Lalith Babu
-
రెండో స్థానంలో లలిత్‌బాబు
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్ లలిత్‌బాబు సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలోని లీలా అంబియెన్స్ కన్వెన్షన్ హోటల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో లలిత్ మరో నలుగురితో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఏడో రౌండ్లో మాజీ జాతీయ చాంపియన్ జి. ఆకాశ్‌పై లలిత్‌బాబు విజయం సాధించాడు. సంకల్ప్ గుప్తా, దేబాశిష్ దాస్, పి. కార్తీకేయన్, నుబర్షా షేక్ కూడా 5.5 పాయింట్లతో ఉన్నారు. ఆరు పాయింట్లు సాధించిన వైభవ్, నితిన్ ప్రస్తుతం ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
లలిత్‌కు మూడో గెలుపు
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు మూడో విజయం నమోదు చేశాడు. నితిన్ (రైల్వేస్)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన లలిత్ 34 ఎత్తుల్లో గెలుపొందాడు. రత్నాకరన్ (భారత్)తో జరిగిన మరో గేమ్‌లో తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. హర్ష భరతకోటి, రవితేజ మధ్య జరిగిన గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఏడో రౌండ్ తర్వాత లలిత్, అర్జున్ 5.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
విజేత లలిత్ బాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 14 మంది అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆరు గేముల్లో గెలిచిన అతను ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) గ్రాండ్‌మాస్టర్ స్వప్నిల్ ధోపాడేతో జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్‌ను లలిత్ కేవలం 14 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు లలిత్ 44 ఎత్తుల్లో ఎస్. నితిన్ (ఆర్ఎస్పీబీ)పై; 29 ఎత్తుల్లో దేబాశిష్ దాస్ (ఒడిశా)పై; 57 ఎత్తుల్లో ఆర్.ఆర్. లక్ష్మణ్ (ఆర్ఎస్పీబీ)పై; 46 ఎత్తుల్లో అరవింద్ చిదంబరం (తమిళనాడు)పై; 54 ఎత్తుల్లో జయకుమార్ (మహారాష్ట్ర)పై; 39 ఎత్తుల్లో సునీల్‌దత్ నారాయణన్ (కేరళ)పై గెలిచాడు. శ్యామ్ నిఖిల్ (ఆర్ఎస్పీబీ)తో 26 ఎత్తుల్లో; హిమాంశు శర్మ (ఆర్ఎస్పీబీ)తో 57 ఎత్తుల్లో; ఆర్గ్యదీప్ దాస్ (ఆర్ఎస్పీబీ)తో 21 ఎత్తుల్లో; అభిజిత్ కుంతే (పీఎస్‌పీబీ)తో 28 ఎత్తుల్లో; దీపన్ చక్రవర్తి (ఆర్ఎస్పీబీ)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మురళి కార్తికేయన్ (తమిళనాడు) చేతిలో మాత్రం 31 ఎత్తుల్లో ఓడిపోయాడు. మరోవైపు 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకు... జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌కు 62 ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్ర స్టేట్ చెస్ సంఘం ఆధ్వర్యంలో 1955లో ఏలూరులో తొలిసారి ఈ చాంపియన్‌షిప్ జరిగింది. రామచంద్ర సాప్రే (మహారాష్ట్ర), డి. వెంకయ్య (ఆంధ్రప్రదేశ్) సంయుక్త విజేతలుగా నిలిచారు. 1955లో వెంకయ్య తర్వాత ఈ పోటీల్లో లలిత్ బాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్‌కు టైటిల్ దక్కడం విశేషం. మాన్యుయల్ ఆరోన్ (తమిళనాడు) అత్యధికంగా తొమ్మిదిసార్లు ఈ టైటిల్‌ను దక్కించుకోగా... ప్రవీణ్ థిప్పే (మహారాష్ట్ర) ఏడుసార్లు, సూర్యశేఖర గంగూలీ (బెంగాల్) ఆరుసార్లు, కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు) నాలుగుసార్లు, విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు) మూడుసార్లు ఈ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా నా ప్రదర్శన ఆశించినస్థాయిలో లేదు. తాజా ఫలితం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం రెండు నెలలుగా కోచ్ మురళీకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేశాను. ఈ సన్నాహాలు టోర్నీ సందర్భంగా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ టోర్నీలో నేను తొమ్మిది మంది గ్రాండ్మాస్టర్లతో తలపడ్డాను. నలుగురిపై గెలిచి, మరో నలుగురితో గేమ్‌లు ‘డ్రా’ చేసుకున్నాను. వచ్చే సీజన్లోనూ మరింత నిలకడగా ఆడి మరిన్ని విజయాలు సాధించాలని పట్టుదలతో ఉన్నాను. – ‘సాక్షి’తో లలిత్ బాబు -
రెండో సీడ్‌గా లలిత్ బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో మూడు కేటగిరీల్లో 28 దేశాలకు చెందిన 1800 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. రూ. 51 లక్షల 51 వేల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో తజికిస్తాన్ జీఎం ఫరూఖ్‌కు టాప్ సీడింగ్ దక్కింది. -
లలిత్, ప్రత్యూష గెలుపు
తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూష విజయాలు సాధించారు. శనివారం జరిగిన ఓపెన్ కేటగిరి మూడో రౌండ్లో లలిత్ బాబు 41 ఎత్తుల్లో మసూద్ (ఇరాన్)పై గెలుపొందగా... మహిళల విభాగంలో ప్రత్యూష 35 ఎత్తుల్లో బషీరా (యూఏఈ)పై విజయం సాధించింది. -
హంపి, హారిక గేమ్ ‘డ్రా’
అల్ అయిన్ (యూఏఈ) : ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికల మధ్య శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్ 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. హంపి, హారిక ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా... ఆరుసార్లు ‘డ్రా’తో సరిపెట్టుకోగా, ఒకసారి హంపి గెలిచింది. లలిత్ బాబు, అభిజిత్ కుంతేల గేమ్ 16 ఎత్తుల్లో డ్రా’ అయింది. ఏడో రౌండ్ తర్వాత హంపి, హారిక ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. ఇదే టోర్నీ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఏడో రౌండ్లో 36 ఎత్తుల్లో థి ఎన్గుయెన్ (వియత్నాం)పై గెలిచింది. -
లలిత్ బాబుకు కాంస్యం
కామన్వెల్త్ చెస్ న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు కాంస్య పతకాన్ని సాధించాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత లలిత్ బాబు 7.5 పాయింట్లతో ఆర్గ్యా దీప్ దాస్ (భారత్), దీపన్ చక్రవర్తి (భారత్)తో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... ఆర్గ్యాదీప్‌కు రెండో స్థానం, లలిత్‌కు మూడో స్థానం, దీపన్‌కు నాలుగో స్థానం దక్కింది. భారత్‌కే చెందిన అభిజిత్ గుప్తా 8 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. ఇదే టోర్నమెంట్ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.హర్షిత 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. -
హంపి, లలిత్ గెలుపు
న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, లలిత్ బాబు వరుసగా మూడో విజయాన్ని సాధించారు. బుధవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నాసిర్ అహ్మద్ (బంగ్లాదేశ్)పై హంపి, రఘునందన్ (భారత్)పై లలిత్ బాబు గెలిచారు. మూడో రౌండ్ తర్వాత వీరిద్దరూ మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
లలిత్ గేమ్ డ్రా
జిబ్రాల్టర్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుకు... ట్రేడ్వైస్ జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో మరో డ్రా ఎదురైంది. ఎనిమిదో రౌండ్లో అలెగ్జాండర్ మోతేలెవ్ (రష్యా-5.5)తో జరిగిన గేమ్‌ను అతను 51 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఇవాన్ చెపిర్నోవ్ (బల్గేరియా-6)తో జరిగిన గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 41 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. మహిళా గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... రొమేయిన్ ఎడ్డార్డ్ (ఫ్రాన్స్-5)ల మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. పద్మినికి గ్రాండ్‌మాస్టర్ నార్మ్ ఒడిశాకు చెదిన పద్మిని రౌత్‌కు గ్రాండ్‌మాస్టర్‌కు అవసరమైన నార్మ్ లభించింది. ఎనిమిదో రౌండ్లో ఆమె... తమిర్ నబతే (ఇజ్రాయిల్)పై నెగ్గింది. దీంతో పద్మిని ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. పద్మినికి ఇది వరుసగా మూడో గ్రాండ్‌మాస్టర్ నార్మ్. -
మళ్లీ ఓడిన లలిత్‌బాబు
అబుదాబి: భారత గ్రాండ్‌మాస్టర్ లలిత్బాబుకు అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్లో లలిత్.. హంగేరికి చెందిన మెజరోస్ చేతిలో ఓడాడు. అయితే యంగ్ ఇంటర్నేషనల్ మాస్టర్ మురళీ కార్తికేయన్ మూడో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ అరెషెంకోపై సంచలన విజయం సాధించాడు.