kurnool municipal corporation
-
కార్పొరేషన్లో అవినీతి కంపు
కర్నూలు (టౌన్): నగర పాలక సంస్థ అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. పైసలివ్వందే పనులు చేయడం లేదు. దీంతో ఒక్కొక్కరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడుతున్నారు. ఏడాది వ్యవధిలోనే నలుగురు అధికారులు జైలు పాలయ్యారు. తాజాగా బుధవారం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. మూడునెలల క్రితం నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలనను గాడిలో పెడుతున్న సమయంలోనే పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడంతో కార్పొరేషన్ పరువు కాస్తా గంగలో కలిసినట్లయ్యింది. ఏడాది వ్యవధిలో నలుగురు నగర పాలక సంస్థలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు ఉద్యోగులు లంచం తీసుకుంటూ జైలుపాలయ్యారు. 2018 జనవరి 27న ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాలసుబ్రమణ్యం కంట్రాక్టర్‌కు బిల్లు చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే ఏప్రిల్ 14న ఇంటికి కుళాయి కనెక్షన్‌కు సంబంధించి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ విభాగానికి చెందిన బిల్‌కలెక్టర్ సుధాకర్ పట్టుబడ్డారు. ఆ తరువాత ఇదే విభాగంలో మరొక బిల్ కలెక్టర్ షరీఫ్ డిసెంబర్ 13న పన్నులో పేరు మార్పిడికి సంబంధించి రూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. తాజాగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఐఏఎస్ పాలనలోనూ అదే దందా! నగర పాలక సంస్థ కమిషనర్‌గా పి.ప్రశాంతి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతర తనిఖీలు, సమీక్షలు చేయడంతో పాలనలో కొంత మార్పు కనిపించింది. చెత్త సేకరణలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. కార్పొరేషన్ బాగుపడుతోందని అనుకుంటున్న తరుణంలో మరో అధికారి పట్టుబడటం గమనార్హం. దీన్నిబట్టి ఐఏఎస్ అధికారి పాలనలోనూ అదే దందా కొనసాగుతోందన్న విమర్శలకు తావిచ్చినట్లు అయ్యింది. నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం అన్ని విభాగాల్లో కీలకమైనది. ఇళ్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు..వీటన్నింటి అనుమతి వ్యవహారాలు ఈ విభాగంలో చూస్తుంటారు. దీంతో ఇక్కడ అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. బిల్డింగ్లు ప్లానింగ్‌కు విరుద్ధంగా నిర్మించినా, అనుమతి లేకుండా కట్టినా, నాన్లేఔట్లలో నిర్మాణాలు చేపట్టినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏసీబీకి చిక్కిన ఏసీపీ – శాస్త్రి షభ్నం తీరే సప‘రేటు’ కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)గా పనిచేస్తున్న శాస్త్రి షభ్నం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు బుధవారం పట్టుబడ్డారు. నగరంలోని బళ్లారి చౌరస్తాకు చెందిన పవన్‌కుమార్ మోదీ 2015, 2017 సంవత్సరాల్లో రెండు స్థలాలు కోనుగోలు చేశాడు. ఈ స్థలాల్లో నిర్మాణాల కోసం పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నంను కలిశారు. రెండు మూడు సార్లు కలిసినా పని కాలేదు. ప్లాన్ అప్రూవల్ కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన బాధితుడు ఈ నెల 19న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి... లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీపీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో సోదా చేయగా.. రూ.8.20 లక్షల నగదు, 200 గ్రాముల బంగారు నగలు, బ్యాంకు పాస్‌బుక్కులు, విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. పట్టుబడిన ఏసీపీని గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. కాగా.. శాస్త్రి షభ్నం 1999 నుంచి 2001 వరకు పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ తరువాత టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ (కర్నూలు నగరపాలక సంస్థ)గా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా (గుంతకల్లు, నందికొట్కూరు) పనిచేశారు. ఆ తరువాత పదోన్నతిపై అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా కర్నూలు నగరపాలక సంస్థలో 2014 నుంచి పనిచేస్తున్నారు. -
‘నామినేషన్’ దందా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో అధికార పార్టీ నేతలు మరోసారి నామినేషన్ పనుల పర్వానికి తెరతీశారు. మొత్తం రూ.25 కోట్ల పనులను నామినేషన్‌పై కాజేసేందుకు పథక రచన చేశారు. ఇందుకోసం ఒక్కో పని విలువను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఈ విధంగా మొత్తం 500 పనులను తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వీటిని అప్పగించేందుకు కాంట్రాక్టర్లను సైతం ముందుగానే ఎంపిక చేసుకున్నారు. వారి నుంచి ఏకంగా 20 శాతం కమీషన్ తీసుకునేందుకు ఇటు కర్నూలు, అటు పాణ్యం నియోజకవర్గ అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఎంపిక చేసుకున్న పనుల విషయంలోనూ అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చేసిన పనులతో పాటు సగం పూర్తి చేసిన వాటిని ఎంపిక చేసుకుని భారీగా కమీషన్లు దండుకునేందుకు ఎత్తుగడ వేసినట్లు సమాచారం. గతంలో ఒకసారి నామినేషన్ పనుల రుచి మరిగిన అధికార పార్టీ నేతలు మరోసారి నిధులను ఆరగించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు అర్బన్ ప్రాంతంలో సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణానికి మొత్తం 500 పనులను నామినేషన్‌పై తీసుకునేందుకు గుర్తించారు. వీటి అంచనాలు కూడా ఇప్పటికే తయారుచేయించిన అధికారపార్టీ నేతలు..ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. టెండర్లు లేకుండానే... గతంలోనూ నామినేషన్‌పై పనులు చేపట్టారు. నామినేషన్‌పై పనులు అప్పగించాలంటే ఎంతో అత్యవసరమైనవై ఉండాలని మునిసిపల్ శాఖ డైరెక్టర్ కన్నబాబు మొదట్లో కొర్రీలు వేశారు. అత్యవసరమైనవి కాకపోతే.. టెండర్ల ద్వారానే చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. దీంతో మొదట్లో నామినేషన్ పనులకు బ్రేకులు పడ్డాయి. అయితే, చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే పనిచేశాయి. కర్నూలు, పాణ్యంకు చెందిన నేతలు అప్పట్లో సుమారు రూ.50 కోట్ల పనులను నామినేషన్‌పై తీసుకున్నారు. ఇవన్నీ కార్యకర్తలకు ఇచ్చేందుకేనని చెప్పి తీసుకున్న అధికార పార్టీ నేతలు.. ఆచరణలో మాత్రం కమీషన్లు దండుకున్నారు. పనులను కాస్తా తిరిగి కాంట్రాక్టర్లకే అప్పగించారు. ఒక్కో కాంట్రాక్టర్ నుంచి ప్రధాన నేతలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్లు అందాయి. తిరిగి ఇప్పుడు మరోసారి కార్యకర్తల పేరుపై నామినేషన్ ప్రాతిపదికన పనులు తీసుకునేందుకు కర్నూలు, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. రూ.5 కోట్ల కమీషన్లు! కర్నూలు కార్పొరేషన్లో ఏ టెండర్లు పిలిచినా గతంలో 15 శాతం వరకూ తక్కువ ధరకే వేసేవారు. అయితే, అధికార పార్టీ నేత రంగంలోకి దిగిన తర్వాత ప్రతి టెండరు తనకు మాత్రమే దక్కేలా చేసుకోవడంతో పాటు రింగుకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఒక్కో టెండరు 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరకు వేసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కార్పొరేషన్ ఖజానాకు గండి పడుతోంది. ఇప్పుడు నామినేషన్లపై తీసుకునే పనులకు కూడా టెండర్లను పిలిస్తే 15 శాతం వరకూ తక్కువ ధరకే చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే, అధికార పార్టీ నేతల పేరుతో తీసుకోనుండడంతో అంచనా ధరకే పనులను అప్పగించనున్నారు. అది కూడా ఎంపిక చేసిన వారికి నామినేషన్‌పై మాత్రమే. ఇక్కడ ఇంజినీర్లతో ముందుగానే కుమ్మక్కై చేసిన పనులకే తిరిగి అంచనాలు వేయించడంతో పాటు అధికంగా కూడా వేయించి భారీగా దండుకోనున్నారు. మొత్తం 500 పనులకు గానూ ఒక్కో పని అంచనా విలువ రూ.5 లక్షలుగా నిర్ణయించిన నేపథ్యంలో మొత్తం రూ.25 కోట్ల పనుల్లో 20 శాతం కమీషన్ అంటే రూ.5 కోట్ల మేర దండుకునేందుకు ఇద్దరు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. -
ఓటమి భయంతోనే ఎన్నికలు వాయిదా
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఓటమి భయంతోనే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిదా వేస్తూ వస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కళావెంకట్రావ్ భవనం, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదులన్నారు. పార్టీలను ఫిరాయించిన వారిని ప్రజలు క్షమించబోరన్నారు. ప్రభుత్వం జన్మభూమి కమిటీలను రద్దు చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. 20 సూత్రాల పథకం మాజీ చైర్మన్, జిల్లా ఇన్చార్జి తులసి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్అలీఖాన్లు తదితరులు.. కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీని, వార్డు కమిటీ ఇన్చార్జీలను ప్రకటించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి , డీసీసీ ఉపాధ్యక్షులు వై.వి.రమణ, ప్రధాన కార్యదర్శులు కె.పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో ఈ-టాయ్‌లెట్స్
కర్నూలు(జిల్లా పరిషత్): నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఎలక్ట్రానిక్ బయో టాయ్‌లెట్స్(ఈ-టాయ్‌లెట్స్) ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు స్థానిక రాజవిహార్ సెంటర్ వద్ద ఉన్న బస్టాప్, రైల్వేస్టేషన్‌కు సమీపంలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో రాజవిహార్ సెంటర్లో ఈ-టాయ్‌లెట్ ప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రం సైంటిఫిక్ సొల్యూషన్స్(తివేండ్రం) వారు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టాయ్‌లెట్ ఖరీదు రూ.6లక్షలు. వీటిని ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, వైజాగ్ సిటీల్లో ఏర్పాటు చేశారు. ఈ విధానాన్ని కర్నూలులో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నారు. ఈ విధానం విజయవంతమైతే మరిన్ని ఈ టాయ్లెట్లు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ పీవీవీ సత్యనారాయణమూర్తి చెప్పారు. ఈ-టాయ్‌లెట్స్ పనిచేసే విధానం ఈ-టాయ్లెట్లలో వెళ్లాలంటే రూ.5ల నాణేన్ని వేయాలి. నాణెం వేసిన వెంటనే డోర్ తెరుచుకుంటుంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బటన్‌ను నొక్కితే ఆటోమేటిక్‌గా శుభ్రం అవుతుంది. ఒకవేళ శుభ్రం చేయకపోయినా బయటకు వచ్చి డోర్ వేసిన వెంటనే ఆటోమేటిక్‌గా టాయ్‌లెట్ శుభ్రపడుతుంది. టాయ్లెట్లో నీరు అయిపోయినా, ఒకేసారి ఇద్దరు టాయ్లెట్లోకి వెళ్లినా వెంటనే సంబంధిత సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది. వెంటనే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఈ-టాయ్‌లెట్‌కు ఏర్పా టు చేసిన సెప్టిక్ ట్యాంకులో డీఆర్డీఏ వారి సహకారంతో ఇనాకులం అనే పురుగులను వదులుతారు. ఆ పురుగులు సెప్టిక్ ట్యాంకులోని మలినాలను తిని శుభ్రం చేస్తాయి. -
నిబంధనలకు పాతర!
సాక్షి, కర్నూలు: అభివృద్ధి పనుల ముసుగులో కర్నూలు నగర పాలక సంస్థ(కేఎంసీ) ఇంజినీరింగ్ విభాగం అధికారులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘బాక్స్ టెండర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. తమ అనుయాయులకు పనులు కట్టబెట్టేస్తున్నారు. తక్కువ ధరకు టెండరు కోట్ చేసి పనులు చేపట్టేందుకు కొందరు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా.. తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికారులు అప్పగిస్తుండటం చర్చనీయాంశమైంది. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 51 డివిజన్లు ఉండగా సుమారు 5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థదే. ఇందులో పారిశుద్ధ్యం, రోడ్లు, నీరు ముఖ్యమైనవి. ఆయా విభాగాల్లో మరమ్మతులకు, కొత్త వాటి ఏర్పాటుకు టెండరు ప్రక్రియ ద్వారా పనులు చేపట్టాలి. బహిరంగ టెండరు ద్వారా తక్కువకు కోట్ చేసిన వారికి పనులను అప్పగించాలి. కానీ ఇక్కడా పద్ధతిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం లేదు. గతంలో నామినేషన్ పద్ధతిన పనులను కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్లను అప్పగించేవారు. పీవీవీఎస్ మూర్తి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక నామినేషన్ పనులకు బ్రేక్ పడింది. దీంతో ఇంజినీర్లు నామినేషన్ ముసుగులో ‘బాక్స్ టెండర్ల’కు తెరలేపారు. ఎంత పెద్ద పనైనా ముక్కలు ముక్కలుగా విభజిస్తున్నారు. ఉదాహరణకు రూ. 5 లక్షలు విలుజేసే పనిని రూ. లక్ష లోపు ఆరు పనులుగా విభజించి ‘బాక్స్ టెండర్’ పేరిట తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ అవినీతికి తెరతీస్తున్నారు. బాక్స్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవి పూర్తయ్యాకే షెడ్యూలు దాఖలు చేస్తారు. ఇవీ అప్పగించిన పనులు.. ►పాతబస్తీలోని నాల్గో వార్డులో గుంతల పూడిక, బీటీ ప్యాచ్ వర్క్‌లకు సంబంధించి రూ. 1.58 లక్షల పనిని అంచనాలు తగ్గించి రెండుగా విభజించారు. ఒక దాన్ని రూ. 98 వేలు, మరొక దాన్ని రూ. 60 వేలు చొప్పున రెండు పనులుగా అప్పగించారు. ►కల్లూరు మండల పరిధిలోని శ్రీరామ్ నగర్లో(25వ వార్డు) బీటీ ప్యాచ్ వర్క్‌కు సంబంధించిన రూ. 94 వేలు విలువైన పనిని నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అదే కాలనీలో రూ. 99 వేల విలువైన బీటీ ప్యాచ్ వర్క్ పనిని బాక్స్ టెండర్ ద్వారా కేటాయించారు. ►కర్నూలులోని ఐదురోడ్ల కూడలి నుంచి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రహారీ గోడపై చిత్రాల పెయింటింగ్ పనులను కూడా రెండుగా విభజించి బాక్స్ టెండర్ కింద ఒక పనిని రూ. 95 వేలు, మరొక పనిని రూ. 65 వేలు చొప్పున కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ►నగర పాలక సంస్థ పరిధిలోని పార్కుల్లో ఆర్ సీసీ బెంచ్‌లను ఏర్పాటు చేసేందుకు గానూ రూ. 99 వేల చొప్పున రెండు పనులను విభజించి అప్పగించారు. .. ఇలా సుమారు రూ. 2 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టరుకు అప్పగించిన వైనంపై పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు తప్పుపడుతున్నారు. అంచనా కన్నా తక్కువ ధరను కోట్ చేసి పనులు చేపట్టే కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు విలువైన పనులను విభజించి(రూ. లక్ష లోపు) బాక్స్ టెండర్ల పేరిట అప్పగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై కేఎంసీ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘బాక్స్ టెండర్ అనే ప్రక్రియ రహస్యమేమి కాదు... నామినేషన్ పద్ధతి అంతకంటే కాదు. పనులను దక్కించుకోవాలనుకున్న వారు టెండర్ ద్వారా పోటీ పడవచ్చు’ అని తెలిపారు. అక్కడ ఆ ఇంజినీరుదే హవా..! నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో టెండర్ల ప్రక్రియ పర్యవేక్షిస్తున్న ఓ అధికారి హవా నడుపుతున్నారు. రాష్ట్ర స్థాయి ‘ముఖ్య’ ఇంజినీరు ఈయన స్నేహితుడు. దీంతో ఆయన దాదాపు ఐదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. కల్లూరు పరిధిలో ఇంజినీరుగా పనిచేస్తే ఈయన తన రెగ్యులర్పోస్టుతోపాటు డ్రా యింగ్ బ్రాంచ్, నీటి సరఫరా విభాగానికి ఇన్చార్జిగా ఉన్నారు. నగర పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సం బంధించి కాంట్రాక్టర్లతో భారీగా కమీషన్లు వసూలు చేసి ఉన్నత స్థాయి అధికారులకు ముడుపులు అందజేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. కేఎంసీలో దాదాపు నాలుగేళ్ల పాటు ప్రత్యేకాధికారి పాలన నడిచింది. ఈ కాలంలో దాదాపు రూ.40 కోట్ల పైబడి పనులు జరిగాయి. గత రెండేళ్లుగా ఏకంగా రూ. 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ‘బాక్స్ టెండర్’ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించకుండా బీటీ, ఇతరత్రా రోడ్ల ప్యాచ్‌వర్క్ వంటి పనులను ముక్కలుగా చేసి ఆయనకు అనుకూలంగా ఉన్న ఓ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి.