Land occupation case
-
సారొచ్చారు.. పేదల్లో భరోసా.. భూకాసురుల్లో దడ
జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములపై పట్టున్న తహసీల్దార్‌గా అతనికి పేరుంది. ముచ్చటగా మూడోసారి తమ ప్రాంత తహసీల్దార్‌గా రావడంతో నిరుపేదల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే... కజ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. అతనే గౌతమ్‌కుమార్. సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్టోబర్ 11, 2016న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 25న రెండోసారి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలతో పాటు కస్టోడియన్ భూములు, కార్పొరేషన్లో వందల ఎకరాలను కజ్జాదారుల చెర నుంచి కాపాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉప్పల్ మండల తహసీల్దార్‌గా కొనసాగుతున్న గౌతమ్‌కుమార్‌ను ప్రభుత్వం కాప్రా మండల ఇన్చార్జ్ తహసీల్దార్‌గా బుధవారం అదనపు బాధ్యతలను అప్పగించింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు... ప్రభుత్వ భూములపై పట్టున్న అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌కుమార్ మూడోసారి అదనపు బాధ్యతలు చేపట్టడడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవ రికార్డులకు అనుకూలంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేకూర్చుతూనే... ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి కాపాడి ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు స్వీకరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ►గతంలో ప్రభుత్వ భూములను రక్షించి సఫలీకృతమయ్యారు. గౌతమ్‌కుమార్ అదన పు బాధ్యతలు స్వీకరించడంతో తమకు న్యాయం జరుగుతుందని నిరుపేదలు గట్టిగా నమ్ముతున్నారు. కాని అక్రమార్కుల్లో మా త్రం అప్పుడే ఆందోళన మొదలైంది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న తహసీల్దార్ (ఫైల్) గతంలో సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట.. జవహర్‌నగర్‌లోని మల్కారం గుట్టల్లో అక్రమంగా రాత్రి వేళల్లో నడిపిస్తున్న మట్టి దందాపై గతంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ సహజ వనరులను దొచుకెళ్తున్న వారిపై కొరడా ఝులిపించారు. ఒంటరిగా గుట్టల్లోకి తానే ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్లి సహజ వనరుల దోపిడీని నివారించడంలో సఫలీకృతుడయ్యారు. మరోమారు ఈ ప్రాంతాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలు ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్ తరాలకు ఉపయోగడేలా చర్యలు తీసుకోవడమే నా భాధ్యత. గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ విధులు నిర్వర్తించా. నిజమైన నిరుపేదలకు న్యాయం చేసి కజ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్ల కజ్జాలు, మున్సిపాలిటీకి (ప్రజల అవసరాల కోసం) కేటాయించిన స్థలాలపై సమగ్ర విచారణ చేసి వాటి పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తా. సిబ్బంది తప్పులు చేస్తే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గౌతమ్‌కుమార్, కాప్రా ఇన్చార్జ్ తహసీల్దార్ -
పరిటాల సునీత అనుచరుడి భూ బాగోతం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడి భూ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత, రామగిరి మాజీ ఎంపీపీ బాలరంగయ్య ధర్మవరంలో 3 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో 8.5 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న బాలరంగయ్య, పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు. బాలరంగయ్య ఇచ్చిన నకిలీ పత్రాలతో మున్సిపల్ స్థలాన్ని అప్పటి సబ్ రిజిస్టర్ చేశారు. కాగా ఈ అక్రమాలను గుర్తించిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మున్సిపల్ స్థలాన్ని అక్రమంగా రిజస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. బాల రంగయ్య, సబ్ రిజిస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’ -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి అరెస్ట్
