బాబాయ్, అబ్బాయ్‌ల చోరీ పన్నాగం | ATM thieves arrested by Kukatpally police station | Sakshi
Sakshi News home page

బాబాయ్, అబ్బాయ్‌ల చోరీ పన్నాగం

Published Sat, Jan 28 2017 9:50 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

బాబాయ్, అబ్బాయ్‌ల చోరీ పన్నాగం

బాబాయ్, అబ్బాయ్‌ల చోరీ పన్నాగం

హైదరాబాద్‌: ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిపాలు కావడంతో ఆయన కొడుకు ‘డ్యూటీ’లో చేరాడు. ఈ అబ్బాయ్‌.. తన బాబాయ్‌ సహకారంతో ఏటీఎంలోని 10లక్షలా30వేల800 రూపాయలను దోచుకెళ్లారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.పురుషోత్తం వివరాలు వెల్లడించారు.

కూకట్‌పల్లి జయానగర్‌లోని శ్రీనిధి అపార్టుమెంట్‌లో నివాసం ఉండే గంగి మల్లయ్యకు ఇద్దరు కుమారులు. గంగిమల్లయ్య స్థానికంగా ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్‌ ఏటీఎంలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. ఈనెల 19న అనారోగ్యంతో జీడిమెట్లలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి ఖర్చుల కోసం రూ. 80వేలు అపార్టుమెంట్‌ యజమాని వద్ద అప్పుగా తీసుకున్నాడు. అయితే రెండవ కుమారుడు శేఖర్‌ మల్లయ్య స్థానంలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు రెండు గంటల ప్రాంతంలో ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి ఇంటికి వెళ్లి పడుకోవడాన్ని గమనించిన పెద్దకొడుకు గంగి మహేశ్‌(28) ఏటీఎంలో చోరీకి పన్నాగాన్ని రచించాడు.

ఈనెల 21న ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటూ సెంట్రింగ్‌ పనిచేస్తున్న గంగి కిష్టయ్య అనారోగ్యంతో ఉన్న అన్నను చూసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అనంతరం మల్లయ్య పెద్దకొడుకు మహేశ్‌ను కలిశాడు. ఇద్దరు కలిసీ భాగ్యనగర్‌కాలనీలోని కల్లుకంపౌండ్‌లో కల్లుతాగారు. అప్పులు దూరం కావాలంటే ఏటీఎం కేంద్రంలో చోరీచేయాలని నిర్ణయించుకున్నారు.

అదేరోజు రాత్రి రెండుగంటల సమయంలో సెక్యూరిటీ గార్డు దుస్తులను ధరించిన మహేశ్‌ ఏటీఎం కేంద్రంలోనికి వెళ్లి కటింగ్‌ ప్లేయర్‌తో సీసీ కెమెరాల వైర్లను కట్‌చేశాడు. కిష్టయ్యతో కలిసి ఏటీఎంలో నగదు దాచే యంత్రాన్ని ధ్వంసం చేశారు. అందులో ఉన్న10లక్షల 30వేల 800వందల  రెండువేలు, వంద రూపాయల నోట్లను తీసుకొని పరారయ్యారు.  మరుసటిరోజు ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించిన ముంబయ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రతినిధులు కూకట్‌పల్లి సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి చూసేసరికి ఏటీఎంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమానం వచ్చిన పోలీసులు మహేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మహేశ్‌ తన బాబాయ్‌ కిష్టయ్యతో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించారు. మహేశ్‌ ఇంట్లో నాలుగు లక్షల 40వేలు, కిష్టయ్య ఇంట్లో నాలుగు లక్షల 78వేలు దొరికాయి. చోరీ చేసిన డబ్బును నిందితులు ఇంటిలోని సిలెండ్‌ కింద, ఉతికి ఆరేసిన బట్టలలో, చెత్తబుట్టలలో దాచి ఉంచారు. నగదుతో పాటు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement