ks Lakshmana Rao
-
అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం దారుణం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కోనసీమ జిల్లాకు పెట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం దారుణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మండిపడ్డారు. గురువారం గుంటూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు, దళిత, బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు రాని అభ్యంతరం.. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టినందుకు రావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం కోనసీమకు అంబేడ్కర్ పేరును కొనసాగించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ ప్రపంచ మేధావి పేరును వ్యతిరేకించడం సరికాదన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ మాట్లాడుతూ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 5న చలో అమలాపురానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ నేతలు అంబేడ్కర్‌ను చులకన చేసి మాట్లాడుతున్నారని, ఇందుకు సోము వీర్రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెడ్డి జనసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.అంజనీశ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
తాడోపేడో తేల్చుకుంటాం...
పట్నంబజారు(గుంటూరు) : కార్మికుల కష్టాలు పట్టించుకోకుండా, సొంత ప్రయోజనాల కోసం కుట్ర పన్నుతున్న భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకుంటామని జూట్ మిల్లు పరిరక్షణ సమితి అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను కాదని మిల్లు తెరవకుండా వ్యవహరిస్తున్న తీరుపై పరిరక్షణసమితి సభ్యులు, కార్మికులు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా, అప్పిరెడ్డి మాట్లాడుతూ యాజమాన్యం మెడలు వంచైనా మిల్లు లాకౌట్‌ను ఎత్తివేసేలా చేస్తామన్నారు. అవసరమైతే ఎంతటి ఆందోళనలకైనా వెనకాడబోయేది లేదన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పలుమార్లు వారించినా ప్రతిఫలం కనబడలేదు. దీనితో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కాంతి లాల్‌దండే స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులకు సర్దిచెప్పారు. రోడ్డుపైనే కార్మికులు, పరిరక్షణ సమితి సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం మిల్లులో నెలకొన్న సమస్యలను సమితి సభ్యులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కార్మికుల సమస్యలను సావధానంగావిన్న కలెక్టర్ యాజమాన్య మొండి వైఖరిని ప్రభుత్వం, కార్మికశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 5.28 ఎకరాల భూమి విషయంలో కమిషనర్‌తో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టర్ హామీతో నేతలు, కార్మికులు ఆందోళన విరమించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మిల్లు యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కించటం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ అవసరమైతే కార్మికులతో కలసి మిల్లు తలుపులు బద్ధలు కొట్టేందుకు కూడా వెనుకాడబోమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎర్ర జెండాలు వారికి అండగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి సభ్యులు ఎం.భావన్నారాయణ, శృంగారపు శ్రీనివాసరావు, ఎబ్బూరి పాండురంగా అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
గుంటూరు-కృష్ణా టీచర్స్ ఎమ్మెల్సీగా ఏఎస్ రామకృష్ణ
గుంటూరు : గుంటూరు-కృష్ణా జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఏఎస్ రామకృష్ణ గెలుపొందారు. ఏఎస్ రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై తొలి ప్రాధాన్యత ఓటుతో ఆయన విజయం సాధించారు. యూటీఎఫ్ తరపున బరిలోకి దిగిన ఏఎస్ రామకృష్ణకు 7,146 ఓట్లు రాగా, కేఎస్ లక్ష్మణరావుకు 5,392 ఓట్లు వచ్చాయి. కాగా తొలి నుంచి చివరి వరకూ ఏఎస్ రామకృష్ణకు లక్ష్మణరావు పోటీ ఇచ్చారు. మరోవైపు రాజకీయంగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ఓట్లు వేయించుకున్నారని లక్ష్మణరావు ఆరోపించారు. కులపరంగా , వర్గ పరంగా టీచర్లను ఒత్తిళ్లకు గురిచేశారన్నారు. అయినా పెద్ద ఎత్తున టీచర్లు తనకు ఓట్లు వేశారని లక్ష్మణరావు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటా
కేఎస్ లక్ష్మణరావు స్పష్టీకరణ అవనిగడ్డ : కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తాను మరోసారి పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో తనకు యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగనున్నానని వివరించారు. పోస్టుల కుదింపు విచారకరం... ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన డీఎస్సీ నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో ఏమాత్రం సంతోషం నింపలేకపోయిందని, పోస్టుల సంఖ్య కుదించడమే దీనికి కారణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 10,600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయాల్సి ఉండగా కేవలం 9,060 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం విచారకరమన్నారు. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును ఇటీవల కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో వారంతా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. 58 నుంచి 60 సంవత్సరాలకు ఎయిడెడ్ ఉపాధ్యాయుల వయోపరిమితిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు యూటీఎఫ్ నాయకులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యుడు వీ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.