250 కి.మీ. మెట్రో
మెట్రోరైల్ ప్రాజెక్టును మరింత విస్తరిస్తాం: కేటీఆర్
హైదరాబాద్: మెట్రోరైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం కొనసాగుతున్న 72 కిలోమీటర్ల మెట్రోరైల్ మార్గాన్ని రానున్న రెండు దశాబ్దాల కాలంలో 250 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ (ఐఎంఆర్‌టీ) ఆధ్వర్యంలో దేశంలోనే ప్రప్రథమంగా ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ’ (పీజీపీఎంఆర్‌టీ) కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అమీర్‌పేట్‌లోని మ్యారీగోల్డ్ హోటల్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. నగర చారిత్రక వైభవం చెక్కుచెదరకూడదన్న ఉద్దేశంతోనే చారిత్రక కట్టడాలున్న ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం హెచ్‌ఎంఆర్ సంస్థకు పలు సూచనలు చేసిన మాట నిజమేనని, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆ సంస్థ ఆలోచిస్తోందన్నారు. దీనిపై నిపుణుల నివేదిక వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అధిగమించి మెట్రోరైల్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు.
మార్చి నాటికి పరుగులు..
2015, మార్చి 21న ఉగాది పర్వదినం కానుకగా నాగోలు-మెట్టుగూడా మధ్య 8 కి.మీ. మార్గంలో మెట్రోరైల్ పరుగులు తీస్తుందని హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రూట్లో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లు చెప్పారు. ట్రయల్ రన్‌ను ఆగస్టు నెలాఖరులో నిర్వహించే అవకాశాలున్నాయన్నారు. చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోనికి తీసుకున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎదురుగా, సుల్తాన్‌బజార్ వద్ద అలైన్‌మెంట్‌లో మార్పులపై దృష్టిసారించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఈమేరకు ప్రత్యామ్నాయ మార్గాలను సాంకేతికంగా పరిశీలిస్తున్నామని, ఈ మేరకు ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ సంస్థ నిపుణులు సమగ్రంగా సర్వే జరుపుతున్నారన్నారు. సీఎం నిర్ణయం మేరకే పనులు చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్‌ఎంఆర్ ఎల్)సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, మెట్రోరైల్ ప్రాజెక్టుపై సర్వాధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నాయని ఎన్వీఎస్‌రెడ్డి స్పష్టం చేశారు. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ చురుకుగా పనిచేస్తుం దని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు పనులు,హెచ్‌ఎంఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిందని వెలువడుతోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రోరైల్ నిర్మాణం అరుదైన రికార్డు సాధించిందన్నారు. మొత్తం 72 కిలోమీటర్లకు గాను 27 కిలోమీటర్ల మేర పనులను 20 నెలల్లో పూర్తి చేసినట్లు ఎన్వీఎస్‌రెడ్డి గుర్తుచేశారు.