సాక్షి, భువనగిరి: భూ ఆక్రమణలకు పాల్పడిందని అభియోగం మేరకు గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి సలీమాబేగంను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎం.సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పరిధిలోని సర్వే నంబర్ 590, 586లలో భూయాజమాని కె.అభినందన్ ప్లాట్లు చేసి 2006 సంవత్సరం కంటే ముందు విక్రయించాడు. వి.శంకర్‌చారి ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. 2007 తర్వాత అభినందన్‌కు చెందిన ఐదెకరాల భూమిని సలీమాబేగం, గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని గ్యాంగ్ సభ్యుల పేరిట ఎక్కరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు.. ఆ భూమిని వెంకట్‌రెడ్డి లండన్ టౌన్షిప్ పేరుతో వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించాడు. మొదట కొన్న ప్లాట్ల యాజమానులను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. అదే విధంగా 2006 సంవత్సరంలో భూమి యాజమాని అయిన కూరపాటి శ్రీదేవి, కూరపాటి శ్రీనివాస్‌లను బెదిరించి వారికి చెందిన 9 ఎకరాల భూమిని సలీమాబేగం కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆభూమిని కూడా ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు. ఇందులో భాగంగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వివరించారు. భువనగిరి పరిధిలో 14 కేసులు ఆమెపై నమోదైనట్లు చెప్పారు. భువనగిరి డీసీపీ, ఏసీపీ ఆదేశాల మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సలీమాబేగంపై భువనగిరితోపాటు శంషాబాద్, షాద్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోరుట్ల, ఆలేరు, నర్సింగి, ఆదిభట్ల, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో భూములు, ప్లాట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు. -
ఓ ‘పట్టా’న వదలరు!
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అనేక భూ కుంభకోణాల్లో అబ్బరాజుపాలెం వ్యవహారం ఒకటి. అధికార పార్టీ నాయకులు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) అధికారులతో కలసి పక్కా ప్రణాళిక రూపొందించి.. రద్దయిన పట్టాలతో ప్లాట్లను పొందేందుకు పథకం రచించారు. ఎకరం 16 సెంట్ల గ్రామ కంఠం ఆక్రమణకు గురైందని జాయింట్ కలెక్టర్ నిర్ధారించి.. ఆ పట్టాలను రద్దు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసినా ఇంతవరకు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంపై సమగ్రంగా మళ్లీ విచారణ చేపట్టి, అక్రమంగా ప్లాట్లు పొందాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజధాని ప్రాంత రైతులు కోరుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) రహదారులను నిర్మిస్తోంది. రోడ్ల కోసం ఇళ్లు కోల్పోయిన వారికి అంతే స్థలాన్ని సీఆర్డీఏ కేటాయించింది. స్థలంలో నిర్మాణాలు ఉంటే వాటి విలువను లెక్కగట్టి పరిహారం చెల్లిస్తోంది. అయితే అబ్బరాజుపాలెం మీదుగా ఎన్–14 రోడ్డు వెళ్తోంది. 45 కుటుంబాలకు చెందిన వారు ఇళ్లు కోల్పోతున్నారు. వీరందరికి సీఆర్డీఏ ప్లాట్లను కేటాయించాల్సి ఉంది. అయితే వీరిలో 14 కుటుంబాలకు చెందిన వారి పట్టాలను 2017లో గుంటూరు జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా రద్దు చేశారు. గ్రామ కంఠాలకు చెందిన 1.16 ఎకరాలను వీరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు అందడంతో విచారణ చేసిన ఆమె ఆక్రమణలు నిజమని నిర్ధారించి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సిఫార్సు చేశారు. రంగంలోకి దిగిన టీడీపీ నాయకులు, అధికారులు రద్దు చేసిన పట్టాలను పట్టించుకోకుండా రోడ్డు కోసం స్థలాలు కోల్పోతున్న బాధితుల జాబితాలో 15 మంది పేర్లను చేర్చారు. వీరందరికి నిజమైన అర్హులతో కలిపి అబ్బరాజుపాలెంలోనే ప్లాట్లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి 45 మంది పేర్లతో అబ్బరాజుపాలెం సీఆర్డీఏ కార్యాలయం నుంచి ప్లానింగ్ డిపార్ట్మెంట్కు లేఖ అందింది. అయితే అనర్హులకు, రద్దయిన పట్టాలకు ప్లాట్లను ఎలా కేటాయిస్తారని అదే గ్రామానికి చెందిన కొంతమంది సీఆర్డీఏ అధికారులను నిలదీయడంతో జాబితాను అప్పట్లో తొక్కిపెట్టారు. 3.12 ఎకరాల్లో 1.16 ఎకరాలు కబ్జా చేసిందే.. ఎన్ – 14 రోడ్డు కోసం అబ్బరాజుపాలెంలో మొత్తం 45 కుటుంబాల వారు ఇళ్లను కోల్పోతున్నారు. మొత్తం 3.12 ఎకరాల మేర ఇళ్ల స్థలాలు కోల్పోవాల్సిఉంది. ఇందులో 1.16 ఎకరాల మేర 15 మంది ఆక్రమించిన వారే ఉండడం గమనార్హం. రద్దయిన పట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా సీఆర్డీఏ అధికారులు తిరిగి అక్రమార్కులకు ప్లాట్లు కేటాయించాలనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్పట్లో ప్లాట్ల కేటాయింపును నిలిపేశారు. ఆక్రమణ భూమి విలువ రూ.15 కోట్ల పైమాటే..! అబ్బరాజుపాలెం గ్రామంలో భవాని శంకర స్వామి దేవస్థానానికి చెందిన భూమి ఉంది. ఈ భూమిని ఆనుకునే బలిబజారు (గ్రామ కంఠం) ఉంది. రాజధాని ప్రకటన రాగానే 2015లోనే కొంతమంది అక్రమార్కులు కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శి సిఫార్సుతో గ్రామ కంఠాన్ని ఆక్రమించారు. తర్వాత వీటిపై విచారణ చేసిన జేసీ కృతికాశుక్లా రద్దు చేశారు. జేసీ రద్దు చేసిన భూమి 1.12 ఎకరాలుగా ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో గజం రూ.30 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన అక్రమార్కులు కాజేసిన భూమి విలువ రూ.15 కోట్ల పైమాటే. రిజిస్ట్రేషన్లను రెండేళ్లుగా రద్దుచేయకపోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
మాధవన్‌కు మదురై కోర్టు నోటీసులు
తమిళసినిమా: స్థల ఆక్రమణ కేసులో నటుడు మాధవన్‌కు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాలు.. దిండుగల్ జిల్లా పళనీ సమీపంలోని పాలసముద్రం ప్రాంతానికి చెందిన గణేశ్ హైకోర్టు మధురై శాఖలో ఓ పిటీషన్ దాఖలు చేశారు. అందులో మధురై జిల్లా పాలసముద్రంలో సాగుబడి కాలువ పక్కన ఉన్న రాజమ్మాళ్‌కు చెందిన 4.88 ఎకరాల భూమిని నటుడు మాదవన్ కోనుగోలు చేశారని పేర్కొన్నారు. అయితే ఆయన సాగుబడి కాలువాను కొంత భాగం ఆక్రమించి కొబ్బరి, జామ తోటలను నాటుతున్నారని ఆరోపించారు. ఆయన ఆక్రమించుకున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం కూడా ఉందన్నారు. దీని గురించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారించిన విద్యుత్ శాఖ అధికారి ఆ సాగుబడి కాలువ ఉపయోగంలో లేదని తెల్చి చెప్పారన్నారు. కాగా నటుడు మాధవన్ అనుచరులు తనపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీని గురించి నెయ్‌క్కారపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ గ్రామ ప్రజల జీవనాధారాన్ని కాపాడే విధంగా కాలువ దురాక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశించాలని పిటిషన్లో కోరారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కేకే.చంద్రన్, పీ.గోకుల్‌నాథ్‌లు నటుడు మాధవన్, దిండుగళ్ కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారి, పళనీ తహశీల్దార్లకునోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేశారు.