‘నామినేషన్‌’ దందా! | TDP Leaders Fraud In Kurnool Municipal Corporation Tenders | Sakshi
Sakshi News home page

‘నామినేషన్‌’ దందా!

Aug 30 2018 6:46 AM | Updated on Oct 17 2018 6:27 PM

TDP Leaders Fraud In Kurnool Municipal Corporation Tenders - Sakshi

 కర్నూలు నగర పాలక సంస్థ

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో అధికార పార్టీ నేతలు మరోసారి నామినేషన్‌ పనుల పర్వానికి తెరతీశారు. మొత్తం రూ.25 కోట్ల పనులను నామినేషన్‌పై కాజేసేందుకు పథక రచన చేశారు. ఇందుకోసం ఒక్కో పని విలువను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఈ విధంగా మొత్తం 500 పనులను తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వీటిని అప్పగించేందుకు కాంట్రాక్టర్లను సైతం ముందుగానే ఎంపిక చేసుకున్నారు. వారి నుంచి ఏకంగా 20 శాతం కమీషన్‌ తీసుకునేందుకు ఇటు కర్నూలు, అటు పాణ్యం నియోజకవర్గ అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు.

ఎంపిక చేసుకున్న పనుల విషయంలోనూ అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చేసిన పనులతో పాటు సగం పూర్తి చేసిన వాటిని ఎంపిక చేసుకుని భారీగా కమీషన్లు దండుకునేందుకు ఎత్తుగడ వేసినట్లు  సమాచారం. గతంలో ఒకసారి నామినేషన్‌ పనుల రుచి మరిగిన అధికార పార్టీ నేతలు మరోసారి నిధులను ఆరగించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు అర్బన్‌ ప్రాంతంలో సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణానికి మొత్తం 500 పనులను  నామినేషన్‌పై తీసుకునేందుకు గుర్తించారు. వీటి అంచనాలు కూడా ఇప్పటికే తయారుచేయించిన అధికారపార్టీ నేతలు..ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకునేందుకు యత్నిస్తున్నారు.
 
టెండర్లు లేకుండానే... 
గతంలోనూ నామినేషన్‌పై పనులు చేపట్టారు. నామినేషన్‌పై పనులు అప్పగించాలంటే ఎంతో అత్యవసరమైనవై ఉండాలని మునిసిపల్‌ శాఖ డైరెక్టర్‌ కన్నబాబు మొదట్లో కొర్రీలు వేశారు. అత్యవసరమైనవి కాకపోతే.. టెండర్ల ద్వారానే చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. దీంతో మొదట్లో నామినేషన్‌ పనులకు బ్రేకులు పడ్డాయి. అయితే, చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే పనిచేశాయి. కర్నూలు, పాణ్యంకు చెందిన నేతలు అప్పట్లో సుమారు రూ.50 కోట్ల పనులను నామినేషన్‌పై తీసుకున్నారు. ఇవన్నీ కార్యకర్తలకు ఇచ్చేందుకేనని చెప్పి తీసుకున్న అధికార పార్టీ నేతలు.. ఆచరణలో మాత్రం కమీషన్లు దండుకున్నారు. పనులను కాస్తా తిరిగి కాంట్రాక్టర్లకే అప్పగించారు. ఒక్కో కాంట్రాక్టర్‌ నుంచి ప్రధాన నేతలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్లు అందాయి. తిరిగి ఇప్పుడు మరోసారి కార్యకర్తల పేరుపై నామినేషన్‌ ప్రాతిపదికన పనులు తీసుకునేందుకు కర్నూలు, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.  

రూ.5 కోట్ల కమీషన్లు! 
కర్నూలు కార్పొరేషన్‌లో ఏ టెండర్లు పిలిచినా గతంలో 15 శాతం వరకూ తక్కువ ధరకే వేసేవారు. అయితే, అధికార పార్టీ నేత  రంగంలోకి దిగిన తర్వాత ప్రతి టెండరు తనకు మాత్రమే దక్కేలా చేసుకోవడంతో పాటు రింగుకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఒక్కో టెండరు 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరకు వేసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కార్పొరేషన్‌ ఖజానాకు గండి పడుతోంది. ఇప్పుడు నామినేషన్లపై తీసుకునే పనులకు కూడా టెండర్లను పిలిస్తే 15 శాతం వరకూ తక్కువ ధరకే చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే, అధికార పార్టీ నేతల పేరుతో తీసుకోనుండడంతో అంచనా ధరకే పనులను అప్పగించనున్నారు.

అది కూడా ఎంపిక చేసిన వారికి నామినేషన్‌పై మాత్రమే. ఇక్కడ ఇంజినీర్లతో ముందుగానే కుమ్మక్కై చేసిన పనులకే తిరిగి అంచనాలు వేయించడంతో పాటు అధికంగా కూడా వేయించి భారీగా దండుకోనున్నారు. మొత్తం 500 పనులకు గానూ ఒక్కో పని అంచనా విలువ రూ.5 లక్షలుగా నిర్ణయించిన నేపథ్యంలో  మొత్తం రూ.25 కోట్ల పనుల్లో 20 శాతం కమీషన్‌ అంటే రూ.5 కోట్ల మేర దండుకునేందుకు ఇద్దరు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement