Lakkireddypalle
-
కువైట్‌లో ముగ్గురిని హత్యచేసిన ఏపీ వాసి!
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు కుమారుడు పిలోళ్ల వెంకటేష్ కువైట్‌లో తాను పనిచేస్తున్న యజమానిని, అతడి భార్య, కుమార్తెలను హత్య చేసినట్లు వచ్చిన సమాచారం సంచలనం సృష్టిస్తోంది. వెంకటేష్ మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఒకరి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల తరువాత తన భార్య స్వాతిని కూడా కువైట్‌కు తీసుకెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు. వారిని వెంకటేష్ అమ్మనాన్నల వద్ద వదిలారు. వారం క్రితం తనకు కువైట్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. యజమానిని, ఆయన భార్యాకూతుళ్లను వెంకటేష్ కత్తితో గొంతు కోసి చంపాడని పోలీసులు తీసుకెళ్లినట్టు అవతలి వ్యక్తి నుంచి సమాచారం వచ్చిందన్నారు. తన కుమారుడికి ఉరిశిక్ష పడుతుందని తెలిపారని శ్రీరాములు చెబుతున్నాడు. వారం రోజుల క్రితం వెంకటేష్ ఇంటికి ఫోన్ చేసి పిల్లల క్షేమసమాచారాలు తెలుసుకున్నాడని, కానీ ఇంతలోకే ఇలా జరిగిందా అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. -
బయటపడిన బియ్యం బాగోతం
సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : చౌక బియ్యంలో కొందరు వ్యక్తులు చేస్తున్న దోపీడీని సాక్షి బహిర్గం చేసింది. లక్కిరెడ్డిపల్లె..రామాపురం..గాలివీడు మండలాల్లోని స్కూళ్ల వసతి గృహాలకు లక్కిరెడ్డిపల్లె బియ్యం గోడౌన్ నుంచి ప్రభుత్వ సబ్ కాంట్రాక్టర్ నిత్యావసర సరుకులను తరలిస్తుంటారు..చిన్నమండ్యెంకు చెందిన గోడౌన్ స్టాకిస్టు వంశీకృష్ణ ఇక్కడి గోడౌన్ ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని గుట్టుచప్పుడు కాకుండా ఆయన దళారులను అడ్డుపెట్టుకొని బియ్యం దందా సాగిస్తున్నారని తెలిసింది. దీనిపై సాక్షి నిఘా పెట్టింది. ప్రతి నెలా దాదాపు 200 క్వింటాళ్లు పైబడే బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు సమాచారం. సబ్ కాంట్రాక్టర్‌కు హమాలీలు కూడా తోడవుతున్నట్లు భోగట్టా. తూకాలు వేసి ఇవ్వాలని చాలా మంది డీలర్లు అడుగుతున్నా పట్టించుకోకపోవడంలేదు. దీంతో బస్తాకు 3 నుంచి 5 కేజీలు తరుగు వస్తోందని డీలర్లు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు గానీ సిబ్బంది గాని పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా చౌకదుకాణాలతో పాటు వసతి గృహాలకు బియ్యం తరలింపు ప్రక్రియ చేపడుతూ మధ్య మధ్యలో కొంత బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 182 బస్తాల చౌక బియ్యాన్ని ఇదే విధంగాబ్లాక్ మార్కెట్‌కు తరలించేందకు ప్రయత్నం చేశారు. బియ్యంలోడున్న వాహనం రాయచోటికి బయలుదేరినట్లు సాక్షికి సమాచారం అందింది. టెంపో వాహనాన్ని రాయచోటి మాసాపేట వద్ద సాక్షి విలేకరి అడ్డుకున్నారు. చిత్తూరు వెళుతున్నట్లు వాహన డ్రైవరు తెలిపారు. బియ్యం లోడ్‌పై పట్టను తొలగించగాగా 182 బస్తాల బియ్యం కనిపించాయి. వెంటనే డ్రైవర్ తప్పించుకునే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడున్న కొందరు మీడియాను వెంబడించి ద్విచక్రవాహనం తాళాలు,సెల్ ఫోన్లు లాక్కుని బెదిరించారు. ఈలోగా బియ్యం వాహనం ముందుకు వేగంగా కదిలిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ వెంటనే లక్కిరెడ్డిపల్లె గౌడౌన్‌ను తనిఖీ చేశారు. ఆ సమయానికి అక్కడ సిబ్బంది,సబ్ కాంట్రాక్టర్ లేరు. రికార్డులు కూడా అందుబాటులో లేవు. కడప ఆర్డీఓ మలోలాను సాక్షి సంప్రదించగా అక్రమంగా తరలిపోయిన 182 బస్తాల చౌకబియ్యం లక్కిరెడ్డిపల్లె గౌడౌన్‌కు చెందినవేనని స్పష్టం చేవారు. సీసీ పుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించామన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు. -
‘కర్ర’స్పాండెంట్ దండన
