kt ramarao
-
రూ.6200 కోట్లతో ‘కాపిటాలాండ్’
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ఐటీపీహెచ్)లో డేటా సెంటర్ వృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, కాపిటాలాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ (క్లైంట్) నడుమ మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్ 36 మెగా వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తొలిదశలో రూ.1200 కోట్ల అంచనా పెట్టుబడితో వృద్ధి చేసే ఈ డేటా సెంటర్ వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్లైంట్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ఈ డేటా సెంటర్లో కూలింగ్, భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతో పాటు ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌ను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి ఆరు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తామని, రెండో దశలో భాగంగా మరో రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడుతామని క్లైంట్ వెల్లడించింది. కేవలం డేటా సెంటర్ వృద్ధికే పరిమితం కాకుండా క్లైంట్ లాజిస్టిక్స్, సౌర విద్యుత్ ప్లాంట్ల వంటి మౌలిక వసతుల రంగంలోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించింది. డేటా సెంటర్లలో హైదరాబాద్ వృద్ది భారత్‌లో డేటా సెంటర్ల రంగంలో హైదరాబాద్ అతివేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాపిటాలాండ్‌తో కేవలం డేటా సెంటర్ల రంగంలోనే కాకుండా ఇతర మౌలిక వసతుల కల్పన రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. కాపిటాలాండ్ వచ్చే ఐదేళ్లలో ఆఫీస్ స్పేస్‌ను రెట్టింపు చేయడం హైదరాబాద్ ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అన్నారు. యూరోప్, ఆసియా ఖండంలో 25 డేటా సెంటర్లను కలిగిన క్లైంట్ భారత్‌లో రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో వృద్ధి చేస్తుందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లైంట్కు ఇప్పటికే స్థానికంగా ఐటీపీహెచ్, సైబర్ పెరల్, అవెన్స్ పేరిట మూడు బిజినెస్ పార్కులు ఉన్నాయని సంస్థ సీఈఓ సంజీవ్ దాస్‌గుప్తా వెల్లడించారు. 2.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బిజినెస్ పార్కులు 30వేల మందికి ఉపాధి కల్పిస్తున్న 70 అంతర్జాతీయ సంస్థల అవసరాలు తీరుస్తున్నాయని చెప్పారు. యూరోప్, ఆసియా దేశాల్లో 500 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 25 డేటా సెంటర్లను క్లైంట్ అభివృద్ధి చేసిందన్నారు. -
హైదరాబాద్‌లో హైటెక్ బస్‌స్టాపులు
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్కండీషనింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఏటీఎం, కాఫీ మిషన్లు, వైఫై, సీసీ టీవీ, టాయిలెట్లు ఇవన్నీ ఇప్పటిదాక మనం ఎయిర్‌పోర్టులో లేదా మెట్రో స్టేషన్లలోనే చూసేవాళ్లం. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్‌స్టాపుల్లో కూడా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో బస్‌స్టాపులను(బస్షెల్టర్లను) ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్ చార్జింగ్, టాయిలెట్లు ఉండేలా ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్‌షెల్టర్‌ను శిల్పారామం వద్ద రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసు దగ్గర, కూకట్‌పల్లికి దగ్గరిలో కేపీహెచ్‌బీ వద్ద మరో రెండు ఆధునిక లేదా గ్రేడ్ 1 బస్షెల్టర్లు తుది దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 ఆధునిక బస్షెల్టర్లను నాలుగు ప్యాకేజీలలో జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. వీటిలో మొదటి గ్రేడ్‌లో అడ్వాన్స్డ్ ఏసీ బస్షెల్టర్లను నిర్మిస్తున్నారు. కేవలం పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్-2 బస్షెల్టర్లలో డస్ట్బిన్లు, టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, తాగునీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్-3 బస్‌షెల్టర్‌లో డస్ట్‌బిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం ఉండనుంది. గ్రేడ్-4లో కేవలం బస్షెల్టర్తో పాటు డస్ట్బిన్లే ఉంటాయి. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా 826 బస్షెల్టర్లను విభజించి టెండర్ ద్వారా వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. అత్యాధునిక బస్షెల్టర్లతో ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో మాదిరిగా నగరవాసులకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
గంగిరెద్దులు వస్తున్నాయి?
