Kukatpally police station
-
తెల్లవారితే వివాహ నిశ్చితార్థం.. అంతలోనే మృత్యుముఖం
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: తెల్లవారితే ఆ యువతికి పెళ్లి నిశ్చితార్థం.. అంతలోనే ఆమెను రెయిలింగ్ రూపంలో మృత్యువు కబళించింది. మూడంతస్తుల భవనంపై నుంచి రెయిలింగ్ కూలి కింద కూర్చున్న యువతిపై పడటంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తమ గారాలపట్టి వివాహ నిశ్చితార్థ ఏర్పాటులో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కారంకోట గ్రామానికి చెందిన జట్టూరి శేఖర్, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు రోజా బీటెక్ పూర్తి చేసింది. ఆమె స్నేహితురాలు మౌనికతో పాటు మరో మిత్రురాలితో కలిసి కూకట్‌పల్లిలో గది అద్దెకు తీసుకొని ఉంటోంది. శామీర్‌పేట్‌లోని ఎస్పీ అక్యూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో రోజాకు వివాహం కుదిరింది. కొత్త దుస్తుల కోసం వెళ్లగా.. బుధవారం పెళ్లి ముహూర్తం పెట్టుకునే రోజు కావటంతో మంగళవారం సాయంత్రం కూకట్పల్లి బీజేపీ కార్యాలయం రోడ్డులోని శ్రీ బాలాజీ లేడీస్ ఫ్యాషన్ డిజైనర్స్ షాపులో దుస్తుల కోసం వెళ్లింది. ఆ సమయంలో షాపు యజమాని ఇంటికి వెళ్లటంతో బయట తన స్నేహితురాలు మౌనికతో వేచి చూస్తోంది. ఒక్కసారిగా షాపు భవనం మూడో అంతస్తు నుంచి రెయిలింగ్ విరిగి రోజా తలపై బలంగా పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సదరు భవనం ఓ ఎమ్మెల్యే బంధువులకు చెందింది కావటంతో కూకట్పల్లి పోలీసులు మృతురాలి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. -
బాబాయ్, అబ్బాయ్‌ల చోరీ పన్నాగం
హైదరాబాద్: ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిపాలు కావడంతో ఆయన కొడుకు ‘డ్యూటీ’లో చేరాడు. ఈ అబ్బాయ్.. తన బాబాయ్ సహకారంతో ఏటీఎంలోని 10లక్షలా30వేల800 రూపాయలను దోచుకెళ్లారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. శుక్రవారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.పురుషోత్తం వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి జయానగర్‌లోని శ్రీనిధి అపార్టుమెంట్లో నివాసం ఉండే గంగి మల్లయ్యకు ఇద్దరు కుమారులు. గంగిమల్లయ్య స్థానికంగా ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. ఈనెల 19న అనారోగ్యంతో జీడిమెట్లలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి ఖర్చుల కోసం రూ. 80వేలు అపార్టుమెంట్ యజమాని వద్ద అప్పుగా తీసుకున్నాడు. అయితే రెండవ కుమారుడు శేఖర్ మల్లయ్య స్థానంలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు రెండు గంటల ప్రాంతంలో ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి ఇంటికి వెళ్లి పడుకోవడాన్ని గమనించిన పెద్దకొడుకు గంగి మహేశ్(28) ఏటీఎంలో చోరీకి పన్నాగాన్ని రచించాడు. ఈనెల 21న ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటూ సెంట్రింగ్ పనిచేస్తున్న గంగి కిష్టయ్య అనారోగ్యంతో ఉన్న అన్నను చూసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అనంతరం మల్లయ్య పెద్దకొడుకు మహేశ్‌ను కలిశాడు. ఇద్దరు కలిసీ భాగ్యనగర్‌కాలనీలోని కల్లుకంపౌండ్లో కల్లుతాగారు. అప్పులు దూరం కావాలంటే ఏటీఎం కేంద్రంలో చోరీచేయాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు రాత్రి రెండుగంటల సమయంలో సెక్యూరిటీ గార్డు దుస్తులను ధరించిన మహేశ్ ఏటీఎం కేంద్రంలోనికి వెళ్లి కటింగ్ ప్లేయర్‌తో సీసీ కెమెరాల వైర్లను కట్‌చేశాడు. కిష్టయ్యతో కలిసి ఏటీఎంలో నగదు దాచే యంత్రాన్ని ధ్వంసం చేశారు. అందులో ఉన్న10లక్షల 30వేల 800వందల రెండువేలు, వంద రూపాయల నోట్లను తీసుకొని పరారయ్యారు. మరుసటిరోజు ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించిన ముంబయ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు కూకట్పల్లి సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి చూసేసరికి ఏటీఎంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు మహేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మహేశ్ తన బాబాయ్ కిష్టయ్యతో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించారు. మహేశ్ ఇంట్లో నాలుగు లక్షల 40వేలు, కిష్టయ్య ఇంట్లో నాలుగు లక్షల 78వేలు దొరికాయి. చోరీ చేసిన డబ్బును నిందితులు ఇంటిలోని సిలెండ్ కింద, ఉతికి ఆరేసిన బట్టలలో, చెత్తబుట్టలలో దాచి ఉంచారు. నగదుతో పాటు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
యువతిని వీడియో తీస్తూ చిక్కాడు
హైదరాబాద్: ఆటోలో ప్రయాణిస్తున్న యువతిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడో యువకుడు. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఎస్సై క్రాంతికుమార్ కథనం ప్రకారం... భాగ్యనగర్‌కాలనీకి వెళ్లేందుకు ఓ యువతి ఎల్లమ్మబండలో ఆటో ఎక్కింది. అదే ఆటో ఎక్కిన మెదక్ జిల్లాకు చెందిన వీరాస్వామి (25) తన సెల్‌ఫోన్ ద్వారా ఆమెను వీడియో తీయడం మొదలెట్టాడు. గమనించిన ఆటో డ్రైవర్ యువతికి విషయం చెప్పడంతో వీరాస్వామిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.