Kura Rajanna
-
జనశక్తి నేతలు రాజన్న, అమర్ విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో కూర రాజన్న, అమర్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది. అమర్‌కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్ దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు. -
ప్రజా యుద్ధంతోనే సమాజానికి రక్షణ: కూర రాజన్న
సాక్షి, కామారెడ్డి: ప్రజాయుద్ధంతోనే సమాజానికి రక్షణ ఉంటుందని సీపీఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న అన్నారు. భూస్వాములను, దొరలను ప్రభుత్వాలు, పోలీసులు రక్షిస్తున్నాయని పేర్కొన్నారు. తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని, తాను పారిపోయినట్లు పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. పదిహేను సంవత్సరాల క్రితం సాగర్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, కానీ ఆ వ్యక్తిని కూడా తమతో కలిపి కేస్ చేయడం సరికాదన్నారు. బీడీ కంపెనీలు రక్షణ కోసం ఫండ్ ఇవ్వడం ఆనవాయితీ అని, కానీ కావాలనే డబ్బులు డిమాండ్ చేసినట్లు తప్పుడు కేసు పెట్టారని కూర రాజన్న పెట్టారు. పెట్టిన కేసును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. కామారెడ్డిలో చందాల వసూళ్ల కేసులో రాజన్న బెయిల్ మంజూరు కావడంతో 10 నెలల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
పోలీసుల అదుపులో జనశక్తి నేత కూర రాజన్న!
సాక్షి, సిరిసిల్ల/బోధన్/హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్న (80) అలియాస్ కేఆర్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క తెలిపారు. హైదరాబాద్ శివారులోని కౌకూరులో ఓ ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారని సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు. వయోభారంతో రాజన్న అనారోగ్యంతో ఉన్నారని విమలక్క ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ఏనుగు ప్రభాకర్‌రావు అలియాస్ వేణుగోపాల్‌రావు హత్యకేసులో కూర రాజన్న నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టయిన రాజన్న, జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ.. మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజన్నపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ జనశక్తి సాయుధ దళాలను నిర్మించేందుకు రాజన్న ఆయుధాలు సమకూర్చుకుంటున్నట్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెడతారని భావిస్తున్నా... రాజన్న అరెస్ట్‌పై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా... జిల్లాలోని వేములవాడకు చెందిన కూర రాజన్న నాలుగున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో విచారించాలి.. పోలీసులు అరెస్టుచేసిన సీపీఐఎం ఎల్ జనశక్తి నేత కూర రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే విచారించాలని మానవహక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇతరుల సహాయం లేకుండా నడవ లేని, శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉన్నాడని వైద్యుల పర్యవేక్షణలో, రాజన్న ఏర్పాటు చేసుకున్న న్యాయవాది సమక్షంలో విచారించాలని సంస్థ అధ్యక్షులు జి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. -
ఆ మల్లన్న.. కూర రాజన్న!
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రభుత్వాధికారి, కాంట్రాక్టర్‌ను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్ గుట్టు బట్టబయలవుతోంది. ఆ గ్యాంగ్ వెనుక ఉన్న పాత్రధారులను ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. సాదాసీదా ముఠాగా భావించిన సిద్దిపేట మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా కన్పిస్తోంది. ఈ గ్యాంగ్ వ్యవహారాలు పోలీస్ శాఖనే కలవరానికి గురిచేస్తున్నాయి. కదలికల్లేవని భావిస్తున్న జనశక్తి నేతలు మళ్లీ యాక్టివ్ అవడం, మల్లన్న మిలిటెంట్ పేరుతో కార్యకలాపాలు సాగించడం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ‘ఎవరన్నా.. ఈ మల్లన్న’శీర్షికన ఇటీవల ‘సాక్షి’ప్రచురించిన కథనం సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో సంచలనం రేపింది. మాజీ జనశక్తి నేత కూర రాజన్న నేతృత్వంలోనే సిద్దిపేట, మెదక్, సిరిసిల్లలో మల్లన్న మిలిటెంట్ దళం పేరుతో ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లను కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల కింద సిద్దిపేట జిల్లాలోని కొండపాక ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్‌ను నలుగురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. కూర రాజన్నకు ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ నక్సలైట్ సాయి.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 9 ఎం.ఎం. పిస్టల్‌తో పాటు 19 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌లో ప్రజాప్రతినిధులు.. కూర రాజన్న నేతృత్వంలో ఏర్పడ్డ ఈ గ్యాంగ్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులుండటం సంచలనం రేపుతోంది. ఏకంగా ఓ జెడ్పీటీసీ, ఓ ఎంపీపీ, ఓ ఎంపీటీసీ భర్త.. సాయితో కలసి ఇంజనీర్‌ను బెదిరించి తీసుకున్న డబ్బును పంచుకున్నట్లు గుర్తించారు. అదే రీతిలో మెదక్, సిరిసిల్లలో ఇతర అధికారులు, కాంట్రాక్టర్లను అక్కడి లోకల్ గ్యాంగ్‌తో కలసి సాయి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)గుర్తించింది. అయితే సాయికి రాజన్న ద్వారానే పిస్టల్ లభించిందని, ఆయన నేతృత్వంలోనే వీళ్లంతా వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించినట్లు పోలీస్ అధికారి స్పష్టం చేశారు. పోలీసుల అదుపులో ప్రజాప్రతినిధులు.. సిద్దిపేట జిల్లా తొగుట పోలీసుల అదుపులో పలువురు ప్రజాప్రతినిధులున్నట్టు తెలిసింది. అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఎవరిని బెదిరించారు.. ఈ గ్యాంగ్‌కు నకిలీ నోట్ల చెలామణి నిందితుడు ఎల్లంగౌడ్‌కు ఉన్న లింకులేంటన్న కోణంలో వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంపీపీ, ఓ ఎంపీటీసీ భర్త ఉన్నట్లు తెలిసింది. కీలకంగా భావిస్తున్న జెడ్పీటీసీ పరారీలో ఉన్నారని, ఎల్లంగౌడ్ సైతం పరారీలోనే ఉన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. -
