Lakeview Guesthouse
-
బాబు కోసం వచ్చి.. లిఫ్టులో ఇరుక్కున్నారు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన కాపునాడు నాయకులు లిఫ్టులో ఇరుక్కుపోయారు. లేక్‌వ్యూ అతిథిగృహంలోని లిఫ్టులో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మంగారావు సహా ఆరుగురు అతిథిగృహంలోని లిఫ్టులో ఇరుక్కున్నారు. గంట సేపటి నుంచి వాళ్లు లిఫ్టులోనే ఉండిపోయారు. సాంకేతిక సమస్య కారణంగా లిఫ్టు ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక వాళ్లు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. -
స్వాతంత్య్ర వేడుకలకు రూ.5 కోట్లు
* ఏపీ పోలీసుల కోసం రూ. 1.21 కోట్లు విడుదల * అదే హైదరాబాద్‌లో అయితే రూ.80 లక్షలతో సరి.. * లేక్‌వ్యూ అతిథిగృహంలో సోకులకు మరో అరకోటి * బులెట్ ప్రూఫ్‌కు రూ.కోటి సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సాధారణంగా అయితే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తే రూ.70 నుంచి రూ.80 లక్షల వ్యయంతో అయిపోతుందని, అలాగాక కర్నూలు జిల్లాలో నిర్వహించడం వల్ల ఎక్కువ వ్యయం అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నూలు జిల్లాలో నిర్వహించే ఈ వేడుకల కోసం రూ.5 కోట్లను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం ఆర్థిక శాఖను కోరింది. ఇది కేవలం వేడుకలు నిర్వహించే స్థలంలో ఏర్పాట్లకేనని, మిగతా రంగాలకు చెందిన శాఖల వ్యయం విడిగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకయ్యే వ్యయం కింద పోలీసులకోసం ప్రత్యేకంగా రూ. 1.21 కోట్లను రాష్ట్రప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు బస చేయడానికి, వారి రవాణా చార్జీలు, ఇతర సౌకర్యాలకు మరింత ఖర్చవనుంది. ఇటీవలే విజయవాడలో ఒకరోజు నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సుకోసం రూ.30 లక్షలు ఖర్చు చేయడం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథిగృహంలో సోకుల కోసం రూ.56.30 లక్షలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే లేక్‌వ్యూ అతిథిగృహంలో బులెట్ ప్రూఫ్ కోసం మరో కోటి రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే లేక్‌వ్యూ అతిథిగృహం మరమ్మతులకు రూ.10 కోట్లు వ్యయం చేయడం విదితమే. -
లేక్వ్యూలో కేసీఆర్‌తో సీఎస్ మహంతి భేటీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం భేటీ అయ్యారు. లేక్‌వ్యూ అతిథిగృహంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ప్రక్రియ, పంపకాలు, స్థానికతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్‌కు వివరిస్తున్నట్లు సమాచారం. కాగా ఉద్యోగుల విభజనపై కేసీఆర్ ప్రధానంగా సీఎస్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల విభజనలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని ఆయన సూచనలు చేసినట్లు సమాచారం. మహంతితో పాటు డీజీపీ ప్రసాదరావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు పలువురు తెలంగాణ ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కేసీఆర్‌ను కలిశారు. తాజా పరిణామాలు, విభజన అంశాలపై చర్చించారు. -
లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద భారీ బందోబస్తు
హైదరాబాద్ : లేక్ వ్యూ అతిధి గృహం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రెండురోజుల పాటు లేక్వ్యూలో బస చేయటంతో సమైక్యవాదుల నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్‌కు సమైక్యవాదుల నుంచి నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సీఐఎస్ఎఫ్ ఆర్ఏఎఫ్, టాస్క్‌ఫోర్స్ బలగాలు మోహరించాయి. అనుమతి ఉన్నవారినే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగ్విజయ్ భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ పీసీసీ కార్యవర్గంతో సమావేశం కానున్నారు. సీమాంద్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఇరువురితో ఆయన భేటీ అవుతారు.