* ఏపీ పోలీసుల కోసం రూ. 1.21 కోట్లు విడుదల
* అదే హైదరాబాద్‌లో అయితే రూ.80 లక్షలతో సరి..
* లేక్‌వ్యూ అతిథిగృహంలో సోకులకు మరో అరకోటి
* బులెట్ ప్రూఫ్‌కు రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సాధారణంగా అయితే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తే రూ.70 నుంచి రూ.80 లక్షల వ్యయంతో అయిపోతుందని, అలాగాక కర్నూలు జిల్లాలో నిర్వహించడం వల్ల ఎక్కువ వ్యయం అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నూలు జిల్లాలో నిర్వహించే ఈ వేడుకల కోసం రూ.5 కోట్లను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం ఆర్థిక శాఖను కోరింది. ఇది కేవలం వేడుకలు నిర్వహించే స్థలంలో ఏర్పాట్లకేనని, మిగతా రంగాలకు చెందిన శాఖల వ్యయం విడిగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు కర్నూలు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకయ్యే వ్యయం కింద పోలీసులకోసం ప్రత్యేకంగా రూ. 1.21 కోట్లను రాష్ట్రప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు బస చేయడానికి, వారి రవాణా చార్జీలు, ఇతర సౌకర్యాలకు మరింత ఖర్చవనుంది. ఇటీవలే విజయవాడలో ఒకరోజు నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సుకోసం రూ.30 లక్షలు ఖర్చు చేయడం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథిగృహంలో సోకుల కోసం రూ.56.30 లక్షలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే లేక్‌వ్యూ అతిథిగృహంలో బులెట్ ప్రూఫ్ కోసం మరో కోటి రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే లేక్‌వ్యూ అతిథిగృహం మరమ్మతులకు రూ.10 కోట్లు వ్యయం చేయడం విదితమే.
స్వాతంత్య్ర వేడుకలకు రూ.5 కోట్లు
Published Sun, Aug 10 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement