Land Grabbing attempt
-
కలిసి కట్టుగా కదిలారు.. అక్రమార్కుల భరతం పట్టారు
విత్తనాలతో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన అక్రమార్కులకు సరైన గుణపాఠం చెప్పారు. అన్నదాతలకు అండగా తాము ఉన్నామంటూ భరోసాయిచ్చారు. తలమడుగు: తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించి దాడి చేయడంతో జైపాల్‌రెడ్డి అనే రైతు మనస్తాపం చెందాడు. కొడుకు చరణ్‌రెడ్డితో కలిసి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతు కష్టం చూసి ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. చందాలతో విత్తనాలు కొని ఆ రైతు భూమిని చదును చేసి పత్తి విత్తనాలు వేశారు. భూకబ్జాకు యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగింది. ఒక్కడి కోసం అందరూ..! అదే రోజు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో అదే తరహలో మరో ఘటన జరిగింది. రైతు మీసాల లింగన్న 25 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి తమదని కొంతమంది ఆదిలాబాద్‌కు చెందిన అబ్దుల్ రజాక్, అబ్దుల్ సాజిద్, రజాక్ వచ్చి చేనులో పత్తి విత్తనాలు నాటారు. ఆరోజు లింగన్న గ్రామంలో లేకపోవడంతో విషయం బయటకు రాలేదు. తాజాగా మంగళవారం చేనును పరిశీలించిన రైతు లింగన్న ఆందోళన చెందాడు. విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా బాధిత రైతుకు మద్దతుగా అందరూ ఒక్కటయ్యారు. అరకలు పట్టుకుని లింగన్న చేను వద్దకు వెళ్లి.. ఆక్రమణదారులు నాటిన పత్తి విత్తనాలను చెడగొట్టారు. తర్వాత లింగన్న గ్రామస్తుల సాయంతో తాను పత్తి విత్తనాలు నాటాడు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ తాను 25 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన అబ్దుల్ బాబుసేట్ వద్ద ఎకరాకు రూ.50 వేల చొప్పున నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. తండ్రి అమ్మిన ఇప్పుడు కొడుకులు, బంధువులు వచ్చి భూమి తమదని ఆక్రమించుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. గ్రామస్తులు కూడా మరోమారు ఎవరైనా లింగన్న పొలంలో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత రైతు లింగన్న తలమడుగు పోలీస్ స్టేషన్లో అబ్దుల్ రజాక్, అబ్దుల్ సాజిద్, రజాక్‌పై ఫిర్యాదు చేశాడు. జైపాల్‌రెడ్డి పొలాన్ని పరిశీలించిన ఆర్డీవో తమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో రైతు జైపాల్‌రెడ్డి పొలాన్ని ఆర్డీవో రాథోడ్ రమేశ్ మంగళవారం పరిశీలించారు. జైపాల్‌రెడ్డి పొలం పక్క పొలం రైతుల వివరాలు తెలుసుకున్నారు. ఆసర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది, పక్కన గల రైతు స్వామి పొలాన్ని చుట్టు పక్కల హద్దుల వివరాలను, రెండు రోజుల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, సర్వేయర్ మనోజ్‌ను ఆదేశించారు. రైతు జైపాల్‌రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్డీవో వెంట గ్రామస్తులు కిరణ్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఉన్నారు. -
బంజారాహిల్స్‌లో ఒకే స్థలం ముగ్గురు, నలుగురికి విక్రయం
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో సర్కారు స్థలాలను స్వాహా చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గతంలో ఓ రెవెన్యూ అధికారి సంతకం ఫోర్జరీ చేసి దొరికిపోయినా.. మరొకరు జైలు ఊచలు లెక్కపెట్టినా.. విలువైన స్థలాలను కబ్జా చేసేందుకు అదే తతంగాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇదే తరహా ఘటన షేక్‌పేట మండలంలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే రోడ్డులో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ స్థలంపై రోజుకో కబ్జాదారుడు ఫోర్జరీ పత్రాలను సృష్టిస్తూ.. దర్జాగా కోట్లాది రూపాయలకు విక్రయిస్తున్నారు. గత మార్చిలో డాక్టర్ తిరుమల రాంచందర్‌రావు నకిలీ పత్రాలు సృష్టించి 9.17 ఎకరాలను ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు రూ.10 కోట్లు అడ్వాన్ప్‌గా తీసుకొని అంటగట్టారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రికార్డులను పరిశీలించిన సదరు ప్రొఫెసర్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమిని అమ్మిన రాంచందర్‌రావు సహా మరో ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన మరువకముందే ఇదే నిందితుడు మళ్లీ ఏకంగా షేక్‌పేట మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఈ స్థలాన్ని అంటగట్టేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పత్రాల పరిశీలన కోసం తహసీల్దార్ వద్దకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు కథ ఇదీ! 1950లో భూమిలేని ముగ్గురికి జీవనోపాధి నిమిత్తం బంజారాహిల్స్ రోడ్డు నం.12లో 25 ఎకరాలను ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అయితే, సదరు అసైన్డ్‌దారులు వ్యవసాయం చేయకపోవడం..భూమి కూడా సాగుకు అనువుగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ అసైన్మెంట్ను రద్దు చేశారు. విచిత్రమేమిటంటే.. అసైన్మెంట్ రద్దుకు మునుపే.. ఈ భూమి చేతులు మారింది. 25 ఎకరాల భూమిని మూడు సొసైటీలు కొనుగోలు చేశాయి. అసైన్మెంట్ను రద్దు చేయడంతో ఈ సొసైటీలు కోర్టుకెక్కాయి. దీంతో ఈ వివాద పరిష్కారానికి అప్పట్లో ప్రభుత్వం శాసనసభ కమిటీని వేయగా వీరికి 166 జీవో కింద స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించినా.. సొసైటీ సభ్యులకు ఈ స్థలాన్ని పంపిణీ చేయడం కష్టతరంగా ఉందని చెప్పడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇదే అదునుగా ఈ భూమిపై కన్నేసిన భూ మాఫియా.. రోజుకో ఫోర్జరీ పత్రాలతో స్థలాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ► దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే ఈ భూమిలో 9 ఎకరాల 17 గుంటలు తనదేనంటూ రూ.10 కోట్లకు విక్రయించి పోలీసులకు దొరికిపోయారు. ► కేవలం ఒకరికేగాకుండా..ఈ కేసు నమోదుకు ముందు కూడా మరొకరికి ఇదే భూమిని అమ్మజూపుతూ కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకోవడం గమనార్హం. ► విచిత్రమేమిటంటే.. విలువైన ఈ భూమిని కాజేసేందుకు తెరవెనుక పావులు కదుపుతున్న రియల్ మాఫియా.. అధికారుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలను సృష్టిస్తునే ఉంది. ఈ పత్రాలతోనే బురిడీ కొట్టిస్తూ.. అడ్వాన్స్ రూపేణా రూ.కోట్లు కొట్టేయడం పరిపాటిగా మారింది. ► ఏకంగా 40 మంది కబ్జాదారులు తప్పుడు పత్రాలతో అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారమవుతుందంటే.. ఈ భూమిని మింగేయడానికి ఎలా పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కేసు నమోదు బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా సుమారు 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని 9 ఎకరాలు తమవే అంటూ ఆ ప్రాంతానికే చెందిన డా.రాంచందర్‌రావు అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని విక్రయిస్తామంటూ చెప్పడంతో పాటు కొన్ని పత్రాలను రాంచందర్‌రావు తమకు ఇచ్చారంటూ సోమవారం ఓ వ్యక్తి షేక్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఈ పత్రాలు నిజమైనవైతే సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలంటూ కోరాడు. అతడు ఇచ్చిన పత్రాలను పరిశీలించగా.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం నిందితుడు రాంచందర్‌రావు తదితరులపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది బంజారాహిల్స్ రోడ్ నెం.12లో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఫోర్జరీ పత్రాలతో చాలా మంది కబ్జాదారులు విక్రయాలకు తెగబడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు మేం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. సీసీఎస్‌లో కూడా రాంచందర్‌రావు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ స్థలానికి సంబంధించి పత్రాలు తీసుకొని రాగా అవి ఫోర్జరీవి అని తేలింది. గతంలోనే సీసీఎస్ పోలీసులు ఈ స్థలానికి సంబంధించి వివరాలు అడగగా వారికి ఇవ్వడం జరిగింది. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ స్థలాలు విక్రయించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా స్థలం అమ్మకానికి ఉందని పత్రాలు ఇస్తే నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం -
Bethi Subhas Reddy: భూవివాదంతో నాకు సంబంధం లేదు
హబ్సిగూడ: కాప్రా డివిజన్ పరిధిలోని సర్వే నంబరు 152, 153 లోని 23 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ స్థలం వివాదంలో తాను తలదూర్చి నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుండటంతో కాప్రా తహసీల్దార్ గౌతంకుమార్ సూచనల మేరకు ఆక్రమణలకు గురికాకుండా చూశాం తప్పితే, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై గతంలో తహ సీల్దార్ ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. సదరు కేసులున్న వ్యక్తులు కోర్టులో పిటిషన్లు వేసి, మాపై కేసులు పెట్టించడం దారుణ మన్నారు. ఎవరు భూములు ఆక్రమించారో, ఎవరు తప్పులు చేశారో త్వరలో ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాపాడడమే తమ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భూ వివాదం: ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు -
కాకినాడలో తెలుగు తమ్ముళ్ల కబ్జా యత్నం
- ముఖ్య నాయకుని దన్నుతో బరి తెగింపు - ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు బేఖాతరు - వివాదాస్పద స్థలంలో గుడారాల తొలగింపు - అడ్డుకున్న స్థానికులు, మహిళలపై దౌర్జన్యం కాకినాడ క్రైం : కాకినాడలో తెలుగుతమ్ముళ్లు భూకబ్జా యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. వివాదాస్పద స్థలంలో నాలుగు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం వారు కాలరాస్తుండటంతో ఏళ్ల తరబడి ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్న స్థానికులు ఎదురుతిరిగారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జగన్నాథపురం శివారు యాళ్ల వారి గరువును ఆనుకుని ఉన్న ఎకరా 60 సెంట్ల భూమి చాలా కాలంగా 94 మంది వినియోగంలో ఉంది. వారు అక్కడ గుడారాలు వేసుకుని, చేపలు ఎండబెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకులు అధికారుల అండదండలతో ఆ స్థలాన్ని కబ్జా చేసి విక్రయించేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్న 94 మంది హైకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధికారపార్టీకి చెందిన స్థానిక ముఖ్యనేత అనుచరులు గురువారం ఆ స్థలంలో అక్రమంగా ప్రవేశించి అక్కడున్న గుడారాలను దౌర్జన్యంగా తొలగించారు. విషయం తెలిసిన స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారిని ప్రతిఘటించారు. ఈ క్రమంలో వెంకటలక్ష్మి అనే మహిళ స్పృహతప్పి పడిపోయింది. టీడీపీ నేత అనుచరులు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలాన్ని చాలా కాలం నుంచి తాము వినియోగించుకుంటున్నామని, కోర్టు ఉత్తర్వుల్ని ఖాతరు చేయకుండా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని వాపోయారు. కాగా, ఆ స్థలం తమదంటూ జగన్నాథపురానికి చెందిన మరో వర్గం వాదిస్తోంది. ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి, విక్రయించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఏ హక్కూ లేని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. టీడీపీ వారికి పోలీసుల వత్తాసు.. ఇంత వివాదం జరుగుతున్నా పోలీసులు ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఉద్రిక్త పరిస్థితుల ఉత్పన్నమైనా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సూచన మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావుకు విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరారు. మరోపక్క టీడీపీ ముఖ్య నేత అనుచరులు ఆ స్థలం చుట్టూ రాత్రికి రాత్రే ప్రహారీ నిర్మాణం చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పాలెపు దుర్గాలక్ష్మి, కె.వెంకటలక్ష్మి, పట్టా రామలక్ష్మి, మల్లాడి వెంకటలక్ష్మి, కొప్పాడి మహలక్ష్మి, తిరుపతి భవాని తదితరులు డిమాండ్ చేశారు.