గ్రామ కంఠాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని అప్పటి జేసీ కృతికా శుక్లా సిఫార్సు చేసిన పత్రం
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అనేక భూ కుంభకోణాల్లో అబ్బరాజుపాలెం వ్యవహారం ఒకటి. అధికార పార్టీ నాయకులు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులతో కలసి పక్కా ప్రణాళిక రూపొందించి.. రద్దయిన పట్టాలతో ప్లాట్లను పొందేందుకు పథకం రచించారు. ఎకరం 16 సెంట్ల గ్రామ కంఠం ఆక్రమణకు గురైందని జాయింట్ కలెక్టర్ నిర్ధారించి.. ఆ పట్టాలను రద్దు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసినా ఇంతవరకు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంపై సమగ్రంగా మళ్లీ విచారణ చేపట్టి, అక్రమంగా ప్లాట్లు పొందాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజధాని ప్రాంత రైతులు కోరుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) రహదారులను నిర్మిస్తోంది. రోడ్ల కోసం ఇళ్లు కోల్పోయిన వారికి అంతే స్థలాన్ని సీఆర్‌డీఏ కేటాయించింది. స్థలంలో నిర్మాణాలు ఉంటే వాటి విలువను లెక్కగట్టి పరిహారం చెల్లిస్తోంది. అయితే అబ్బరాజుపాలెం మీదుగా ఎన్–14 రోడ్డు వెళ్తోంది. 45 కుటుంబాలకు చెందిన వారు ఇళ్లు కోల్పోతున్నారు. వీరందరికి సీఆర్‌డీఏ ప్లాట్లను కేటాయించాల్సి ఉంది. అయితే వీరిలో 14 కుటుంబాలకు చెందిన వారి పట్టాలను 2017లో గుంటూరు జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా రద్దు చేశారు. గ్రామ కంఠాలకు చెందిన 1.16 ఎకరాలను వీరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు అందడంతో విచారణ చేసిన ఆమె ఆక్రమణలు నిజమని నిర్ధారించి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సిఫార్సు చేశారు.
రంగంలోకి దిగిన టీడీపీ నాయకులు, అధికారులు
రద్దు చేసిన పట్టాలను పట్టించుకోకుండా రోడ్డు కోసం స్థలాలు కోల్పోతున్న బాధితుల జాబితాలో 15 మంది పేర్లను చేర్చారు. వీరందరికి నిజమైన అర్హులతో కలిపి అబ్బరాజుపాలెంలోనే ప్లాట్లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి 45 మంది పేర్లతో అబ్బరాజుపాలెం సీఆర్‌డీఏ కార్యాలయం నుంచి ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు లేఖ అందింది. అయితే అనర్హులకు, రద్దయిన పట్టాలకు ప్లాట్లను ఎలా కేటాయిస్తారని అదే గ్రామానికి చెందిన కొంతమంది సీఆర్‌డీఏ అధికారులను నిలదీయడంతో జాబితాను అప్పట్లో తొక్కిపెట్టారు.
3.12 ఎకరాల్లో 1.16 ఎకరాలు కబ్జా చేసిందే..
ఎన్ – 14 రోడ్డు కోసం అబ్బరాజుపాలెంలో మొత్తం 45 కుటుంబాల వారు ఇళ్లను కోల్పోతున్నారు. మొత్తం 3.12 ఎకరాల మేర ఇళ్ల స్థలాలు కోల్పోవాల్సిఉంది. ఇందులో 1.16 ఎకరాల మేర 15 మంది ఆక్రమించిన వారే ఉండడం గమనార్హం. రద్దయిన పట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా సీఆర్‌డీఏ అధికారులు తిరిగి అక్రమార్కులకు ప్లాట్లు కేటాయించాలనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్పట్లో ప్లాట్ల కేటాయింపును నిలిపేశారు.
ఆక్రమణ భూమి విలువ రూ.15 కోట్ల పైమాటే..!
అబ్బరాజుపాలెం గ్రామంలో భవాని శంకర స్వామి దేవస్థానానికి చెందిన భూమి ఉంది. ఈ భూమిని ఆనుకునే బలిబజారు (గ్రామ కంఠం) ఉంది. రాజధాని ప్రకటన రాగానే 2015లోనే కొంతమంది అక్రమార్కులు కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శి సిఫార్సుతో గ్రామ కంఠాన్ని ఆక్రమించారు. తర్వాత వీటిపై విచారణ చేసిన జేసీ కృతికాశుక్లా రద్దు చేశారు. జేసీ రద్దు చేసిన భూమి 1.12 ఎకరాలుగా ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో గజం రూ.30 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన అక్రమార్కులు కాజేసిన భూమి విలువ రూ.15 కోట్ల పైమాటే. రిజిస్ట్రేషన్లను రెండేళ్లుగా రద్దుచేయకపోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment