పాత చిత్రాల్లో కథకే ప్రాధాన్యం
భీమవరం : పాత తరం సినిమాల్లో కథకు ప్రాధాన్యమిచ్చేవారని, ప్రస్తుతం అది లేదని నాలుగు స్తంభాలాట చిత్రం హీరో కె.వి.ప్రదీప్ పేర్కొన్నారు. భీమవరం వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు. ప్రస్తుత సినీ పరిశ్రమకు, నాటి పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అప్పటి చిత్రాలకు కథ, హీరో, హీరోయిన్‌లకు ప్రాధాన్యమిచ్చి చిత్రాన్ని తెరకెక్కించేవారని, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రతి సినిమాలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా వినియోగించి చిత్రాలను నిర్మిస్తున్నారన్నారు. అప్పట్లో చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్క ఆర్టిస్టు, సిబ్బంది ఎంతగానో శ్రమించి స్వశక్తితో పైకి ఎదిగేవారని ఇప్పుడది లేదన్నారు.
కుటుంబ నేపధ్యం, రాజకీయ పలుకుబడితో చిత్ర పరిశ్రమలోకి నటులు ప్రవేశిస్తున్నారన్నారు. తాను నటించిన ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’, ‘రెండు జెడల సీత’ సినిమాలు అప్పట్లో ఎంతగానో ప్రజల ఆదరాభిమానాలు చూరగొని సినీ పరిశ్రమలో మైలు రాళ్లుగా నిలిచాయన్నారు. మధ్యలో సీఏ, సైకాలజీ డిగ్రీ విద్యాభ్యాసం నిమిత్తం సినీ పరిశ్రమకు కొంత దూరమయ్యానన్నారు. తరువాత 1986లో తొలిసారిగా రాష్ట్రంలో బుల్లితెర సీరియళ్ల సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. బుచ్చిబాబు సీరియల్‌తో తెలుగు పరిశ్రమలో టీవి సీరియళ్ల పరంపర ప్రారంభమైందన్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాతగా, దర్శకుడిగా, ఆర్టిస్ట్‌గా 100 సీరియళ్లను నిర్మించానన్నారు. సీరియల్స్‌లో 12 నంది అవార్డులు తనకు దక్కాయన్నారు. తన భార్య సరస్వతి కూడా టీవీ సీరియల్స్‌లో నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ రాణిస్తోందన్నారు. సమాజంలోని రుగ్మతలను పారదోలడంపై విద్యార్థులు దృష్టి సారించేలా వ్యక్తిత్వ వికాసంపై పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల వేదికలుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ప్రదీప్ తెలిపారు. సమాజం మారాలంటే రేపటి పౌరులైన బాలలతోనే శ్రీకారం చుట్టాల్సి ఉందన్నారు.