'గడ్డి' కరిచారు
మూగ జీవాల ఉసురు ఊరికే పోలేదు. పశువుల నోటి దగ్గర కూడు లాక్కున్న ఆ పాపం ఏళ్లు గడిచినా తరిమి తరిమి వెంటాడింది. చివరకు ఊచలు లెక్కించే వరకూ తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. 16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో లాలూ సహా 45 మందిని రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంది. వీరికి న్యాయస్థానం శిక్షను అక్టోబర్ 3వ తేదీన ఖరారు చేయనుంది.
రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. లాలూకు మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేరచరిత ప్రజా ప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు ప్రకారం లాలూ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోనున్నారు. రెండు లేదా అంతకంటె ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం లాలూ ఎంపీ పదవిని కోల్పోవడం ఖాయం. అంతే కాకుండా అనర్హత వేటు కూడా పడనుంది. అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి లాలూ అనర్హుడిగా మారే ప్రమాదం ఏర్పడనుంది. అదే జరిగితే రాజకీయాల్లో లాలూ ప్రస్థానం ముగిసినట్లే.
బ్ తక్ సమోసామే ఆలూ రహేగా... తబ్ తక్ బీహార్మే లాలూ రహేగా అని గర్వంగా ప్రకటించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తిన్న నేరానికి.... చివరకు నేరం నిరూపితమై... కటకటాల వెనక్కి వెళ్లారు. తీర్పు వెలువడిన వెంటనే ఆయన్ని పోలీసులు రాంచీలోని బిస్రాముండా సెంటర్ జైలుకు తరలించారు.
1996లో వెలుగు చూసిన దాణా కుంభకోణం
1996, మార్చి 11న పశుదాణా కుంభకోణంపై సీబీఐ విచారణకు పాట్నా హైకోర్టు ఆదేశం
1997లో సీబీఐ విచారణ ప్రారంభం
1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న లాలూ
1998, ఆగస్టులో లాలూపై ఆదాయానికి మించి ఆస్తులకేసు నమోదు
2000, ఏప్రిల్ : లాలూ, రబ్రీదేవిలపై ఛార్జిషీటు దాఖలు
కోర్టులో లొంగిపోయిన రబ్రీ, లాలూ
రబ్రీకి బెయిల్, లాలూకు నో బెయిల్
2000, మే 5న లాలూకు బెయిల్ మంజూరు చేసిన పాట్నా హైకోర్టు
లాలూ, రబ్రీలపై అభియోగాల నమోదు