సాక్షి,మహబూబాబాద్/కరీమాబాద్: ‘‘సంక్రాంతి మొన్ననే పోయింది కదా.. ఊళ్లోకి ఇప్పుడెందుకు గంగిరెద్దులు వస్తున్నాయి’’అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావు ఎద్దేవా చేశారు. పాలేరులో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకుల నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. బుధవారం వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షమే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి రైతుబంధు పథకం కింద ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.8 వేలు ఇస్తామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 2,630 తండాలను పంచాయతీలుగా చేశామని వివరించారు. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఆపరేటర్స్లతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. వరంగల్‌లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాస్టర్ ప్లాన్‌పై ఆయన సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్, టూరిజం, టెక్స్టైల్ పార్కు, ఉద్యోగ కల్పనను దృష్టిలో ఉంచుకుని 9 నెలలుగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు ఇన్నర్ రింగ్‌రోడ్డు కూడా ఉండాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌లో మాదిరిగా అర్బన్ ల్యాండ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 500 ఎకరాల మేర ల్యాండ్‌పుల్లింగ్ చేయాలని మంత్రి సూచించారు. పిక్ ఆఫ్ ది డే షేక్‌హ్యాండ్ ఇచ్చిన పోలీస్ జాగిలం ట్విట్టర్లో పోస్టు చేసిన మంత్రి కేటీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసు బందోబస్తులో భాగంగా వచ్చిన శునకం ఆయన్ని ఆకట్టుకుంది. ‘కుడా’కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొనేందుకు సమావేశ మందిరంలోకి వెళ్తుండగా అక్కడే ఉన్న శునకం.. మంత్రికి సెల్యూట్ చేసింది. ఆ వెంటనే షేక్‌హ్యాండ్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. పర్యటన అనంతరం మంత్రి తన ట్విట్టర్లో ఆ ఫొటోను పోస్టు చేస్తూ ‘మై ఫేవరేట్ పిక్ ఆఫ్ ది డే ఫ్రం వరంగల్, రాన్ ఇంటూ స్వీటీ, ఈ పోలీస్ కెనీన్ హూ ఆఫర్డ్ ఏ వార్మ్ హ్యాండ్‌షేక్’అంటూ కామెంట్ రాశారు. -
రాష్ట్ర మంత్రుల మెట్రో ట్రయల్ రన్ నేడు
సాక్షి, హైదరాబాద్: మెట్రో జర్నీని స్వయంగా పరిశీలించేందుకు మున్సిపల్ మంత్రి కేటీ రామారావు సహా పలువురు రాష్ట్ర మంత్రులు శనివారం మెట్రోరైలులో ప్రయాణించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకోనున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ ట్రయల్ రన్లో పాలుపంచుకోనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. అయితే 28న ప్రధాని ప్రారంభించిన వెంటనే సాధారణ ప్రయాణీకులకు మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ.. ప్రధాని వ్యక్తిగత భద్రతా కారణాల రీత్యా చివరి నిమిషంలో ఈ ప్రణాళికలో మార్పులుంటాయని అధికారులు తెలిపారు. అలా జరిగితే ఈనెల 29 నుంచి నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్లు సాధారణ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని స్పష్టతనిచ్చారు. నేడు అధికారికంగా మెట్రో చార్జీల ప్రకటన? మెట్రో రైలు కనిష్ట, గరిష్ట చార్జీలు, పార్కింగ్ రుసుములను శనివారం మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే మెట్రోలో కనీస చార్జీ రూ.12.. గరిష్టంగా రూ.45 ఉంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేస్తేనే దీనిపై స్పష్టత రానుంది. -
నాణ్యతకు పెద్ద పీట : మంత్రి కేటీఆర్
సనత్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ‘28వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ -2014’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పౌర సరఫరాలు, గృహ నిర్మాణ రంగాల్లో నాణ్యత ఉండేలా దృషి టసారించామన్నారు. రాష్ట్రంలో 84 లక్షల ఇళ్లు ఉండగా, ఒక కోటి ఏడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ క్రమంలో అర్హులైన వారికి నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను చేపట్టామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ‘మై విలేజ్-మైప్లాన్, మై టౌన్-మై ప్లాన్’ పేరిట కింది స్థాయి నుంచి నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్‌లాంటి ఆస్పత్రులు, ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉత్పత్తులను అందిస్తున్న వివిధ సంస్థలకు క్యూసీఎఫ్ఐ అవార్డులను ప్రదానం చేసింది. వీటిని మంత్రి చేతుల మీదుగా ఆయా సంస్థల ప్రతినిధులు అందుకున్నారు. కార్యక్రమంలో క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీహెచ్.బాలకృష్ణారావు, ఎమిరటస్ చైర్మన్ ఎ.శ్యాంమోహన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీకే శ్రీవాత్సవ, క్యూసీఎఫ్ఐ వైస్ చెర్మన్ మనోహర్ హెడ్జ్, సెక్రటరీ విశాల్‌కరణ్, సీనియర్ సలహాదారుడు బి.సుబ్రమణ్యం పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న సంస్థలు.. బీహెచ్ఈఎల్, ఎన్ఎండీసీ, అమర్ రాజా బ్యాటరీస్, సోలార్ సెమీ కండక్టర్స్, రామ్‌కో సిమెంట్, ఉషా ఇంటర్నేషనల్, ఏపీఎస్ఆర్టీసీ, ఎన్ఆర్బీ బేరింగ్స్. -
హైదరాబాద్‌లో భూకబ్జాదారులను కాపాడేందుకే..
