land aquization
-
భూమి స్వాధీనం కేసులో రూ.2 కోట్ల పరిహారం
వేలూరు: భూమి స్వాధీనం కేసులో బాధితులకు రూ.2 కోట్ల పరిహారాన్ని జాతీయ లోక్ అదాలత్ జిల్లా న్యాయమూర్తి సెల్వసుందరి అందజేశారు. ఆమె అధ్యక్షతన శనివారం ఉదయం వేలూరు కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను పరిష్కరించారు. వానియంబాడి తాలూకా వీరాంగకుప్పం గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నటరాజన్ రెండు ఎకరాల భూమిని 1988లో ఆది ద్రావిడ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంటి పట్టాల కోసం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలానికి నష్ట పరిహారాన్ని చెల్లించలేదు. దీంతో నటరాజన్ వానియంబాడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండేళ్ల క్రితం నటరాజన్ మృతి చెందడంతో అతని వారసులు కేసును కొనసాగించారు. విచారణ జరిపిన కోర్టు నటరాజన్ కుటుంబ సభ్యులకు రూ.కోటి 98 లక్షల 96,893లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అదే విధంగా వేలూరు తుత్తికాడుకు చెందిన సుదాకర్ 2015లో లారీలో వెళుతూ కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స సమయంలో అతని ఒక కాలును తీసి వేశారు. తనకు రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారించిన కోర్టు అతనికి రూ.17 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. శనివారం ఉదయం న్యాయమూర్తులు లత, వెర్టిసెల్వి, అరుణాచలం బాధితులకు చెక్కులు అందజేశారు. న్యాయవాదులు ఉమాశంకర్, రవికుమార్, శ్రీధరన్ పాల్గొన్నారు. చదవండి: తమిళనాడు: మహిళా ఓటర్లే గెలుపు నిర్ణేతలు -
రామయ్యా.. ఊపిరి పీల్చుకో
శంషాబాద్ రూరల్: అత్యంత విలువైన ఆలయం భూములు కబ్జా చెర వీడాయి. అక్రమంగా ఈ భూములను కాజేసి ఏర్పాటు చేసిన వెంఛరులోని నిర్మాణాలు, హద్దురాళ్లను తొలగించిన దేవాదాయశాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని నర్కూడ సమీపంలో ఉన్న అమ్మపల్లి (శ్రీసీతారామచంద్రస్వామి) ఆలయానికి సర్వే నంబరు 47లో 32 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను గతంలో కొందరు తప్పుడు పత్రాలతో కబ్జా చేశారు. అంతేకాకుండా అందులో వెంఛరు ఏర్పాటు చేసి ప్లాట్లను అమ్ముకున్నారు. వివాదంగా మారిన ఈ భూముల హక్కుల కోసం దేవాదాయశాఖ ‘తెలంగాణ ఎండోమెంట్ ట్రిబ్యునల్’లో కేసు వేసింది. సుమారు రెండు దశాబ్దాలుగా వివాదంగా ఉన్న ఈ భూములు అమ్మపల్లి దేవాలయానికి చెందినవి ట్రిబ్యునల్లో నాలుగు నెలల కిందట తీర్పు వచ్చింది. దీంతో బుధవారం దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు భద్రతతో వచ్చి ఈ భూముల్లోని నిర్మాణాలను, ప్లాట్ల హద్దురాళ్లను జేసీబీలతో తొలగించారు. ఈ భూముల విలువ దాదాపు రూ.100 కోట్ల ధర పలుకుతుంది. బాధితుల ఆందోళన.. పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు ఆలయానికి చెందినదంటూ తమను వెళ్లగొట్టడంపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతలు జరుగుతున్నట్లు తెలుసుకున్న పలువురు బాధితులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్లను కొనుగోలు చేసిన పేద, మధ్య తరగతికి చెందిన బాధితులు ఎక్కువగా ఉన్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు మేరకు చర్యలు కోర్టు తీర్పు మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.ఎన్.సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లపై కూడా దాదాపు ఐదేళ్ల నుంచి నిషేధం ఉందని, ఆలయానికి చెందిన భూములను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ సుజిత్రెడ్డి, ఏఆర్ఐ ఇంద్రసేనారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు మధుబాబు, ప్రణీత్, ఈఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
హాయి వే..
ఖమ్మంఅర్బన్: నేషనల్ హైవే అధికారులు మరో హైవే నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న హైవేలతో అనుసంధానమైన నగరం.. కొత్త హైవే నిర్మాణంతో కొత్త రూపును సంతరించుకోనుంది. తాజాగా హైవే నిర్మాణానికి భూమి అవసరం ఉందంటూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓ ఇంగ్లిష్ దినపత్రికలో ఈనెల 5వ తేదీన భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ చూసిన కొందరు హైవే వస్తుందని సంతోషపడుతుంటే.. భూమి కోల్పోతున్న రైతులు మాత్రం సాగు భూములను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట–రాజమండ్రి నేషనల్ హైవే కోసం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి తదితర మండలాలకు చెందిన రైతులు రోడ్డు కోసం తమ భూములు ఇచ్చేది లేదని, ప్రభుత్వం అందించే పరిహారం అనుకున్న విధంగా లేదంటూ సర్వేలను అడ్డుకోవడం, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేస్తుండగా.. కొత్తగా నాగ్పూర్–అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కొన్ని నెలల క్రితం ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే చేయించిన విషయం విదితమే. ఏజెన్సీ సర్వే ఆధారంగా అనుకూలంగా ఉన్న నివేదికను తీసుకొని దాని ప్రకారం రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సర్వే నంబర్లవారీగా గుర్తించి.. గ్రామాలవారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 5వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్లో ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల నుంచి రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం వరకు సుమారు 21.5 కిలో మీటర్ల దూరంలోని సుమారు 260 ఎకరాల భూమి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 300 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. 21 కిలో మీటర్ల దూరంలోనే 260 ఎకరాలకుపైగా సాగు భూములను కోల్పోయే అవకాశం ఉండడంతో ఏయే సర్వే నంబర్ల నుంచి భూమి పోతుందని చూసుకున్న రైతులు కలవరపడుతున్నారు. కొందరికి ఉన్న 10 కుంటలు, ఎకరం, రెండెకరాల భూమి రోడ్డుకు పోతే.. తమకు చావే దిక్కని ఆందోళనకు గురవుతున్నారు. మరికొందరికి ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఉపయోగకరంగా ఉన్నా.. తాము మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం నగర సమీపం నుంచే వెళ్తుండడంతో ఆ ప్రాంతంలో భూములంటే ఎకరం సుమారుగా రూ.30లక్షల నుంచి రూ.కోటికిపైగానే ధర పలుకుతుంది. అయితే రోడ్డు నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్న ప్రభుత్వం అంత ధర చెల్లిస్తుందా.. అని ప్రశ్నించుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి భూమి పోతే మా గతేంటి అని రైతులు తమకు తెలిసిన నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి భూ సేకరణపై ఆరా తీస్తున్నారు. జారీ అయిన ప్రకటన ఆధారంగా అనేక మంది రైతులు రోడ్డు ఏ మార్గంలో ఉంది.. ఏ సర్వే నంబర్ నుంచి పోతుంది.. దాని హద్దులు ఏమిటంటూ.. స్థానికంగా రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుండగా.. ఈ అంశం గురించి తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్లో 90.5 కిలో మీటర్ నుంచి 112 కిలో మీటర్ వరకు భూ సేకరణ అంటూ.. సుమారు 21 కిలో మీటర్ల దూరంలో సుమారు 136 సర్వే నంబర్ల పరిధిలో 106 హెక్టార్లు అంటే.. 260 ఎకరాల వరకు భూమి అవసరం ఉంటుందని చూపించారు. ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల పరిధిలో 58 సర్వే నంబర్లు, ఖమ్మం అర్బన్లోని బల్లేపల్లి పరిధిలో 3 సర్వే నంబర్లు, రఘునాథపాలెం మండలం కామంచికల్ పరిధిలో 17 సర్వే నంబర్లు, రఘునాథపాలెం పరిధిలో 29 సర్వే నంబర్లు, రేగులచెలక పరిధిలో 18 సర్వే నంబర్లు, వీవీపాలెం పరిధిలో 11 సర్వే నంబర్లు ఉన్నాయి. రెండెకరాలు పోతుంది.. గతంలో సర్వే చేసినప్పుడు హద్దుల ప్రకారం చూస్తే మాకున్న రెండెకరాల్లో మొత్తం భూమి పోతుంది. మా సర్వే నంబర్ కూడా భూసేకరణ ప్రకటనలో ఉంది. భూమినే నమ్ముకున్న మేము.. దానిని రోడ్డు పేరుతో తీసుకుంటే మా పరిస్థితి ఏమిటనేది అర్థం కావట్లేదు. – వేగనాటి కిషోర్, రఘునాథపాలెం అనుకూలంగా ధరొస్తే ఇస్తాం.. అధికారులు సర్వే చేసిన ప్రాంతంలో మా కుటుంబ సభ్యులకు ఏడెకరాల భూమి ఉంది. దాంట్లో తన వాటాగా కొంత భూమి వస్తుంది. ప్రకటన జారీ ప్రకారం మా భూమిలో అరెకరం వరకు పోతుంది. ఏదైనా రైతులకు అనుకూలంగా ధర వస్తేనే భూమి ఇస్తాం. – మల్లీదు వెంకటేశ్వర్లు, బల్లేపల్లి -
సామూహిక ఆత్మహత్యలే శరణ్యం
విజయవాడ : స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెట్రోరైలు ప్రాజెక్టు భూసేకరణౖపై ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం చేపట్టారు. సబ్కలెక్టర్ డాక్టర్ జి. సృజన సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుకు పూర్తి వ్యతిరేకమని చేతులెత్తి నిరసన తెలిపారు. పేదలు, మద్యతరగతి వర్గాల ప్రజలను రోడ్లపాలు చేయవద్దని పలువురు విలపించారు. చంద్రబాబుకు, కలెక్టర్కు శాపనార్ధాలు పెట్టారు. మెట్రోప్రాజెక్టును అలంకార్ నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా రైవస్ కాలువ పక్కనుంచి నిర్మించాలని సూచించారు. మరి కొందరు బీఆర్టీఎస్ ప్రాజెక్టు మాదిరిగా మెట్రో రైలు ప్రాజెక్టు మూలన పడుతుందన్నారు. జనసంచారం లేని ప్రాంతంలో మెట్రోరైలు సాగదని, అనవసరంగా స్థలాలు లాక్కుని ప్రజలను ఇబ్బందులు పెట్ట వద్దన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖరరాజు పాల్గొని ప్రజాభిప్రాయాలను రికార్డు చేశారు. కార్యక్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టు జీఎం కామేశ్వరరావు, అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు.