పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్, బుల్లెట్లు, నిందితుడు సాయి
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రభుత్వాధికారి, కాంట్రాక్టర్‌ను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్ గుట్టు బట్టబయలవుతోంది. ఆ గ్యాంగ్ వెనుక ఉన్న పాత్రధారులను ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. సాదాసీదా ముఠాగా భావించిన సిద్దిపేట మల్లన్న మిలిటెంట్ గ్యాంగ్ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా కన్పిస్తోంది. ఈ గ్యాంగ్ వ్యవహారాలు పోలీస్ శాఖనే కలవరానికి గురిచేస్తున్నాయి. కదలికల్లేవని భావిస్తున్న జనశక్తి నేతలు మళ్లీ యాక్టివ్ అవడం, మల్లన్న మిలిటెంట్ పేరుతో కార్యకలాపాలు సాగించడం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ‘ఎవరన్నా.. ఈ మల్లన్న’శీర్షికన ఇటీవల ‘సాక్షి’ప్రచురించిన కథనం సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో సంచలనం రేపింది. మాజీ జనశక్తి నేత కూర రాజన్న నేతృత్వంలోనే సిద్దిపేట, మెదక్, సిరిసిల్లలో మల్లన్న మిలిటెంట్ దళం పేరుతో ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లను కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల కింద సిద్దిపేట జిల్లాలోని కొండపాక ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్‌ను నలుగురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. కూర రాజన్నకు ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ నక్సలైట్ సాయి.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 9 ఎం.ఎం. పిస్టల్‌తో పాటు 19 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
గ్యాంగ్‌లో ప్రజాప్రతినిధులు..
కూర రాజన్న నేతృత్వంలో ఏర్పడ్డ ఈ గ్యాంగ్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులుండటం సంచలనం రేపుతోంది. ఏకంగా ఓ జెడ్పీటీసీ, ఓ ఎంపీపీ, ఓ ఎంపీటీసీ భర్త.. సాయితో కలసి ఇంజనీర్‌ను బెదిరించి తీసుకున్న డబ్బును పంచుకున్నట్లు గుర్తించారు. అదే రీతిలో మెదక్, సిరిసిల్లలో ఇతర అధికారులు, కాంట్రాక్టర్లను అక్కడి లోకల్ గ్యాంగ్‌తో కలసి సాయి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)గుర్తించింది. అయితే సాయికి రాజన్న ద్వారానే పిస్టల్ లభించిందని, ఆయన నేతృత్వంలోనే వీళ్లంతా వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించినట్లు పోలీస్ అధికారి స్పష్టం చేశారు.
పోలీసుల అదుపులో ప్రజాప్రతినిధులు..
సిద్దిపేట జిల్లా తొగుట పోలీసుల అదుపులో పలువురు ప్రజాప్రతినిధులున్నట్టు తెలిసింది. అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఎవరిని బెదిరించారు.. ఈ గ్యాంగ్‌కు నకిలీ నోట్ల చెలామణి నిందితుడు ఎల్లంగౌడ్‌కు ఉన్న లింకులేంటన్న కోణంలో వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంపీపీ, ఓ ఎంపీటీసీ భర్త ఉన్నట్లు తెలిసింది. కీలకంగా భావిస్తున్న జెడ్పీటీసీ పరారీలో ఉన్నారని, ఎల్లంగౌడ్ సైతం పరారీలోనే ఉన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment