బాబూ...తప్పును సరిదిద్దుకో: ఉండవల్లి
సాక్షి, విజయవాడ బ్యూరో, తాడికొండ: ‘‘రాజధాని ప్రాంతంలో ప్రజల ఆమోదం లేకుండా భూ సమీకరణ లక్ష్యం పూర్తి కాదు. ఈ విషయంలో చంద్రబాబు సర్కారుకు భంగపాటు తప్పదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలన్న విషయాన్ని పక్కనబెట్టి వరల్డ్‌క్లాస్ రాజధానంటూ రైతుల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఇప్పటికైనా బాబు తన పంథాను వీడి చేసిన తప్పును సరిదిద్దుకుంటే మంచిది’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు.
ఆయన గురువారం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాయపూడి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ ప్రాంతం రాజధానికి పనికిరాదన్నా.. వినిపించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని రైతుల్ని వేధించడం భావ్యం కాదన్నారు.
23న పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నందున.. ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలతో రాజధాని భూముల విషయంపై మాట్లాడతామని ఆయన చెప్పారు. అవసరమైతే రైతులతో కలసి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముందని తెలిపారు. కాగా తుళ్లూరు మండలం రాయపూడిలో మాజీ ఎంపీపీ హరీంద్రనాథ్ చౌదరి స్వగృహంలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. వాస్తు పేరుతో సీఎం చంద్రబాబు అమాయక రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అసలు దేశానికే వాస్తు లేదన్నారు.