kv pradeep
-
ఒలెక్ట్రాకు 100 ఈ–బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 100 ఈ–బస్‌లకు ఆర్డర్ అందుకుంది. అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డ్ స్వీకరించింది. డీల్ విలువ రూ.151 కోట్లు అని సంస్థ సీఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ ఎలక్ట్రిక్ బస్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్. తొమ్మిది నెలల్లో ఈ బస్సులను డెలివరీ చేయనుంది. ఒలెక్ట్రాను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రమోట్ చేస్తోంది. కాగా, గ్రీన్‌టెక్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.800 కోట్ల వరకు నిధులను సమీకరించడానికి బోర్డ్ ఆమోదం తెలిపిందని ఒలెక్ట్రా పేర్కొంది. -
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీగా కె.వి. ప్రదీప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నూతన ఎండీగా వెంకటేశ్వర ప్రదీప్ కారుమూరు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కొత్త బాధ్యతల్లో మూడేళ్లపాటు ఉంటారు. సివిల్ ఇంజనీర్ అయిన ప్రదీప్.. వ్యాపార అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, ఈపీసీ, విమానయాన రంగాల్లో 22 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యంత అధునాతన, పర్యావరణ అనుకూల ఈ–బస్‌లను ప్రవేశపెట్టడంలో భాగస్వామ్యం అవుతామని వివరించారు. ఆర్డర్ బుక్ 1,325 బస్‌లు.. ప్రస్తుతం ఒలెక్ట్రా ఖాతాలో 1,325 బస్‌లకు ఆర్డర్ ఉంది. ఇందులో 87 యూనిట్లు డెలివరీ చేశారు. కొత్తగా 300 బస్‌ల కాంట్రాక్టుకుగాను లోయెస్ట్ బిడ్డర్‌గా కంపెనీ నిలిచింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. మరిన్ని టెండర్లలో పాలుపంచుకునే పనిలో కంపెనీ నిమగ్నమైంది. కాగా, జూన్ త్రైమాసికంలో ఒలెక్ట్రా రూ.5.65 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3.62 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 86 శాతం అధికమై రూ.41.15 కోట్లు సాధించింది. ఇందులో ఈ–బస్ విభాగం వాటా రూ.23.36 కోట్లు ఉంది. విద్యుత్ పంపిణీకి అవసరమైన సిలికాన్ రబ్బర్/కంపోజిట్ ఇన్సులేటర్స్ తయారీలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ దేశంలో అతిపెద్ద కంపెనీ. -
పాత చిత్రాల్లో కథకే ప్రాధాన్యం
భీమవరం : పాత తరం సినిమాల్లో కథకు ప్రాధాన్యమిచ్చేవారని, ప్రస్తుతం అది లేదని నాలుగు స్తంభాలాట చిత్రం హీరో కె.వి.ప్రదీప్ పేర్కొన్నారు. భీమవరం వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు. ప్రస్తుత సినీ పరిశ్రమకు, నాటి పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అప్పటి చిత్రాలకు కథ, హీరో, హీరోయిన్లకు ప్రాధాన్యమిచ్చి చిత్రాన్ని తెరకెక్కించేవారని, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రతి సినిమాలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా వినియోగించి చిత్రాలను నిర్మిస్తున్నారన్నారు. అప్పట్లో చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్క ఆర్టిస్టు, సిబ్బంది ఎంతగానో శ్రమించి స్వశక్తితో పైకి ఎదిగేవారని ఇప్పుడది లేదన్నారు. కుటుంబ నేపధ్యం, రాజకీయ పలుకుబడితో చిత్ర పరిశ్రమలోకి నటులు ప్రవేశిస్తున్నారన్నారు. తాను నటించిన ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’, ‘రెండు జెడల సీత’ సినిమాలు అప్పట్లో ఎంతగానో ప్రజల ఆదరాభిమానాలు చూరగొని సినీ పరిశ్రమలో మైలు రాళ్లుగా నిలిచాయన్నారు. మధ్యలో సీఏ, సైకాలజీ డిగ్రీ విద్యాభ్యాసం నిమిత్తం సినీ పరిశ్రమకు కొంత దూరమయ్యానన్నారు. తరువాత 1986లో తొలిసారిగా రాష్ట్రంలో బుల్లితెర సీరియళ్ల సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. బుచ్చిబాబు సీరియల్‌తో తెలుగు పరిశ్రమలో టీవి సీరియళ్ల పరంపర ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాతగా, దర్శకుడిగా, ఆర్టిస్ట్‌గా 100 సీరియళ్లను నిర్మించానన్నారు. సీరియల్స్‌లో 12 నంది అవార్డులు తనకు దక్కాయన్నారు. తన భార్య సరస్వతి కూడా టీవీ సీరియల్స్‌లో నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ రాణిస్తోందన్నారు. సమాజంలోని రుగ్మతలను పారదోలడంపై విద్యార్థులు దృష్టి సారించేలా వ్యక్తిత్వ వికాసంపై పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల వేదికలుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ప్రదీప్ తెలిపారు. సమాజం మారాలంటే రేపటి పౌరులైన బాలలతోనే శ్రీకారం చుట్టాల్సి ఉందన్నారు.