- ముఖ్య నాయకుని దన్నుతో బరి తెగింపు
- ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు బేఖాతరు
- వివాదాస్పద స్థలంలో గుడారాల తొలగింపు
- అడ్డుకున్న స్థానికులు, మహిళలపై దౌర్జన్యం
కాకినాడ క్రైం : కాకినాడలో తెలుగుతమ్ముళ్లు భూకబ్జా యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. వివాదాస్పద స్థలంలో నాలుగు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం వారు కాలరాస్తుండటంతో ఏళ్ల తరబడి ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్న స్థానికులు ఎదురుతిరిగారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జగన్నాథపురం శివారు యాళ్ల వారి గరువును ఆనుకుని ఉన్న ఎకరా 60 సెంట్ల భూమి చాలా కాలంగా 94 మంది వినియోగంలో ఉంది.
వారు అక్కడ గుడారాలు వేసుకుని, చేపలు ఎండబెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకులు అధికారుల అండదండలతో ఆ స్థలాన్ని కబ్జా చేసి విక్రయించేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్న 94 మంది హైకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధికారపార్టీకి చెందిన స్థానిక ముఖ్యనేత అనుచరులు గురువారం ఆ స్థలంలో అక్రమంగా ప్రవేశించి అక్కడున్న గుడారాలను దౌర్జన్యంగా తొలగించారు. విషయం తెలిసిన స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారిని ప్రతిఘటించారు.
ఈ క్రమంలో వెంకటలక్ష్మి అనే మహిళ స్పృహతప్పి పడిపోయింది. టీడీపీ నేత అనుచరులు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలాన్ని చాలా కాలం నుంచి తాము వినియోగించుకుంటున్నామని, కోర్టు ఉత్తర్వుల్ని ఖాతరు చేయకుండా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని వాపోయారు. కాగా, ఆ స్థలం తమదంటూ జగన్నాథపురానికి చెందిన మరో వర్గం వాదిస్తోంది. ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి, విక్రయించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఏ హక్కూ లేని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.
టీడీపీ వారికి పోలీసుల వత్తాసు..
ఇంత వివాదం జరుగుతున్నా పోలీసులు ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఉద్రిక్త పరిస్థితుల ఉత్పన్నమైనా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సూచన మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావుకు విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరారు. మరోపక్క టీడీపీ ముఖ్య నేత అనుచరులు ఆ స్థలం చుట్టూ రాత్రికి రాత్రే ప్రహారీ నిర్మాణం చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పాలెపు దుర్గాలక్ష్మి, కె.వెంకటలక్ష్మి, పట్టా రామలక్ష్మి, మల్లాడి వెంకటలక్ష్మి, కొప్పాడి మహలక్ష్మి, తిరుపతి భవాని తదితరులు డిమాండ్ చేశారు.
కాకినాడలో తెలుగు తమ్ముళ్ల కబ్జా యత్నం
Published Fri, Nov 28 2014 12:30 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement
Advertisement