జిల్లాలో జన శక్తి కదలికలు
రాష్ట్ర కమిటీ ఏర్పాటే లక్ష్యం
ఆయుధాలు, ఆర్థిక వనరులపై వ్యూహ రచన
ఆదిలోనే అడ్డుకున్న పోలీసులు
కర్నూలు : జిల్లాలో జనశక్తి కదలికలకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. జిల్లాలోని ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన జనశక్తి కార్యకలాపాలను జిల్లా అంతటా విస్తృతం చేసేందుకు కూర రాజన్న నాయకత్వంలో చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు జిల్లాలో జనశక్తి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించాలని, ఇందుకోసం రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి సంబంధించి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ముందస్తుగా దృష్టి సారించారు. నగరంలోని ఒక వీఐపీని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై సదరు వీఐపీ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో మరి కొంతమంది కాంట్రాక్టర్లను కూడా ఆర్థిక వనరుల కోసం సంప్రదించినట్లు సమాచారం.
ఈ సమాచారం పోలీసులకు చేరడంతో రెండు నెలలుగా జనశక్తి కార్యకలాపాలపై నిఘాను ఏర్పాటు చేసి కూర రాజన్నతో పాటు 10 మంది జనశక్తి సభ్యులను అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. బొల్లవరం మాజీ సర్పంచ్ రమణారెడ్డి అల్లుడు మోహన్‌రెడ్డి కల్లూరులోని బాబా బృందావన్ నగర్లో నివాసం వుంటున్నాడు. కూర రాజన్నతో పాటు మరో మాజీ సర్పంచు వడ్డె పోతన, పర్ల గ్రామానికి చెందిన సుంకన్న, పెద్దటేకూరుకు చెందిన మండ్ల వసంతు, ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేటకు చెందిన చాకలి శ్రీను, ఆదోని పట్టణానికి చెందిన నెంబి నరసింహయ్య, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అందె బాలాజీ, నెల్లూరు జిల్లాకు చెందిన పండ్ల పెంచలయ్య, రాజమండ్రికి చెందిన మోతె వెంకట్రావు, కృష్ణా జిల్లాకు చెందిన సింగోట నాగేంద్రరావు, తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన వీరాంజనేయులు తదితరులు సమావేశమయ్యారు.
పక్కా సమాచారంతో సోమవారం ఆర్ధరాత్రి దాటిన తరువాత ఆర్ఎస్ఐ ప్రతాప్ నేతృత్వంలో సీఐలు ప్రవీణ్‌కుమార్, నాగరాజుయాదవ్, స్పెషల్ పార్టీ పోలీసులు మూక్ముడిగా దాడి చేసి పట్టుకున్నారు. భారీగా ట్రీట్మెంట్ ఇచ్చి మంగళవారం సాయంత్రం మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా కొందరు జనశక్తి సభ్యులు నడవలేని స్థితిలో పోలీసుల సహాయంతో మీడియా ముందు హాజరయ్యారు.
రెండు దశాబ్దాల అనంతరం 1990 కంటే ముందు జిల్లాలో అక్కడక్కడా జనశక్తి కార్యకలాపాలు కొనసాగుతు వచ్చాయి.
అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు జనశక్తి, పీపుల్స్‌వార్ కార్యకాలపాలపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జిల్లాను ఆనుకొని వున్న నల్లమలలో వీరి కదలికలు తగ్గుతూ వచ్చాయి. రాష్ట్రం విడిపోవడంతో జిల్లాలో మళ్లీ జనశక్తిని బలోపేతం చేసేందుకు గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందులో భాగంగా ఆర్థిక వనరుల సమీకరణలో వీరు పట్టుబడ్డారు.
పోలీసులు చెబుతున్న వివరాల మేరకు ఏడు నెలల క్రితం బనగానపల్లెకు చెందిన వెంకటేశ్వరరెడ్డిని కొలిమిగుండ్ల సమీపంలో ఆయుధాలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. బొల్లవరం మాజీ సర్పంచు వడ్డె పోతన, పర్ల బోయ సుంకన్న పాత్ర ఇందులో ప్రధానంగా పోలీస్ విచారణలో బయట పడింది. అలాగే కర్నూలు నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ను బెదిరించి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.