే...
న్యూఢిల్లీ: వరద బీభత్సంతో ధ్వంసమైన కేరళను పునర్నిర్మించేందుకు ఆ రాష్ట్రంలోని మూడు ప్రధానమైన ఆలయాల బంగారం, సంపదను వినియోగించాలని వాయవ్య ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సలహా ఇచ్చారు. కేరళలోని పద్మనాభ స్వామి, శబరిమల, గురువాయూర్ ఆలయాల అధీనంలోని బంగారం, ఆస్తులను కలిపితే దాదాపు రూ.1లక్ష కోట్లకుపైగా ఉంటుందని, కేరళకు జరిగిన రూ.20వేల కోట్లకంటే ఈ మొత్తం చాలా ఎక్కువని ఆయన లెక్కకట్టారు. ‘ఓ వైపు జనం ఆర్తనాదాలు చేస్తూ చస్తుంటే, మరోవైపు ఆలయాలకు రూ.లక్ష కోట్ల సంపద ఉండి ఏం ఉపయోగం?’ అంటూ ఉదిత్ ట్వీట్ చేశారు. ఆలయాల సంపదను వాడాలన్న తమ డిమాండ్‌కు ప్రజలు మద్దతు పలకాలని ఆయన కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గత నెలలో కేరళలో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ భారీఎత్తున పునర్నిర్మాణపనులు జరుగుతున్నాయి. కేరళకు తక్షణసాయంగా ప్రధాని మోదీ రూ.600 కోట్లు మంజూరుచేయగా, పలు రాష్ట్రాలు, సంస్థలు, లక్షలాది మంది ప్రజలు తమ వంతు సాయమందించారు. రూ.20వేల కోట్ల నష్టం జరిగిందని, కనీసం రూ.2,000 కోట్ల సాయం చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రాన్ని కోరడం తెల్సిందే. -
దళితులపై హింస.. బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కొక్కరిగా సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ తరుణంలో తాజాగా వాయవ్య ఢిల్లీ నియోజక వర్గ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ బంద్ తర్వాత దళితులపై హింస పెరిగిపోయిందంటూ ప్రకటించి బాంబు పేల్చారు. ‘ఏప్రిల్ 2న భారత్ బంద్ తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయి. ఈ మేరకు ఆధారాలతోసహా కథనాలు కూడా వెలువడుతున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ శనివారం ఉదిత్ ఓ ట్వీట్ చేశారు. ‘బార్మర్, జలోరే, జైపూర్, గ్వాలియర్, మీరట్, బులంద్‌షహర్, కరోలి.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు హింసిస్తున్నారు’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన పేర్కొన్న ప్రాంతాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండటంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. పైగా గ్వాలియర్‌కు చెందిన ఓ దళిత ఉద్యమవేత్తను పోలీసులు ఉత్త పుణ్యానికి దారుణంగా హింసించారంటూ ప్రత్యేకించి ఉదిత్ రాజ్ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. కాగా, దళిత చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు భారత్ బంద్ చేపట్టాగా.. ఏడు రాష్ట్రాల్లో అది హింసాత్మకంగా మారటం.. 11 మంది మృతి చనిపోవటం.. పలువురు గాయపడటం తెలిసిందే. Dalits r tortured at large scale after 2ndApril country wide agitation . Peoplefrom badmer,jalore,jaipur,gwalior,meerut , bulandshahr,karoli &other parts calling that not only anti reservatists but police also beating &slapping false cases. — Dr. Udit Raj, MP (@Dr_Uditraj) 7 April 2018 My confedetion worker in gwalior is being tortured whereas he had not done anything wrong . He is crying for help. — Dr. Udit Raj, MP (@Dr_Uditraj) 7 April 2018 -
'కాపాడేవాళ్లు ఎక్కువవటమే సమస్య'
న్యూఢిల్లీ: దేశంలో ధర్మాన్ని పరిరక్షించే వాళ్లు ఎక్కువైనందునే.. హిందూ మతం ప్రమాదంలో పడిందని.. బీజేపీ ఎంపీ ఉదిత్‌రాజ్ ఢిల్లీలో తెలిపారు. తమిళనాడులో కొందరు దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరించినందుకు వారు ఇస్లాం స్వీకరించేందుకు సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. దళితుల ఓట్లు చీల్చేందుకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె ప్రయత్నిస్తున్నారని అధినేత్రి మాయావతి చేసిన విమర్శలపైనా ఆయన స్పందించారు. దళిత నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గత 15 ఏళ్లు తనను కాంగ్రెస్, బీజేపీ ఏజెంట్ గా మాయావతి ఆరోపిస్తూ వస్తున్నారని చెప్పారు. ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని మాయావతికి హితవు పలికారు. -
వాయవ్య ఢిల్లీ ఎన్నికల చిత్రం
దళితులు, జాట్ల ఓట్లే కీలకం సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో వాయవ్య ఢిల్లీ అన్నింటికన్నా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్.. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కృష్ణా తీరథ్‌కు, బీజేపీ.. దళిత నేత ఉదిత్‌రాజ్‌కు టికెట్ ఇచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ముందుగా ప్రకటించిన అభ్యర్థి మహేంద్ర సింగ్ టికెట్ వాపస్ చేయడంతో మాజీ మంత్రి రాఖీ బిర్లాను బరిలోకి దింపింది. కృష్ణాతీరథ్ పదేళ్లుగా వాయవ్య ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె బీజేపీకి చెందిన మీరా కన్వరియాను 1.8 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ప్రస్తు తం గట్టిగా వీస్తోన్న కాంగ్రెస్ వ్యతిరేకపవనాల దృష్ట్యా కృష్ణాతీరథ్ విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. మహేంద్రసింగ్‌ను ఎన్నికల బరిలోనుంచి తప్పించి, ఢిల్లీ కాంగ్రెస్ నేతలలో దిగ్గజంగా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించిన రాఖీ బిర్లాను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపడం వల్ల ఆప్ విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. వాల్మీకీ సమాజం అండ ఆమెకు లాభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే రాఖీ అభ్యర్థిత్వాన్ని మహేంద్రసింగ్ వ్యతిరేకించారు . ప్రచారం చేయడం కోసం రాఖీ తనను డబ్బు అడిగారని కూడా ఆయన ఆరోపించారు. రాఖీకి తాను మద్దతు ఇవ్వబోనని ప్రకటించారు. మహేంద్ర సింగ్‌కు టికెట్ ఇవ్వడానికి ముందు కూడా రాఖీ అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానిక నేతలు కూడా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజలకు తగ్గిన మోజువల్ల రాఖీని కూడా విజయలక్ష్మి అంత సులువుగా వరించే సూచనలు కనిపించడం లేదంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఉదిత్‌రాజ్ కూడా వాల్మీకీ సమాజం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో అడుగుపెట్టిన ఉదిత్‌రాజ్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ , ఎస్టీలకు అధినేత. అయన గత నెలలోనే బీజేపీలో చేరారు. పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ఉదిత్ రాజ్‌కు టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. అయితే ఉదిత్‌రాజ్ మాత్రం తాను 34 సంవత్సరాలుగా ఢిల్లీవాసినని, జాతీయస్థాయి నేతనని అంటున్నారు. ఈ రిజర్వుడు నియోజకవర్గంపై బీఎస్పీ కూడా ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ ఇక్కడి నుంచి బసంత్ పవార్‌ను నిలబెట్టింది. ఔటర్ ఢిల్లీ నియోకవర్గం నుంచి విడదీసిన ప్రాంతాలతో 2008లో ఆవిర్భవించిన వాయవ్య ఢిల్లీ నియోజకవర్గంలోని 17 లక్షలకు పైగా ఓటర్ల లో 21 శాతం మంది దళిత ఓటర్లున్నారు. జాట్ ఓటర్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. ఓటర్లలో 16 శాతం మంది జాట్లున్నారు. బ్రాహ్మణులు 12 శాతం, వైశ్యులు 10 నుంచి 11 శాతం, ముస్లింలు 5 నుంచి 8 శాతం ఉన్నారు. హర్యానాను ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం పరిధిలో 100కి పైగా గ్రామాలున్నాయి. 20 జేజే కాలనీలు, పలు అనధికార కాలనీలు ఉన్నాయి. అనధికార కాలనీలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవి. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీరు మారిపోయింది. ఓటర్లు కాంగ్రెస్ కన్నా ఢిల్లీ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గుచూపారు.