బీసీలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీ జనాభా దృష్ట్యా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఖరారు చేశారు. అదేవిధంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. జిల్లా చరిత్రలో ఓ పార్టీ బీసీ మహిళకు కర్నూలు పార్లమెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం.
చారిత్రక నిర్ణయానికి వైఎస్ఆర్సీపీ బీజం వేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలతో పాటు బీసీ కులస్తులు, రాజకీయ పరిశీలకులు హర్షిస్తున్నారు. పత్తికొండ నివాసి అయిన బుట్టా నీలకంఠం సతీమణి రేణుక ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం వీరు వ్యాపార నిర్వహణలో భాగంగా హైదరాబాద్లో ఉంటున్నారు. కర్నూలు పార్లమెంట్లోని ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో చేనేత సామాజిక వర్గీయులు అత్యధికంగా ఉన్నారు. అదేవిధంగా బీసీ జనాభాను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డి పేరును ఖరారు చేయడంతో విమర్శకుల నోళ్లు మూతపడినట్లయింది.
ప్రస్తుతం పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా కూడా పని చేస్తున్న భూమా.. గతంలో నంద్యాల ఎంపీగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్రను సొంతం చేసుకున్నారు. తాజాగా నంద్యాలలో ప్రజల సమస్యలపై అలుపెరగని పోరు సాగిస్తూ దూసుకుపోతున్నారు. చెత్తపై సమరం.. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బాక్స్ ఏర్పాటు.. కాల్ యువర్ భూమా తదితర కార్యక్రమాలతో జనానికి చేరువవుతున్నారు. అధ్యక్షుడి స్ఫూర్తితో నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ.. కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం పట్ల ప్రజలు కూడా అదే స్థాయిలో ఆకర్షితులవుతుండటం విశేషం.