సాక్షి, లక్కిరెడ్డిపల్లె : పాఠశాలల్లో పిల్లలను కొట్టవద్దని చట్టాలు చెబుతున్నా చాలామంది ఉపాధ్యాయులకు చెవికెక్కడం లేదు. విచక్షణారహితంగా కొడుతున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దండన ద్వారా బోధన సరికాదని పలు నిపుణుల కమిటీల నివేదికలు, సూచనలను అమలు చేయడానికి కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆసక్తి చూపడం లేదు. హోం వర్కు చేయలేదనో..చెప్పిన మాట వినలేదనో ఇష్టానుసారం దండిస్తున్న వైనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కిరెడ్డిపల్లెలో సోమవారం జరిగిన సంఘటన అందరినీ కలిచివేసింది. మూడో తరగతి విద్యార్థిని శరీరమంతా వాతలు తేలేలా చితక్కొట్టాడో ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని శిక్షకు విలవిల్లాడిపోయాడా బాలుడు యశ్వంత్. ఈ బాలుడిని తల్లిదండ్రులు అవ్వాతాతల వద్ద విడిచి పొట్టకూటికి గల్ఫ్ వెళ్లారు. లక్కిరెడ్డిపల్లెలోని సందీప్ పాఠశాలలో బాలుడు చదువుతున్నాడు.
సోమవారం హోం వర్కు చేయలేదని పాఠశాల కరస్పాండెంట్ శివ ఎక్కడబడితే అక్కడ కొట్టాడు. స్కూలులో సహచర బాలురు ఈ దండన చూసి భయభ్రాంతులయ్యారు. బాలుడు వేసిన కేకలకు ఇరుగుపొరుగు వారు వచ్చినా ఆ కరస్పాండెంట్ ధోరణి మారలేదు. పైగా వారందరిపై తిరగబడ్డాడు. ప్రశ్నించిన విలేకరులనూ దుర్భాషలాడాడు. లక్కిరెడ్డిపల్లె ఎస్‌ఐ సురేష్ రెడ్డి, ఈఓ చక్రేనాయక్‌లు పాఠశాల వద్దకు చేరుకుని కరస్పాండెంట్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. స్కూలు గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరస్పాండెంట్ శివపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాయచోటి డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ ఈ సంఘటనపై విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment