పథకాల అమలుపై నిరంతర నిఘా
ఏటీఅగ్రహారం(గుంటూరు)
ప్రభుత్వ పథకాలు అమలుపై విజిలెన్స్ నిఘా నిరంతరం కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కె.వి.మోహన్‌రావు చెప్పారు. బుధవారం ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందన్నారు. అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను సీరియస్‌గా పరిగణిస్తామన్నారు. మైనింగ్, ఇసుక మాఫీయాపై నిఘా కొనసాగించి వివిధ శాఖల అధికారులతో సంయుక్త దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మైనింగ్, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించి రేషన్‌బియ్యం, మైనింగ్, ఇసుక మాఫీయాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు సమాచారాన్ని 80082 03288 సెల్‌నంబరుకు అందించాలని కోరారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నందున సమర్థంగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
గత చరిత్ర ఇదీ..
మోహన్‌రావు 2006 ఐపీఎస్ బ్యాచ్‌లో డీఎస్పీగా విధుల్లో చేరారు. కొత్తగూడెం, కామారెడ్డి, నిజామాబాద్, గుంతకల్లుల్లో విధులు నిర్వహించారు. ఏఎస్పీగా పదోన్నతి పొంది కర్నూలు, విశాఖపట్నం రూరల్ జిల్లాల్లో పనిచేసి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొంది నెల్లూరు విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు.
2012లో ఎస్పీగా పదోన్నతి పొంది మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌కు నియమితులయ్యారు. అనంతరం నిజామాబాద్‌లో ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. అధికారులు, కార్యాలయ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్డీ రామకృష్ణలను మర్యాదపూర్వకంగా కలిశారు.