రామయ్యా.. ఊపిరి పీల్చుకో  | 32 Acres of Temple Land Freed From Kabza in Shamshabad | Sakshi
Sakshi News home page

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

Published Thu, Jul 18 2019 1:26 PM | Last Updated on Thu, Jul 18 2019 1:26 PM

32 Acres of Temple Land Freed From Kabza in Shamshabad - Sakshi

ఆలయ భూములను స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

శంషాబాద్‌ రూరల్‌: అత్యంత విలువైన ఆలయం భూములు కబ్జా చెర వీడాయి. అక్రమంగా ఈ భూములను కాజేసి ఏర్పాటు చేసిన వెంఛరులోని నిర్మాణాలు, హద్దురాళ్లను తొలగించిన దేవాదాయశాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని నర్కూడ సమీపంలో ఉన్న అమ్మపల్లి (శ్రీసీతారామచంద్రస్వామి) ఆలయానికి సర్వే నంబరు 47లో 32 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను గతంలో కొందరు తప్పుడు పత్రాలతో కబ్జా చేశారు. అంతేకాకుండా అందులో వెంఛరు ఏర్పాటు చేసి ప్లాట్లను అమ్ముకున్నారు. వివాదంగా మారిన ఈ భూముల హక్కుల కోసం దేవాదాయశాఖ ‘తెలంగాణ ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌’లో కేసు వేసింది. సుమారు రెండు దశాబ్దాలుగా వివాదంగా ఉన్న ఈ భూములు అమ్మపల్లి దేవాలయానికి చెందినవి ట్రిబ్యునల్‌లో నాలుగు నెలల కిందట తీర్పు వచ్చింది. దీంతో బుధవారం దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు భద్రతతో వచ్చి ఈ భూముల్లోని నిర్మాణాలను, ప్లాట్ల హద్దురాళ్లను జేసీబీలతో తొలగించారు. ఈ భూముల విలువ దాదాపు రూ.100 కోట్ల ధర పలుకుతుంది.

 బాధితుల ఆందోళన.. 
పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు ఆలయానికి చెందినదంటూ తమను వెళ్లగొట్టడంపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతలు జరుగుతున్నట్లు తెలుసుకున్న పలువురు బాధితులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్లను కొనుగోలు చేసిన పేద, మధ్య తరగతికి చెందిన బాధితులు ఎక్కువగా ఉన్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

 కోర్టు తీర్పు మేరకు చర్యలు 
కోర్టు తీర్పు మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.ఎన్‌.సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్‌లపై కూడా దాదాపు ఐదేళ్ల నుంచి నిషేధం ఉందని, ఆలయానికి చెందిన భూములను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సుజిత్‌రెడ్డి, ఏఆర్‌ఐ ఇంద్రసేనారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్లు మధుబాబు, ప్రణీత్, ఈఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement