చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కన్నతల్లి నిర్లక్ష్యం చంటిబిడ్డ ప్రాణాలు హరించింది. ముఖం నుంచి నడుం వరకూ అంతా వేడి నీటికి కాలిపోయినా మృత్యువుతో ఆ బిడ్డ చేసిన పోరాటం చివరకు విషాదంగా ముగిసింది. బోసి నవ్వులు, బుడి బుడి అడుగులు ఇక కనపడవన్న విషయం తెలిసిన ఆ కన్నవారికి కన్నీళ్లే మిగిల్చింది.
కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్‌లో పడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లంబాడీపేటకు చెందిన ఆదిమల్ల ప్రణితి, ప్రేమ్‌కుమార్‌లు భార్యభర్తలు. వీరికి పాప(8 నెలలు) సంతానం. ప్రేమ్‌కుమార్ సెంట్రింగ్ పని చేస్తుండగా, ప్రణితి ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 27వ తేదీన భర్త ప్రేమ్‌కుమార్ పనికి వెళ్లగా, పాపకు స్నానం చేయించేందుకు మంచం పక్కనే.. ప్లాస్టిక్ బకెట్‌లో ఎలక్ట్రికల్ హీటర్ పెట్టి బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. ఇంతలో గదిలో నుంచి పాప ఏడుపు వినిపించడంతో కంగారుగా వచ్చి చూసింది.
పాప వేడినీటి బకెట్‌లో తల కిందులుగా పడి ఉండటంతో భయంతో కేకలు వేసింది. పాపను వేడినీటిలో నుంచి బయటకు తీయగా ముఖం, రెండు చేతులు, పొట్ట భాగం, వీపు, కాలి భాగం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో పాప చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
పసిపిల్లలు ఉన్న ఇంట్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటారు తల్లిదండ్రులు, పెద్దలు. కానీ, ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. అనుక్షణం పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment