lambadipeta
-
విజయవాడ:చంటిబిడ్డను బలిగొన్న నిర్లక్ష్యం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కన్నతల్లి నిర్లక్ష్యం చంటిబిడ్డ ప్రాణాలు హరించింది. ముఖం నుంచి నడుం వరకూ అంతా వేడి నీటికి కాలిపోయినా మృత్యువుతో ఆ బిడ్డ చేసిన పోరాటం చివరకు విషాదంగా ముగిసింది. బోసి నవ్వులు, బుడి బుడి అడుగులు ఇక కనపడవన్న విషయం తెలిసిన ఆ కన్నవారికి కన్నీళ్లే మిగిల్చింది. కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్లో పడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీపేటకు చెందిన ఆదిమల్ల ప్రణితి, ప్రేమ్కుమార్లు భార్యభర్తలు. వీరికి పాప(8 నెలలు) సంతానం. ప్రేమ్‌కుమార్ సెంట్రింగ్ పని చేస్తుండగా, ప్రణితి ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 27వ తేదీన భర్త ప్రేమ్‌కుమార్ పనికి వెళ్లగా, పాపకు స్నానం చేయించేందుకు మంచం పక్కనే.. ప్లాస్టిక్ బకెట్లో ఎలక్ట్రికల్ హీటర్ పెట్టి బాత్రూమ్లోకి వెళ్లింది. ఇంతలో గదిలో నుంచి పాప ఏడుపు వినిపించడంతో కంగారుగా వచ్చి చూసింది. పాప వేడినీటి బకెట్లో తల కిందులుగా పడి ఉండటంతో భయంతో కేకలు వేసింది. పాపను వేడినీటిలో నుంచి బయటకు తీయగా ముఖం, రెండు చేతులు, పొట్ట భాగం, వీపు, కాలి భాగం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో పాప చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పసిపిల్లలు ఉన్న ఇంట్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటారు తల్లిదండ్రులు, పెద్దలు. కానీ, ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. అనుక్షణం పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
అదృశ్యమా.. కిడ్నాపా..
బాలిక అదృశ్యంపై కలకలం రోజంతా గడిచినా లభించని ఆచూకీ విజయవాడ (చిట్టినగర్) : స్కూల్‌కని బయలుదేరిన బాలిక అదృశ్యమైంది. రోజంతా గడిచినా బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక అదృశ్యమైందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. లంబాడీపేట సాయిరాం థియేటర్ ఎదురు వెంకట నారాయణ వీధి కొండ ప్రాంతంలో దోవరి జయకుమారి కుటుంబం నివాసిస్తోంది. జయకుమారి భర్త నాగరాజు కొంత కాలం కిందట మృతిచెందాడు. జయకుమారి తన కుమార్తె దోవతి విజయశాంతి (11)తో కలిసి అక్క దాసరి పింకీ ఇంట్లో ఉంటోంది. పింకీ భర్త అను దుబాయ్‌లో పనిచేస్తుంటాడు. పొట్ట కూటి కోసం రెండేళ్ల కిందట జయకుమారి కూడా కువైట్ వెళ్లింది. విజయశాంతి స్థానికంగా ఉండే కాన్వెంట్లో ఆరో తరగతి చదువుతోంది. రోజు లాగానే సోమవారం ఉదయం 9–30 గంటల సమయంలో విజయశాంతి స్కూల్‌కు వెళ్లింది. మధ్యాహ్నం విజయశాంతికి అమ్మమ్మ మరియమ్మ క్యారేజీ తీసుకువెళ్లింది. ఆమె రాలేదని స్కూల్ సిబ్బంది చెప్పడంతో కంగారుపడిన మరియమ్మ తన పెద్ద కుమార్తె పింకీకి విషయం చెప్పింది. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కొత్తపేట పీఎస్‌కు వెళ్లింది. సీఐ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం రావాలని స్టేషన్ సిబ్బంది పేర్కొన్నారు. బాలిక కనిపించడం లేదనే విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబీకులు అందరూ లంబాడీపేటకు చేరుకున్నారు. మనవరాలి కోసం మరియమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. బాలిక కనిపించడం లేదనే విషయాన్ని తల్లికి చేరవేసేందుకు ఆ కుటుంబం తర్జన భర్జన పడుతోంది. సీఎం క్యాంప్ ఆఫీసుకు.. బాలిక కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లితే సరిగా స్పందించకపోవడంతో పింకీ నగరంలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ మీడియా సిబ్బందికి విషయం చెప్పి వెనుతిరిగింది. అయితే సాయంత్రం పోలీసులు బాధితురాలి నుంచి వివరాలను తీసుకుని కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం కొత్తపేట పోలీసులు లంబాడీపేటకు చేరుకుని స్థానికులను ఆరా తీశారు. విజయశాంతి రోజూ ఎవరితో కలిసి స్కూల్‌కు వెళ్లుతుంది. స్నేహితుల వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. అదృశ్యానికి కారణాలేమైనా ఉన్నాయా అనే దిశగా కూడా విచారణ చేపట్టారు. బాలిక కనిపించకుండా పోవడంతో రెండు బృందాలను రంగంలోకి దింపి బస్టాండ్, రైల్వే స్టేషన్ సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ దుర్గారావు పేర్కొన్నారు. తల్లికి చెప్పాలా.. వద్దా..? కువైట్‌లో ఉంటున్న బాలిక తల్లికి విషయం చెప్పాలా, వద్దా అని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. బిడ్డ భవిష్యత్ కోసం కువైట్ వెళ్లి పనిచేస్తోందని, బాలిక కనిపించడం లేదన్న విషయం ఆమెకు తెలిస్తే పరిస్థితి ఏమిటని బాలిక అమ్మమ్మ, బంధువులు మదనపడుతున్నారు.