కూర రాజన్నకు నాన్ బెయిలబుల్ వారంట్
సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) జనశక్తి ఉద్యమ నిర్మాత కూర రాజన్న(70)కు రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. కోనరావుపేట మండలం సుద్దాలలో ఏనుగు ప్రభాకర్‌రావు హత్య కేసులో రాజన్న నిందితుడు. 2013 నాటి ఈ కేసులో రాజన్న కోర్టుకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ తొమ్మిదో జిల్లా కోర్టు న్యాయ మూర్తి జి.శ్రీనివాసులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. వేములవాడకు చెందిన కూర రాజేందర్ ఉరఫ్ కూర రాజన్న జనశక్తి ఉద్యమ నిర్మాత. ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కూర రాజన్నే సూత్రధారి
సాక్షి, మహబూబాబాద్: ఆరు నెలల క్రితం ఆవిర్భవించిన చండ్రపుల్లారెడ్డి (సీపీ)బాట అజ్ఞాత దళం ఏర్పాటులో జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న కీలకమని మహబూబాబాద్ జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ దళానికి 27 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు పలువురిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలకు చెందిన 11 మంది 2016, సెప్టెంబర్ 9న హైదరాబాద్‌కు వెళ్లి కూర రాజన్నను కలిశారని, ఆ సమయంలో ఆయా జిల్లాల పరిధిలో సీపీబాట పేరుతో దళాన్ని ఏర్పాటు చేయాలని, ఆయుధాలు సరఫరా చేస్తానని రాజన్న చెప్పినట్లు విచారణలో మధు వెల్లడించాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 18న 27 తుపాకులు, మందుగుండు సామగ్రిని పంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు మరికొంత మందిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత
హైదరాబాద్: జనశక్తి నేత కూర రాజన్న గుండె నొప్పితో బాధపడుతూ గురువారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. -
జనశక్తి నేత కూర రాజన్నపై ‘రాజద్రోహం’ తగదు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క దోమలగూడ: జనశక్తి నాయకులు కూర రాజన్న తదితరులపై రాజద్రోహం ఆరోపణలతో నమోదైన కర్నూలు కుట్ర కేసును ఎత్తి వేసి బేషరతుగా విడుదల చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. దోమలగూడలోని అరుణోదయ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. కూర రాజన్న, మరో 11 మంది అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన నీలం రాంచంద్రయ్య స్మృతిలో ప్రజలు నిర్మించుకున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో ఈ విషయాన్ని చర్చించడానికి హైదరాబాదు నుంచి వెళ్లిన కూర రాజన్న తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతో కర్నూలులో ఆగాడన్నారు. రాజన్నతో పాటు కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం నాయకులైన నంబి నర్సింహ్మయ్య, మోతా వెంకట్రావు, కర్నాకుల వీరాంజనేయులు, మాస్టారు నాగేందర్రావు, పెంచలయ్య, అందే బాలాజీలను అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి బలవంతంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అంతకుముందే కర్నూలులో నివాసముంటున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు, బోల్లవరం గ్రామ మాజీ సర్పంచు ఒడ్డె పోతనను ఇంట్లో అరెస్టు చేశారని, పీఓడబ్ల్యూ కార్యాలయంలో రైతుకూలీ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయ సుంకులును, కర్నూలు బస్టాండ్‌లో వసంత్, చాకలి శ్రీను అనే యువకులను పట్టుకున్నారని చెప్పారు. వీరందరిపై 121 ఎ, 120 బి సెక్షన్ల కింద రాజద్రోహం కుట్ర కేసులు నమోదు చేశారన్నారు. ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. ప్రజా సంఘాల నాయకులు విఠల్‌రాజ్ (ఏఐఎప్‌టియూ), హన్మేష్ (సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), ఆవుల అశోక్, (పీడీఎస్‌యూ), మోహన్ బైరాగి (అరుణోదయ), రామలింగం (శోషిత జనసభ), నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేత
కర్నూలు: సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్నను కర్నూలు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఉన్న మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. గతంలో కోయిలకుంట్లలో జరిగిన కాల్పుల ఘటనలో కూర రాజన్నపై కేసు నమోదు అయింది. నిజామాబాద్‌లో ఓ హత్య కేసులో కూర రాజన్న ముద్దాయిగా ఉన్నారు. అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలపై కూర రాజన్నతోపాటు అరెస్ట్ అయిన వారని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే కూర రాజన్న అరెస్ట్ విషయాన్ని వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. -
‘తెలంగాణ ఇచ్చారు.. కాళ్లు చేతులు నరికారు’
వేములవాడ: పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని జనశక్తి అగ్రనేత కూర రాజన్న వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి.. దాని కాళ్లు చేతులు నరికివేసిందని వ్యాఖ్యానించారు. ఓ కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసీల సంపదను కొల్లగొడుతున్న ప్రభుత్వం ఐదో షెడ్యూల్ ప్రకారం వారికి ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందనడంలో అర్థమేలేదన్నారు. ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే ఇంజనీర్ల సూచ న మేరకు భారీ ప్రాజెక్టుకు బదులుగా బ్యారేజీలు కడితే సరిపోతుందని అన్నారు.