సాక్షి, హైదరాబాద్: మెట్రో జర్నీని స్వయంగా పరిశీలించేందుకు మున్సిపల్ మంత్రి కేటీ రామారావు సహా పలువురు రాష్ట్ర మంత్రులు శనివారం మెట్రోరైలులో ప్రయాణించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకోనున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ ట్రయల్ రన్‌లో పాలుపంచుకోనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
అయితే 28న ప్రధాని ప్రారంభించిన వెంటనే సాధారణ ప్రయాణీకులకు మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ.. ప్రధాని వ్యక్తిగత భద్రతా కారణాల రీత్యా చివరి నిమిషంలో ఈ ప్రణాళికలో మార్పులుంటాయని అధికారులు తెలిపారు. అలా జరిగితే ఈనెల 29 నుంచి నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్లు సాధారణ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని స్పష్టతనిచ్చారు.
నేడు అధికారికంగా మెట్రో చార్జీల ప్రకటన?
మెట్రో రైలు కనిష్ట, గరిష్ట చార్జీలు, పార్కింగ్ రుసుములను శనివారం మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే మెట్రోలో కనీస చార్జీ రూ.12.. గరిష్టంగా రూ.45 ఉంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేస్తేనే దీనిపై స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment