Kubeer
-
తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం
భైంసా టౌన్: 200 ఏళ్లకుపైగా పురాతన శివాలయం, ప్రకృతి ఒడిలో, పచ్చని చెట్ల మధ్య వెలిసింది. పక్కనే జలపాతం అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఎతైన గుట్టలు, పక్కనే జాలువారే జలపాతం.. వీటి మధ్యన వెలిసిన పురాతన శివాలయం.. వెరసి కుభీర్ మండలంలోని బ్రహ్మేశ్వరాలయం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు చేసేందుకు శని, సోమవారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చి పూజలు చేస్తారు. గ్రామం: బ్రహ్మేశ్వర్, మండలం: కుభీర్ భైంసా నుంచి దూరం: 20 కి.మీ(దాదాపు) ఆలయ చరిత్ర... బ్రహ్మేశ్వర ఆలయానికి దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వనవాసం సమయంలో రామలక్ష్మణులు, సీత ఇక్కడ సంచరించారని, శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేశారని నమ్ముతారు. తమ తాతల కాలం నుంచి ఆలయం ఉందని, శివరాత్రితోపాటు ఏటా శ్రావణమాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారని చెబుతున్నారు. ఆకట్టుకునే వాతావరణం.. భైంసా నుంచి దాదాపు 20కి.మీ దూరంలో ఉండే బ్రహ్మేశ్వర్ గ్రామంలోని బ్రహ్మేశ్వరాలయం పరిసరాలు, అక్కడి వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయ సమీపంలోని జలపాతంలో స్నానాలు చేస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు దూరప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు. పురాతన ఆలయంగా ప్రసిద్ధి.. కొత్త పంచాయతీలతో బ్రహ్మేశ్వర్ జీపీగా ఏర్పడింది. ఇక్కడి శివాలయానికి దాదాపు 200ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. - దత్తురాం, బ్రహ్మేశ్వర్ గ్రామస్తుడు -
సర్కారు జీతం.. ‘ప్రైవేట్’లో పాఠం!
సాక్షి, నిర్మల్: సర్కారు బడిలో హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం ఓ వైపు మాసోత్సవానికి సిద్ధమవుతుంటే.. పాఠాలు చెప్పాల్సిన సార్లూ బడిబాట పట్టడం లేదు. విద్యాశాఖలోని లొసుగులను, జిల్లా అధికారుల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా చేస్తున్నారు. బాధ్యతల పేరు చెప్పి.. నిబంధనలకు విరుద్ధంగా బడికి వెళ్లకుండా జిల్లాకేంద్రంలోనే మకాం వేస్తున్నారు. ప్రాథమిక విధిగా పేర్కొనే విద్యాబోధననే మరిచిపోతున్నారు. కనీసం తాము తీసుకుంటున్న వేతనానికి న్యాయం చేయడం లేదు. తమను నమ్మి బడికి వస్తున్న విద్యార్థుల జీవితాలకూ భరోసానివ్వడం లేదు. జిల్లాలోని పలువురు ఉపాధ్యాయుల తీరుపై సంబంధిత పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వీటిని పట్టించుకుని.. సదరు సార్లను గాడిన పెట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు సైతం ఆ ఉపాధ్యాయులకే వంత పాడుతుండటం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పనులు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. తమ విధి నిర్వహణను సకాలంలో.. సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుంది. కానీ.. కొంతమంది సార్లు మాత్రం తమకు నెలనెలా వేలకు వేలు వేతనా న్ని ఇస్తున్న జీతానికి న్యాయం చేయడం లేదు. ప్రైవేట్ పనులకు, తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకే ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఓ జిల్లాస్థాయి బాధ్యతలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు విధులకు ఎగనామం పెడుతూ తమ ప్రైవేట్ విద్యాసంస్థల్లో తరగతులు బోధిస్తున్నారు. బడిలో ఉండాల్సిన సమయంలో తన భాగస్వామ్య విద్యాసంస్థలో గడుపుతున్నారు. ఏకంగా కళాశాల విద్యార్థుల చేరిక కోసం నిర్వహించే ప్రచారంలో నేరుగా పాల్గొంటున్నారు. నిబంధనల ప్రకారం తను చేపట్టాల్సింది కేవలం అదనపు బాధ్యత. యథావిధిగా విద్యాబోధన చేస్తూ ఆ బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తన పోస్టును సాకుగా పెట్టుకుని సదరు పెద్దసారు బడికి వెళ్లడం లేదు. జిల్లాకేంద్రంలోనే మరికొందరు ఉపాధ్యాయులు సైతం పాఠశాలలో ఉండాల్సిన సమయాల్లో తమ సొంత వ్యాపారాలు, విద్యాసంస్థల్లో గడుపుతున్నారు. సరిహద్దు మండలాల్లో.. జిల్లాకేంద్రానికి దూరంగా ఉన్న సరిహద్దు మండలాల్లోనే ఉపాధ్యాయుల ఆన్‌డ్యూటీ గైర్హాజర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కుభీర్ మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నామ్ కే వాస్తేగా.. బడికి వెళ్తున్నారు. ఈ మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెలల తర బడి గైర్హాజరవుతున్నారు. ఇదే మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ ఉపాధ్యాయులు విద్యావలంటీర్లను నియమించుకుని విధులకు ఎగనామం పెడుతున్నారు. ఇక చాలామంది ఉపాధ్యాయులు పాఠశాల వేళలను కూడా పాటించడం లేదు. కొంతమంది ఉపాధ్యాయుల తీరుతో మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని సర్కారు సార్లే చెబుతున్నారు. ఫిర్యాదులు చేసినా.. ‘తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు వచ్చారని అనుకున్నాం.. కానీ ఆ పెద్దసారు బడికే రారు. నెలలో ఒకట్రెండు సార్లు వచ్చి చుట్టపుచూపు లెక్క వచ్చిపోతున్నరు. ఇక మా పిల్లలకు సదువులు ఎట్లా...’ అంటూ కుభీర్ మండలంలోని ఓ గ్రామస్తులు కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇది చేసి ఏడాది గడుస్తోంది. ఓ విద్యాసంవత్సరం కూడా పూర్తయ్యింది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. ఆ సారూ... ఇప్పటికీ అదే తీరు కొనసాగిస్తున్నారు. వారాల తరబడి స్కూల్‌కు రాకుండా జిల్లాకేంద్రంలోనే ఉంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతల పేరిట పాఠాలు చెప్పాల్సిన బడిని మోసం చేస్తున్నారు. ఇదంతా జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారు లకు తెలిసినా.. కనీసం పట్టించుకున్న దాఖలా లు లేవు. చివరకు ఆ గ్రామస్తులే విసిగి వేసారి.. తమ పిల్లలను సర్కారు బడి మార్పించి, పక్క ఊరిలోని ప్రైవేట్ స్కూల్‌కు పంపుతున్నారు. వ్యవస్థపైనే మచ్చగా.. ‘ప్రభుత్వ బడి పిల్లలు–ప్రతిభ గల పిడుగులు’.. అన్నట్లుగా తమను నమ్మి వచ్చిన పేద పిల్లలకు చక్కటి చదువులను అందిస్తున్న సర్కారు బడిసార్లు ఎందరో ఉన్నారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో అంకితభావంతో పనిచేస్తూ.. భావి సమాజాన్ని తీర్చిదిద్దుతున్న గురువులున్నారు. కానీ.. కొంతమంది దారి తప్పుతున్న ఉపాధ్యాయుల తీరుతో మొత్తం వ్యవస్థకే మచ్చ వస్తోంది. ‘ఆ సార్.. సైన్స్ బాగా చెబుతారట. పాఠం చెబితే చక్కగా అర్థమవుతుందట. కానీ ఏం లాభం.. ఆ సారు బడికి రానేరారు. ఎప్పుడో ఓసారి వచ్చిపోతారు..’ అని నిట్టూరుస్తున్న విద్యార్థుల ముఖాల ను చూసైనా ఈ మాస్టర్లు మారాల్సిన అవస రం ఉంది. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులూ తమ పర్యవేక్షణ లోపాలను సవరించుకోవాల్సి న బాధ్యత కూడా ఉందని తల్లిదండ్రులు పే ర్కొంటున్నారు. బడిలో విద్యార్థులకు హాజరు మాసోత్సవాన్ని నిర్వహించినట్లే..సదరు సార్లూ బడికి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
కుబీర్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలం పాడిపి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరిపెల్లి గ్రామం ఒకటవ తాండాకు చెందిన బాబూరావు(55) అనే వ్యక్తి మోటారుబైక్పై వెళుతూ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న మోరీ బ్రిడ్జికి ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. -
సంబరంగా.. ‘సట్ల’ సందడి!!
కుక్కలో భగవంతుణ్ణి (మల్లన్న దేవుణ్ణి) చూసుకుని పూజిస్తారిక్కడి ప్రజలు. విశ్వాసంతో తమ పంటలను, పశు, పక్ష్యాదులను కంటికి రెప్పలా కాపాడే మల్లన్నలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మల్లన్న దేవుణ్ణి బంతి పూలదండలతో అలంకరిస్తారు. పట్టెమంచంపై కూర్చుండ బెడతారు. ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలతో కడుపారా భోజనాలు పెడతారు. ఏటా డిసెంబర్ నుంచి జనవరి వరకు అంటే దత్త పౌర్ణమి నుండి ముజ్గ పౌర్ణమి వరకు సుమారు నెల రోజుల పాటు ప్రతి ఆదివార మూ ఘనంగా జరుపుకుంటారు. ఈ సట్టి పండగ సందడి ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఘనంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ తాలుకా పరిధిలో ఉన్న కుబీర్, ముథోల్, తానూరు, లోకేశ్వరం, కుంటాల, మండలాల తదితర గ్రామాలలోనూ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోనూ వ్యవసాయాధారిత కుటుంబాలు ఈ పండగను ఘనంగా నిర్వహిస్తారు. బంధువులను, స్నేహితులను ఇంటికి పిలిపించుకుని సాంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. గ్రామంలోని ఒక్కో కులస్తులు ఒక్కో రోజు చొప్పున ఈ పండగను నిర్వహిస్తారు. సట్టి పండగ రోజున ఇల్లంతా శుభ్రంగా కడుక్కుని ఇంటిని బంతిపూలతోరణాలతో అలంకరిస్తారు. గోధుమలతో పాయసం వండుతారు. కొత్త బియ్యం, ఇతర పప్పుదినుసులు (నవధాన్యాలు)లతో పలు రకాల వంటలు చేస్తారు. ఆ వంట పాత్రలను కూడా పూలదండలతో అలంకరిస్తారు. అనంతరం గ్రామ దేవతలు మహాలక్ష్మి అమ్మవారు, ఉరడమ్మ, పోశమ్మ, మైసమ్మ.. ఇలా ఒక్కో గ్రామానికి ఒక్కో పేరుతో వెలసిన అమ్మ వార్లకు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం ఇంటికి వచ్చిన తమ పెంపుడు కుక్క (మల్లన్న దేవుని)ను ప్రత్యేకంగా అలంకరిస్తారు. మెడలో బంతిపూల మాలలు వేసి, పట్టెమంచంపై కూర్చోబెట్టి తాము తయారు చేసిన వంటకాలతో కడుపారా భోజనం పెడతారు. తర్వాత ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేస్తారు. దుక్కి దున్నే నాటి నుంచి పంటలు చేతికందే వరకు తమకు తోడు, నీడగా నిలిచిన వ్యవసాయ కూలీల కుటుంబాలను సైతం ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెడుతుంటారు. పాడి రైతులు ఆ రోజు తమ ఇంటి పశువులు ఇచ్చిన పాలను బయట విక్రయించరు. ఎన్ని పాలు ఉత్పత్తి అయినా వాటిని వారే వినియోగించడం ఆనవాయితీ. ఈ సట్టి పండగ జరుపుకున్న తర్వాతే కొందరు రైతులు తమ పంట చేలల్లో పండించిన పంటలను భుజించే వారు. అప్పటివరకు ధాన్యాన్ని కూడా విక్రయించరు. ఈ పండగను నిష్టతో నిర్వహించిన ప్రతిరైతు ఇంట సిరుల పంట పండుతుందని నమ్మకం. ఇప్పటికీ కొన్ని రైతు కుటుంబాలు ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్