KUKKUNUR
-
భయంగుప్పిట్లో ఏజెన్సీ
సాక్షి, కుక్కునూరు: ఏజెన్సీ గ్రామాలు పులి భయంతో వణుకుతున్నాయి. సోమవారం కుక్కునూరు మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ అటవీప్రాంతం నందిపాడు సమీపంలో ఎద్దును చంపిన పులి మంగళవారం మండలంలోని ఇసుకపాడు గ్రామానికి చేరింది. ఈ గ్రామంలోని కంటిపల్లి నాగులు అనే గిరిజన రైతుకు చెందిన పొలం వద్ద ఉన్న పశువుల కొట్టంపై దాడి చేసి ఒక ఎద్దును చంపింది. అనంతరం ఆ ఎద్దును కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది. ఉదయాన్నే పశువుల కొట్టంలో ఉన్న పశువులు లేకపోవడాన్ని రైతు గమనించాడు. ఆ ప్రాంతంలో రక్తం, పులి పాదగుర్తులు ఉండటంతో ఆ ప్రాంతాన్ని గ్రామస్తులంతా గాలించి ఎద్దు కళేబరాన్ని కనుగొని పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎద్దుపై దాడి జరిగినట్లు నిర్ధారించారు. పాదముద్రలను సేకరించారు. అయితే దాడి చేసి జంతువు పులా లేక చిరుత పులా అన్నది నిర్ధారించాల్సి ఉందని అటవీశాఖాధికారులు తెలిపారు. ఈ విషయమై కుక్కునూరు రేంజర్ ఎం.ఏడుకొండలను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఘటనా స్థలం వద్ద పాదముద్రలు సేకరించి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం నుంచి అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఏజెన్సీ గ్రామ ప్రజలు 15 రోజుల పాటు అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదని, పశువులను అడవుల్లోకి వదిలిపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి బోనులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విలీన మండలాలకు ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలంగాణ నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రెండు జెడ్పీటీసీ స్థానాలు, 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. వీటితోపాటు పెరవలి మండలం తీపర్రు ఎంపీటీసీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. వేలేరుపాడు, కుక్కునూరు జెడ్పీటీసీ స్థానాలకు, వేలేరుపాడులోని మేడిపల్లి, కాటుకూరు, నర్లవరం, తట్కూరుగొమ్ము, భూదేవిపేట, రేపాకగొమ్ము, రామవరం ఎంపీటీసీ స్థానాలకు, కుక్కునూరులోని అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు–1, కుక్కునూరు–2, దాచారం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 5న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 9న స్కూృట్నీ చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లను అభ్యర్థులు మరోసారి పరిశీలన కోసం 10న అప్పీల్ చేసుకోవచ్చు. 11న ఆప్పీళ్లపై విచారణ చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు విధించారు. 21న పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ రీ పోలింగ్ జరపాల్సి వస్తే 22న చేపడతారు. 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ .రమేష్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కుక్కునూరు రెవెన్యూ డివిజన్, పెరవలి మండలంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.