సాక్షి, లక్కిరెడ్డిపల్లె : పాఠశాలల్లో పిల్లలను కొట్టవద్దని చట్టాలు చెబుతున్నా చాలామంది ఉపాధ్యాయులకు చెవికెక్కడం లేదు. విచక్షణారహితంగా కొడుతున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దండన ద్వారా బోధన సరికాదని పలు నిపుణుల కమిటీల నివేదికలు, సూచనలను అమలు చేయడానికి కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆసక్తి చూపడం లేదు. హోం వర్కు చేయలేదనో..చెప్పిన మాట వినలేదనో ఇష్టానుసారం దండిస్తున్న వైనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కిరెడ్డిపల్లెలో సోమవారం జరిగిన సంఘటన అందరినీ కలిచివేసింది. మూడో తరగతి విద్యార్థిని శరీరమంతా వాతలు తేలేలా చితక్కొట్టాడో ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని శిక్షకు విలవిల్లాడిపోయాడా బాలుడు యశ్వంత్. ఈ బాలుడిని తల్లిదండ్రులు అవ్వాతాతల వద్ద విడిచి పొట్టకూటికి గల్ఫ్ వెళ్లారు. లక్కిరెడ్డిపల్లెలోని సందీప్ పాఠశాలలో బాలుడు చదువుతున్నాడు. సోమవారం హోం వర్కు చేయలేదని పాఠశాల కరస్పాండెంట్ శివ ఎక్కడబడితే అక్కడ కొట్టాడు. స్కూలులో సహచర బాలురు ఈ దండన చూసి భయభ్రాంతులయ్యారు. బాలుడు వేసిన కేకలకు ఇరుగుపొరుగు వారు వచ్చినా ఆ కరస్పాండెంట్ ధోరణి మారలేదు. పైగా వారందరిపై తిరగబడ్డాడు. ప్రశ్నించిన విలేకరులనూ దుర్భాషలాడాడు. లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ సురేష్ రెడ్డి, ఈఓ చక్రేనాయక్‌లు పాఠశాల వద్దకు చేరుకుని కరస్పాండెంట్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. స్కూలు గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరస్పాండెంట్ శివపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాయచోటి డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ ఈ సంఘటనపై విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు. -
చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్ పైశాచికత్వం
లక్కిరెడ్డిపల్లె: హోం వర్కు చేయలేదనే కారణంతో మూడో తరగతి విద్యార్థిని పాఠశాల కరస్పాండెంట్ చితకబాదాడు. తీవ్రగాయాలపాలైన విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో సోమవారం జరిగింది. లక్కిరెడ్డిపల్లె మండలం యనమలవాండ్లపల్లెకు చెందిన చిరంజీవి,రమాదేవి దంపతులు పొట్టకూటి కోసం ఇద్దరు బిడ్డలను అవ్వాతాతల దగ్గర వదిలి కువైట్‌కు వెళ్లారు. గ్రామంలో ప్రభుత్వ బడి మూతబడటంతో సమీపంలోని లక్కిరెడ్డిపల్లెలోని సందీప్ స్కూలులో ఈ బిడ్డలను చేర్పించారు. పెద్ద కుమారుడు యశ్వంత్ మూడో తరగతి చదువుతున్నాడు. హోం వర్క్ చేయలేదనే కారణంతో యశ్వంత్‌ను పాఠశాల కరస్పాండెంట్ శివ సోమవారం ఉదయం చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక యశ్వంత్ అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్కూల్ వద్దకు చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మీకు సంబంధం లేదంటూ వారిపైనా శివ చిందులేశాడు. విలేకర్లను కూడా మీకు ఇక్కడ ఏం పని ఉంది? వెళ్లిపోండంటూ గెంటి వేయడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ సురేష్ రెడ్డి, ఎంఈవో చక్రేనాయక్‌లు పాఠశాల వద్దకు చేరుకుని కరస్పాండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న రాయచోటి డిప్యూటీ డీఈవో వరలక్ష్మి పాఠశాలకు చేరుకుని డీఈవో, ఆర్జేడీలకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని తెలిపారు. వారు స్పందించి స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఎంఈవో ఆదేశించారు. -
అనంతపురం గంగమ్మ ఆలయంలో చోరీ
రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలోని గంగమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. కొంతమంది దుండగులు ఆలయ ద్వారం పగలగొట్టి లోనికి ప్రవేశించి హుండీని దోచుకున్నారు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ ఈవోకు సమాచారం అందించారు. ఈవో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఆలయంలోని హుండీ ఆదాయాన్ని రెండు నెలలుగా లెక్కించలేదని, కానుకలు భారీగానే ఉండవచ్చని ఈవో తెలిపారు. -
టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
లక్కిరెడ్డిపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్త పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని గుటకవానిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ చెందిన నాయకులు, కార్యర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ చేసిన దాడిలో గంగిరెడ్డి అనే వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మృతి అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త పరిస్థితి విషమంగా మారడంతో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణ కారణంగా గుటకవానిపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.