
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు కుమారుడు పిలోళ్ల వెంకటేష్ కువైట్‌లో తాను పనిచేస్తున్న యజమానిని, అతడి భార్య, కుమార్తెలను హత్య చేసినట్లు వచ్చిన సమాచారం సంచలనం సృష్టిస్తోంది. వెంకటేష్ మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఒకరి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల తరువాత తన భార్య స్వాతిని కూడా కువైట్‌కు తీసుకెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు.
వారిని వెంకటేష్ అమ్మనాన్నల వద్ద వదిలారు. వారం క్రితం తనకు కువైట్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. యజమానిని, ఆయన భార్యాకూతుళ్లను వెంకటేష్ కత్తితో గొంతు కోసి చంపాడని పోలీసులు తీసుకెళ్లినట్టు అవతలి వ్యక్తి నుంచి సమాచారం వచ్చిందన్నారు. తన కుమారుడికి ఉరిశిక్ష పడుతుందని తెలిపారని శ్రీరాములు చెబుతున్నాడు. వారం రోజుల క్రితం వెంకటేష్ ఇంటికి ఫోన్ చేసి పిల్లల క్షేమసమాచారాలు తెలుసుకున్నాడని, కానీ ఇంతలోకే ఇలా జరిగిందా అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.
Comments
Please login to add a commentAdd a comment