Land acquisition amendment of the law
-
రైతుల గుండెలపై నిలబడి రాజధాని నిర్మాణమా?
* చంద్రబాబుకు బృందా కారత్ సూటి ప్రశ్న * రైతులకు పరిహారాన్ని ఎగ్గొట్టేందుకే భూసేకరణ ఆర్డినెన్స్‌పై నోరు మెదపలేదు * ప్రత్యేక ప్యాకేజీపై ప్రజలు బాబును నిలదీయాలి.. * ‘సాక్షి’తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సాక్షి, హైదరాబాద్: ‘రైతుల గుండెల మీద నిలబడి రాజధాని నిర్మిస్తారా?’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. బాబు తన సిద్ధాంతాలను తానే గాలికొదిలి పచ్చి రాజకీయ అవకాశవాదిగా మారారని, కేంద్రంతో మిలాఖత్ అయ్యారని దుయ్యబట్టారు. రైతుల నడ్డివిరిచేలా కేంద్రం భూ సేకరణ చట్ట సవరణపై ఆర్డినెన్స్ తెచ్చినా నోరు మెదపలేదని విమర్శించారు. రాష్ట్ర రాజధాని కోసం భూమిని సేకరిస్తున్నారని, ఆ భూమినే నమ్ముకున్న రైతులకు పరిహారాన్ని ఎగ్గొట్టేందుకే బాబు నోరు కుట్టేసుకున్నారని స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి నమూనా దారుణాతి దారుణమైనదని పేర్కొన్నారు. ‘నేను చంద్రబాబును మూడు ప్రశ్నలడగదలచుకున్నా.. కేంద్ర ఆర్డినెన్స్‌పై నోరెందుకు మెదపలేదో చెప్పాలి. రెండోది.. సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల్ని హరించేలా కేంద్రం సవరణలు చేసింది. దీనిపై మీ వైఖరేమిటో స్పష్టం చేయాలి. ఏపీ రాజధాని నిర్మాణం కోసం మీరు సింగపూర్, జపాన్, మలేసియా అంటూ అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. రాజధానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ చౌకగా దొరుకుతున్న కార్మిక శక్తిని అమ్మదలచుకున్నారా? రెతుల నడ్డి విరిచి నగరాల్ని నిర్మిస్తారా? సింగపూర్ నమూనా ఇక్కడెలా సాధ్యపడుతుంది? ఇక మూడో ప్రశ్న ఆదివాసీలకు సంబం దించింది.. పోలవరం ప్రాజెక్టును ఎవరి పొట్టగొట్టి నిర్మించాలనుకుంటున్నారు? ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించింది. అది ఎందుకు రాలేదో బాబు చెప్పాలి. ప్రజలూ నిలదీయాలి’ అని బృందా కారత్ అన్నారు. -
ఇది నియంతృత్వ ప్రభుత్వం
మోదీ రైతు వ్యతిరేకి సహచరులను నియంత్రించని ప్రధాని మోదీపై సోనియా ధ్వజం న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు నియంతృత్వ పోకడలకు పోతోందని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో సోమవారం సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సహచరులను ప్రధాని కావాలనే నియంత్రించటం లేదని ఆమె ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత పార్టీ పునర్వైభవం కోసం తీసుకోవలసిన నిర్మాణాత్మక చర్యలపై సీడబ్ల్యూసీ సమావేశమైంది. దేశ వ్యాప్తంగా సామాన్యుడికి పార్టీ చేరువ అయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని సీనియర్లను సోనియా ఆదేశించారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన భూసేకరణ చట్ట సవరణ ఆర్డినెన్సును నిరసిస్తూ దేశమంతటా ఆందోళన చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మోదీ సర్కారుకు ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం అన్నది లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. కేవలం ఏడు నెలల పదవీకాలంలో 10 ఆర్డినెన్సులు తీసుకురావటం వెనుక ఎన్డీఏ సర్కారు రహస్య ఎజెండా దాగి ఉందని ఆమె విమర్శించారు. ఎజెండాలో లేని నాయకత్వ మార్పు వరుస ఎన్నికల్లో వైఫల్యం నేపథ్యంలో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చకు రానే లేదు. సమావేశం అజెండాలో ఆ అంశం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికాసోనీ అన్నారు. 4 గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీలో క్రియాశీల సభ్యత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టడం, పార్టీలోని అన్ని స్థాయిల్లోని కమిటీల కాలపరిమితిని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలన్న అంశాలను చర్చించా రు. జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు.