Krti sanan
-
చిల్లర కష్టాలు...
అయ్యయ్యో... చేతిలో వంద నోటు లేదులే! అయ్యయ్యో.. కార్డులో క్యాష్ బయటకు రాదులే! అయ్యయ్యో పర్సు ఖాళీ ఆయనే! - ఇప్పుడు ఇండియాలో దాదాపుగా అందరూ ఇదే పాట పాడుకుంటున్నారు. సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. చిల్లర కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. ‘ప్లీజ్.. వంద నోట్లుంటే ఇవ్వండి’ అని చుట్టుపక్కల వారిని అడుగుతున్నారు. ఇద్దరు హిందీ హీరోయిన్లు చిల్లర లేక తెగ ఇబ్బంది పడ్డారు. అందులో ‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కృతీ సనన్ పరిస్థితి వింటే తప్పకుండా ‘అయ్యో పాపం’ అంటారు. తీవ్రమైన జ్వరంతోనూ లక్నోలో హిందీ చిత్రం ‘బరేలీ కి బర్ఫీ’ షూటింగ్ చేస్తున్నారు కృతి. బుధవారం జ్వరం మరీ ఎక్కువ కావడంతో చిత్ర బృందం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రొడక్షన్ మేనేజర్‌తో పాటు కృతి పర్సులోనూ పాత రూ.500, 1,000 నోట్లు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రిలో అవి తీసుకోకపోవడంతో కార్డు ద్వారా బిల్ అమౌంట్ పే చేశారు. చివరకు మందులు కొనడానికి వందనోట్లు లేవు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైమ్‌లో దగ్గరలో ఎవరో రూ.1,000 నోటు తీసుకుని రూ.800 చిల్లర (వందనోట్లు) ఇస్తున్నారని తెలుసుకుని మందులు కొన్నారట. ఇక, నల్ల కలువ బిపాసా బసు ఫిట్నెస్ గురించి తెలిసిందే. జిమ్ చేసిన తర్వాత ఎగ్స్ తినడం ఆమెకు అలవాటు. అవి కొనడానికి వంద నోట్లు లేకపోవడంతో అప్పు తీసుకున్నానని తెలిపారు. -
వాళ్లడిగితే నేను కాదంటానా?
‘‘మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందంటారు. నేను దీన్నే కొంచెం రివర్స్ చేసి చెబుతా. ఒక సినిమా ఎవరికి దక్కాలని రాసి పెట్టి ఉంటే వాళ్లకే దక్కుతుంది’’ అని కృతీ సనన్ అంటున్నారు. ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతీ సనన్ ‘హీరో పంతి’తో బాలీవుడ్లో బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు, మూడు సినిమాలు చేస్తూ కృతి బిజీగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ సరసన ‘సుల్తాన్’లో నటించే అవకాశం ఈ బ్యూటీని వరించిందనే వార్త హల్చల్ చేస్తోంది. కథానాయిక అయిన ఏడాదికే సల్మాన్‌తో అవకాశం కొట్టేసిందని కొంతమంది తారలు అసూయపడుతున్నారట. కానీ, ఏమీ లేని విషయానికి అనవసరంగా అసూయపడుతున్నారని కృతి అంటున్నారు. అసలు ‘సుల్తాన్’ చిత్రానికి ఆమెను అడగలేదట. ఒకవేళ అడిగితే నేనెందుకు కాదంటాను? అంటున్నారామె. సల్మాన్‌తో సినిమా కాబట్టి, వెంటనే ఒప్పేసుకుంటా అని పేర్కొన్నారు కృతీ సనన్. -
సరికొత్త తెలుగు సినిమా ఇది..! - నాగచైతన్య
‘‘ఆరు నెలల క్రితం సుధీర్ వర్మ ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా బావుందనిపించింది. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, కృతీ సనన్ జంటగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘దోచేయ్’. సుధీర్‌వర్మ దర్శకుడు. సన్నీ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని నాగార్జున ఆవిష్కరించి కీరవాణికి అందజేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, ‘‘సన్నీ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. మేధావులు మాత్రమే మేజర్ స్కేల్లో పాటలు ఇస్తారు. సన్నీ ఈ సినిమాలో చేసిందదే. ‘స్వామి రారా’ లో సుధీర్ వర్మ పనితనం నాకు బాగా నచ్చింది’’ అని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ, ‘‘సరికొత్త తెలుగు సినిమా ఇది. సుధీర్ వర్మ చాలా బాగా తీశాడు. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. సుధీర్ వర్మ మాట్లాడుతూ, ‘‘ ఈ సినిమా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నిర్మాతలకు, హీరో చైతూకు నా థ్యాంక్స్. సన్నీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో సినిమా హీరోగా నటించాను. చాలా వెరైటీగా కామెడీ చేయించాడు దర్శకుడు సుధీర్. చైతన్య ఎప్పుడూ తనకు నచ్చే, నప్పే పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని అన్నారు. ‘‘దర్శకునికి తాను తీయాలనుకున్న సినిమా గురించి, కథ గురించి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకు ‘స్వామి రారా’ సినిమా చూశాక సుధీర్‌లో ఉందనిపించింది. ఈ సినిమాలో పాజిటివ్ లుక్ కనిపిస్తోంది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ వేడుకలో హీరోయిన్ కృతీ సనన్, పోసాని కృష్ణమురళి, దర్శకులు సుకుమార్, చందు మొండేటి, నటులు రాజా రవీంద్ర, రవివర్మ, తదితరులు పాల్గొన్నారు. -
అక్కీతో లక్కీ ఛాన్స్
కృతీ సనన్ గుర్తుంది కదూ! ‘1’ సినిమాలో మహేశ్‌బాబు సరసన నటించిన 23 ఏళ్ల ఈ ఢిల్లీ భామకు తొలి సినిమాతోనే తెలుగునాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత తెలుగులో చాలా మంచి అవకాశాలే వచ్చాయి. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి తొలుత కృతీనే కథానాయికగా అనుకున్నారు. అయితే కృతి అప్పటికే హిందీలో ‘హీరోపంతి’ సినిమా ఒప్పుకోవడంతో తెలుగుకి కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది. సీనియర్ హీరో జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందిన ‘హీరోపంతి’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, కృతీ సనన్‌కి మాత్రం మంచి కితాబులే దక్కాయి. దాంతో పాటే ఓ గొప్ప సినిమా ఛాన్స్ కూడా వచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో కృతీని నాయికగా ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రంలో ఎవరెవరినో నాయికలుగా అనుకున్నారు. దర్శకుడు ప్రభుదేవా అనుకోకుండా ‘హీరోపంతి’ చూసి, వెనువెంటనే కృతీకి ఫోన్ చేసి ఈ సినిమా అవకాశాన్ని ఖరారు చేసేశారు. అక్కీ లాంటి సీనియర్ హీరోతో లక్కీ ఛాన్స్ కొట్టేసినందుకు కృతీ గాలిలో తేలుతోంది. తెలుగులో బన్నీ సరసన కూడా ఓ సినిమా చేయనుందని ఫిలిమ్‌నగర్ సమాచారం.