కరీంనగర్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. గవర్నర్‌కు హైదరాబాద్‌పై అధికారాలను అప్పగించడాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్‌లో భూకబ్జాదారులను కాపాడేందుకు కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని కేటీఆర్ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఎన్ని నిబంధనలు పెట్టినా రుణమాఫీ చేస్తామని తెలిపారు. -
250 కి.మీ. మెట్రో
మెట్రోరైల్ ప్రాజెక్టును మరింత విస్తరిస్తాం: కేటీఆర్ హైదరాబాద్: మెట్రోరైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం కొనసాగుతున్న 72 కిలోమీటర్ల మెట్రోరైల్ మార్గాన్ని రానున్న రెండు దశాబ్దాల కాలంలో 250 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ (ఐఎంఆర్‌టీ) ఆధ్వర్యంలో దేశంలోనే ప్రప్రథమంగా ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ’ (పీజీపీఎంఆర్టీ) కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అమీర్‌పేట్‌లోని మ్యారీగోల్డ్ హోటల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. నగర చారిత్రక వైభవం చెక్కుచెదరకూడదన్న ఉద్దేశంతోనే చారిత్రక కట్టడాలున్న ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్లో మార్పులు చేయాలని ప్రభుత్వం హెచ్ఎంఆర్ సంస్థకు పలు సూచనలు చేసిన మాట నిజమేనని, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆ సంస్థ ఆలోచిస్తోందన్నారు. దీనిపై నిపుణుల నివేదిక వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అధిగమించి మెట్రోరైల్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. మార్చి నాటికి పరుగులు.. 2015, మార్చి 21న ఉగాది పర్వదినం కానుకగా నాగోలు-మెట్టుగూడా మధ్య 8 కి.మీ. మార్గంలో మెట్రోరైల్ పరుగులు తీస్తుందని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రూట్లో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లు చెప్పారు. ట్రయల్ రన్‌ను ఆగస్టు నెలాఖరులో నిర్వహించే అవకాశాలున్నాయన్నారు. చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోనికి తీసుకున్నట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎదురుగా, సుల్తాన్‌బజార్ వద్ద అలైన్మెంట్లో మార్పులపై దృష్టిసారించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఈమేరకు ప్రత్యామ్నాయ మార్గాలను సాంకేతికంగా పరిశీలిస్తున్నామని, ఈ మేరకు ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ సంస్థ నిపుణులు సమగ్రంగా సర్వే జరుపుతున్నారన్నారు. సీఎం నిర్ణయం మేరకే పనులు చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్ఎంఆర్ ఎల్)సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, మెట్రోరైల్ ప్రాజెక్టుపై సర్వాధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నాయని ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ చురుకుగా పనిచేస్తుం దని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు పనులు,హెచ్ఎంఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిందని వెలువడుతోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రోరైల్ నిర్మాణం అరుదైన రికార్డు సాధించిందన్నారు. మొత్తం 72 కిలోమీటర్లకు గాను 27 కిలోమీటర్ల మేర పనులను 20 నెలల్లో పూర్తి చేసినట్లు ఎన్వీఎస్రెడ్డి గుర్తుచేశారు.