ఎమ్మెల్యే కాలనీ చర్చి ఎదురుగా ఉన్న వివాదాస్పద స్థలం
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో సర్కారు స్థలాలను స్వాహా చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గతంలో ఓ రెవెన్యూ అధికారి సంతకం ఫోర్జరీ చేసి దొరికిపోయినా.. మరొకరు జైలు ఊచలు లెక్కపెట్టినా.. విలువైన స్థలాలను కబ్జా చేసేందుకు అదే తతంగాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇదే తరహా ఘటన షేక్‌పేట మండలంలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే రోడ్డులో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ స్థలంపై రోజుకో కబ్జాదారుడు ఫోర్జరీ పత్రాలను సృష్టిస్తూ.. దర్జాగా కోట్లాది రూపాయలకు విక్రయిస్తున్నారు.
గత మార్చిలో డాక్టర్ తిరుమల రాంచందర్‌రావు నకిలీ పత్రాలు సృష్టించి 9.17 ఎకరాలను ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు రూ.10 కోట్లు అడ్వాన్ప్‌గా తీసుకొని అంటగట్టారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రికార్డులను పరిశీలించిన సదరు ప్రొఫెసర్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమిని అమ్మిన రాంచందర్‌రావు సహా మరో ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన మరువకముందే ఇదే నిందితుడు మళ్లీ ఏకంగా షేక్‌పేట మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఈ స్థలాన్ని అంటగట్టేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పత్రాల పరిశీలన కోసం తహసీల్దార్ వద్దకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలు కథ ఇదీ!
1950లో భూమిలేని ముగ్గురికి జీవనోపాధి నిమిత్తం బంజారాహిల్స్ రోడ్డు నం.12లో 25 ఎకరాలను ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అయితే, సదరు అసైన్డ్‌దారులు వ్యవసాయం చేయకపోవడం..భూమి కూడా సాగుకు అనువుగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ అసైన్‌మెంట్‌ను రద్దు చేశారు. విచిత్రమేమిటంటే.. అసైన్‌మెంట్ రద్దుకు మునుపే.. ఈ భూమి చేతులు మారింది. 25 ఎకరాల భూమిని మూడు సొసైటీలు కొనుగోలు చేశాయి. అసైన్‌మెంట్‌ను రద్దు చేయడంతో ఈ సొసైటీలు కోర్టుకెక్కాయి. దీంతో ఈ వివాద పరిష్కారానికి అప్పట్లో ప్రభుత్వం శాసనసభ కమిటీని వేయగా వీరికి 166 జీవో కింద స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించినా.. సొసైటీ సభ్యులకు ఈ స్థలాన్ని పంపిణీ చేయడం కష్టతరంగా ఉందని చెప్పడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇదే అదునుగా ఈ భూమిపై కన్నేసిన భూ మాఫియా.. రోజుకో ఫోర్జరీ పత్రాలతో స్థలాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
► దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే ఈ భూమిలో 9 ఎకరాల 17 గుంటలు తనదేనంటూ రూ.10 కోట్లకు విక్రయించి పోలీసులకు దొరికిపోయారు.
► కేవలం ఒకరికేగాకుండా..ఈ కేసు నమోదుకు ముందు కూడా మరొకరికి ఇదే భూమిని అమ్మజూపుతూ కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకోవడం గమనార్హం.
► విచిత్రమేమిటంటే.. విలువైన ఈ భూమిని కాజేసేందుకు తెరవెనుక పావులు కదుపుతున్న రియల్ మాఫియా.. అధికారుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలను సృష్టిస్తునే ఉంది. ఈ పత్రాలతోనే బురిడీ కొట్టిస్తూ.. అడ్వాన్స్ రూపేణా రూ.కోట్లు కొట్టేయడం పరిపాటిగా మారింది.
► ఏకంగా 40 మంది కబ్జాదారులు తప్పుడు పత్రాలతో అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారమవుతుందంటే.. ఈ భూమిని మింగేయడానికి ఎలా పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
కేసు నమోదు
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా సుమారు 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని 9 ఎకరాలు తమవే అంటూ ఆ ప్రాంతానికే చెందిన డా.రాంచందర్‌రావు అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని విక్రయిస్తామంటూ చెప్పడంతో పాటు కొన్ని పత్రాలను రాంచందర్‌రావు తమకు ఇచ్చారంటూ సోమవారం ఓ వ్యక్తి షేక్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఈ పత్రాలు నిజమైనవైతే సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలంటూ కోరాడు. అతడు ఇచ్చిన పత్రాలను పరిశీలించగా.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం నిందితుడు రాంచందర్‌రావు తదితరులపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది
బంజారాహిల్స్ రోడ్ నెం.12లో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఫోర్జరీ పత్రాలతో చాలా మంది కబ్జాదారులు విక్రయాలకు తెగబడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు మేం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. సీసీఎస్‌లో కూడా రాంచందర్‌రావు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ స్థలానికి సంబంధించి పత్రాలు తీసుకొని రాగా అవి ఫోర్జరీవి అని తేలింది. గతంలోనే సీసీఎస్ పోలీసులు ఈ స్థలానికి సంబంధించి వివరాలు అడగగా వారికి ఇవ్వడం జరిగింది. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ స్థలాలు విక్రయించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా స్థలం అమ్మకానికి ఉందని పత్రాలు ఇస్తే నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు.
– శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం
Comments
Please login to add a commentAdd a comment