సాక్షి, నిర్మల్: సర్కారు బడిలో హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం ఓ వైపు మాసోత్సవానికి సిద్ధమవుతుంటే.. పాఠాలు చెప్పాల్సిన సార్లూ బడిబాట పట్టడం లేదు. విద్యాశాఖలోని లొసుగులను, జిల్లా అధికారుల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా చేస్తున్నారు. బాధ్యతల పేరు చెప్పి.. నిబంధనలకు విరుద్ధంగా బడికి వెళ్లకుండా జిల్లాకేంద్రంలోనే మకాం వేస్తున్నారు. ప్రాథమిక విధిగా పేర్కొనే విద్యాబోధననే మరిచిపోతున్నారు. కనీసం తాము తీసుకుంటున్న వేతనానికి న్యాయం చేయడం లేదు. తమను నమ్మి బడికి వస్తున్న విద్యార్థుల జీవితాలకూ భరోసానివ్వడం లేదు. జిల్లాలోని పలువురు ఉపాధ్యాయుల తీరుపై సంబంధిత పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వీటిని పట్టించుకుని.. సదరు సార్లను గాడిన పెట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు సైతం ఆ ఉపాధ్యాయులకే వంత పాడుతుండటం గమనార్హం.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పనులు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. తమ విధి నిర్వహణను సకాలంలో.. సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుంది. కానీ.. కొంతమంది సార్లు మాత్రం తమకు నెలనెలా వేలకు వేలు వేతనా న్ని ఇస్తున్న జీతానికి న్యాయం చేయడం లేదు. ప్రైవేట్ పనులకు, తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకే ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఓ జిల్లాస్థాయి బాధ్యతలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు విధులకు ఎగనామం పెడుతూ తమ ప్రైవేట్ విద్యాసంస్థల్లో తరగతులు బోధిస్తున్నారు. బడిలో ఉండాల్సిన సమయంలో తన భాగస్వామ్య విద్యాసంస్థలో గడుపుతున్నారు. ఏకంగా కళాశాల విద్యార్థుల చేరిక కోసం నిర్వహించే ప్రచారంలో నేరుగా పాల్గొంటున్నారు. నిబంధనల ప్రకారం తను చేపట్టాల్సింది కేవలం అదనపు బాధ్యత. యథావిధిగా విద్యాబోధన చేస్తూ ఆ బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తన పోస్టును సాకుగా పెట్టుకుని సదరు పెద్దసారు బడికి వెళ్లడం లేదు. జిల్లాకేంద్రంలోనే మరికొందరు ఉపాధ్యాయులు సైతం పాఠశాలలో ఉండాల్సిన సమయాల్లో తమ సొంత వ్యాపారాలు, విద్యాసంస్థల్లో గడుపుతున్నారు.
సరిహద్దు మండలాల్లో..
జిల్లాకేంద్రానికి దూరంగా ఉన్న సరిహద్దు మండలాల్లోనే ఉపాధ్యాయుల ఆన్‌డ్యూటీ గైర్హాజర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కుభీర్ మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నామ్ కే వాస్తేగా.. బడికి వెళ్తున్నారు. ఈ మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెలల తర బడి గైర్హాజరవుతున్నారు. ఇదే మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ ఉపాధ్యాయులు విద్యావలంటీర్లను నియమించుకుని విధులకు ఎగనామం పెడుతున్నారు. ఇక చాలామంది ఉపాధ్యాయులు పాఠశాల వేళలను కూడా పాటించడం లేదు. కొంతమంది ఉపాధ్యాయుల తీరుతో మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని సర్కారు సార్లే చెబుతున్నారు.
ఫిర్యాదులు చేసినా..
‘తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు వచ్చారని అనుకున్నాం.. కానీ ఆ పెద్దసారు బడికే రారు. నెలలో ఒకట్రెండు సార్లు వచ్చి చుట్టపుచూపు లెక్క వచ్చిపోతున్నరు. ఇక మా పిల్లలకు సదువులు ఎట్లా...’ అంటూ కుభీర్ మండలంలోని ఓ గ్రామస్తులు కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇది చేసి ఏడాది గడుస్తోంది. ఓ విద్యాసంవత్సరం కూడా పూర్తయ్యింది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. ఆ సారూ... ఇప్పటికీ అదే తీరు కొనసాగిస్తున్నారు. వారాల తరబడి స్కూల్‌కు రాకుండా జిల్లాకేంద్రంలోనే ఉంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతల పేరిట పాఠాలు చెప్పాల్సిన బడిని మోసం చేస్తున్నారు. ఇదంతా జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారు లకు తెలిసినా.. కనీసం పట్టించుకున్న దాఖలా లు లేవు. చివరకు ఆ గ్రామస్తులే విసిగి వేసారి.. తమ పిల్లలను సర్కారు బడి మార్పించి, పక్క ఊరిలోని ప్రైవేట్ స్కూల్‌కు పంపుతున్నారు.
వ్యవస్థపైనే మచ్చగా..
‘ప్రభుత్వ బడి పిల్లలు–ప్రతిభ గల పిడుగులు’.. అన్నట్లుగా తమను నమ్మి వచ్చిన పేద పిల్లలకు చక్కటి చదువులను అందిస్తున్న సర్కారు బడిసార్లు ఎందరో ఉన్నారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో అంకితభావంతో పనిచేస్తూ.. భావి సమాజాన్ని తీర్చిదిద్దుతున్న గురువులున్నారు. కానీ.. కొంతమంది దారి తప్పుతున్న ఉపాధ్యాయుల తీరుతో మొత్తం వ్యవస్థకే మచ్చ వస్తోంది. ‘ఆ సార్.. సైన్స్ బాగా చెబుతారట. పాఠం చెబితే చక్కగా అర్థమవుతుందట. కానీ ఏం లాభం.. ఆ సారు బడికి రానేరారు. ఎప్పుడో ఓసారి వచ్చిపోతారు..’ అని నిట్టూరుస్తున్న విద్యార్థుల ముఖాల ను చూసైనా ఈ మాస్టర్లు మారాల్సిన అవస రం ఉంది. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులూ తమ పర్యవేక్షణ లోపాలను సవరించుకోవాల్సి న బాధ్యత కూడా ఉందని తల్లిదండ్రులు పే ర్కొంటున్నారు. బడిలో విద్యార్థులకు హాజరు మాసోత్సవాన్ని నిర్వహించినట్లే..సదరు సార్లూ బడికి వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment