ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ:
రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోని ఐదింటిలో సిట్టింగ్ ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన రెండు స్థానాల నుంచి ఎవరిని నిలబెట్టాలనేదానిపై నిర్ణయానికి రాలేకపోతోంది. న్యూఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల పేర్లను ఇది వరకే ప్రకటించింది.
కాంగ్రెస్ సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను గురువారం సాయంత్రం వరకు ప్రకటించలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో పార్టీ చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తోంది.
అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో ఢీలాపడ్డ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో ఎవరి తరపున ప్రచారం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ దెబ్బతో కుదేలయిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలనుకుంటోంది.
నార్త్ వెస్ట్ ఢిల్లీలో కూడా మంత్రి కృష్ణాతీరథ్‌కు టికెట్ ఇవ్వకుండా, సౌత్ ఢిల్లీ నుంచి గానీ వెస్ట్ ఢిల్లీ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ మొదట భావించినట్టు సమాచారం. ఈ వ్యూహం ఆచరణ సాధ్యం కాదని తేలడంతో కృష్ణాతీరథ్‌కే టికెట్ ఇచ్చింది. సౌత్ ఢిల్లీ లేదా వెస్ట్ ఢిల్లీ నుంచి తమ పార్టీ తరపున పోటీచేయాలని కాంగ్రెస్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని అంటున్నారు.
జాట్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సౌత్ ఢిల్లీలో సెహ్వాగ్‌కు టికెట్ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. ఈ సీటు నుంచి పోటీ కోసం విద్యార్థినేత రోహిత్ చౌదరి పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉందని అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పది అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది.
ఎంపీ మహాబల్ మిశ్రా తనయుడు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని పార్టీ భావించిందని సమాచారం. వెస్ట్ ఢిల్ల్లీ నుంచి పూర్వాంచలీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్టీ బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయ్, శేఖర్ సుమన్, భోజ్‌పురి నటుడు కునాల్ సింగ్ తదితర పేర్లను కూడా పరిశీలించిందని చెబుతున్నారు.
నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ పూర్వాంచలీ ఓటర్లను మెప్పించేందుకు భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చింది. తివారీకి దీటుగా మరో పూర్వాంచలీ ప్రముఖుడిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి ఢిల్లీలో పార్టీకి గడ్డుకాలమేనని, ఇక్కడ బాగా బలహీనపడినట్టు వార్తలు రావడంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది.
ప్రచారంలో ఏ విధంగానూ వెనుకబడకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్ మార్గాన్ని కూడా ఎంచుకుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశ రాజధానిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు సోషల్ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా వివరించేందుకు సిద్ధమయింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేయనున్న ఐటీ సెంటర్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానుంది.
దూకుడుగా ప్రత్యర్థి పార్టీల ప్రచారం
భారతీయ జనతా పార్టీ సైతం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం వల్ల కలిగిన ఆత్మవిశ్వాసంతో పాటు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుకూల పవనాలు ఉండడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది. నమో టీ పార్టీ, నమో చౌపాల్, ఏక్ నోట్ కమల్ పర్ ఓట్, మోడీ ఫర్ పీఎం, ఓట్ ఫర్ మోడీ వంటి కార్యక్రమాలతోపాటు ఇంటింటికీ ప్రచారం, చిన్న చిన్న సమావేశాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది.
అభ్యర్థుల ఎంపికలో అందరికంటే ముందున్న ఆప్ ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ‘ఆప్’ సర్కారు 49 రోజుల పాలనలో కరెంటు చార్జీలను సగానికి తగ్గించడం, ఉచిత నీటి సరఫరా వంటి అనేక ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంది. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లుపై హఠాత్తుగా రాజీనామా చేసిన తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే పేదలకు ఆప్‌పై పేదలకు ఆసక్తి పెద్దగా తగ్గనప్పటికీ మధ్యతరగతి ఓటర్లకు మాత్రం మోజు తగ్గింది. దీనిని గుర్తించిన ఆప్ ఢిల్లీ విభాగం ఇంటింటికీ ప్రచారంతో ప్రజల సందేహాలను తీర్చే కార్యక్రమాన్ని చేపట్టింది.