land registration fee
-
తెలంగాణ: డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలు భారీగా పెంపు!
సాక్షి, హైదరాబాద్: భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీని ఇటీవలే పెం చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలపై దొడ్డిదారిన మరో భారాన్ని మోపింది. క్రయవిక్రయ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలను అడ్డగోలుగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న ఫీజులు, చార్జీలను రెండింతల నుంచి పదింతలు చేసింది. ఈ నెల రెండో తేదీ నుంచే పెంపును అమల్లోకి తెస్తూ స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి ఇటీవల అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా.. సాధారణ క్రయ, విక్రయ లావాదేవీలతోపాటు సొసైటీల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా పెంచారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ల చట్టం–2021 కింద సొసైటీలను రిజిస్టర్ చేసుకునేందుకు రూ.2 వేలు ఫీజుగా ఖరారు చేశారు. ఈ సొసైటీల జనరల్‌బాడీ సమావేశాలు, కార్యవర్గ సమావేశాల మినిట్లను ఫైల్ చేసేందుకు.. బైలాస్, ఇతర డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీల కోసం రూ.1,000 చొప్పున ఫీజు నిర్ణయించారు. సొసైటీల తనిఖీతోపాటు డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ కస్టడీలో ఉంచేందుకు ఏడాదికి రూ.500 ఫీజు నిర్ణయించారు. అదే విధంగా చిట్‌ఫండ్ చట్టం–1982 మేరకు రూ.5 లక్షల వరకు చిట్టీలను రిజిస్టర్ చేసేందుకు రూ.3,500.. 5లక్షల కన్నా ఎక్కువ విలువైన చిట్టీల రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేలు, ఆర్బిట్రేషన్ ఫీజు కింద రూ.2,000 వసూలు చేయనున్నారు. ఖజానాకు రూ.500 కోట్లు డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి గణనీయంగానే అదనపు ఆదాయం సమకూరుతుందని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతి నెలా కనీసం లక్ష వరకు లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజును రూ.100 నుంచి రూ.500కు పెంచిన నేపథ్యంలో.. అదనంగా నెలకు రూ.4 కోట్ల వరకు రానున్నాయి. అంటే కేవలం డాక్యుమెంట్ చార్జీల కిందే ఏటా కనీసం రూ.50 కోట్ల అదనపు రాబడి ఉంటుందని.. ఇతర లావాదేవీలు, యూజర్ చార్జీలనూ కలిపితే ఏటా కనీసం రూ.500 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇంకా ఎంతగా పెంచుతారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూములు, ఆస్తులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచింది. మళ్లీ ఇప్పుడు డాక్యుమెంట్ ఫీజులు అడ్డగోలుగా పెంచారు. ఎలాగూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కదా కట్టి చావండి అన్నట్టుగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. ఇంకా ఏమేం పెంచుతారు, ఎన్ని రకాల భారం మోపుతారు? ఇది సమంజసం కాదు. వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలు తగ్గించాలి. కొత్త రాముగౌడ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా డాక్యుమెంట్, యూజర్ చార్జీల పెంపు తీరు ఇదీ.. (రూ.లలో) డాక్యుమెంట్ రకం గత చార్జీ పెంచిన చార్జీ ర్యాటిఫికేషన్ 1,000 2,000 మార్టిగేజ్ 2,000 2,000 ఎస్పీఏ 1,000 3,000 జీపీఏ 1,000 5,000 ప్రైవేట్ అటెండెన్స్ 1,000 10,000 వీలునామా 1,000 3,000 వీలునామా విచారణ 1,000 5,000 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 100 500 15 పేజీలు దాటితే పేజీకి రూ.ఐదు 1,000 మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ 10 100 సర్టిఫైడ్‌కాపీ 200 500 ఈసీ 100 500 30 ఏళ్లు దాటిన ఈసీ 500 1,000 (ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనని ప్రతిరకం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫీజును రూ.3,000గా ఖరారు చేశారు) పెరిగిన చార్జీలు.. ఫీజులు ఇలా.. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కోసం స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు డాక్యుమెంట్ చార్జీ కింద రూ.100 తీసుకునేవారు. ఇప్పుడు రూ.500కు పెంచారు. ఈ డాక్యుమెంట్లో 15 పేజీలకు మించి ఉంటే.. ప్రతి అదనపు పేజీకి రూ.5 చొప్పున చార్జి చేసేవారు. కానీ ఇప్పుడు పేజీల సంఖ్యతో సంబంధం లేకుండా 15 పేజీలు మించిన డాక్యుమెంట్‌కు చార్జీ రూ.1,000 చేశారు. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) ఎవరికైనా ఇవ్వాలంటే గతంలో రూ.1,000 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు రూ.3 వేలు చేశారు. అదే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చార్జీని రూ.1,000 నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచేశారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే వీలులేని వ్యక్తుల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలంటే.. ప్రైవేట్ అటెండెన్స్ కింద గతంలో రూ.1,000 అదనపు చార్జీ తీసుకునేవారు. ఇప్పుడీ ఫీజును ఏకంగా రూ.10 వేలకు పెంచారు. సెలవు రోజున రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే.. ఇందుకు రూ. 5 వేలు ఫీజుగా ఖరారు చేశారు. ఏదైనా ఆస్తి, భూమికి సంబంధించి సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలంటే రూ.200 చార్జీ ఉండేది. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)కు గతంలో రూ.100 ఉండగా.. ఇప్పుడు రూ.500 చేశారు. 30 ఏళ్లు దాటిన ఈసీ కావాలంటే.. గతంలో రూ.500 చార్జీ ఉండేది. ప్రస్తుతం రూ.1,000కి పెంచారు. -
Telangana: భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు
7.5- 8 శాతం వరకు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ కలిపి 6 శాతం వసూలు రాష్ట్రంలో 2013 నాటి నుంచీ ఇవే ఫీజులు.. ప్రస్తుతం రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో 6 శాతాన్ని చార్జీగా వసూలు చేస్తున్నారు. ఇందులో 5.5 శాతం స్టాంపు డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటున్నారు. అదనంగా ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు రూ.100 చొప్పున యూజర్ చార్జీ, 0.01 శాతం మ్యుటేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. 6.5 శాతం నుంచి 7 శాతం వరకు స్టాంపు డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటారు. యూజర్ చార్జీ, మ్యుటేషన్ ఫీజు యథాతథంగా ఉంటాయని సమాచారం. రూ.250 కోట్లు రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీలు రెండూ పెంచితే.. ప్రతి నెలా సుమారు రూ.250 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారుల అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రిజిస్ట్రేషన్ల ఫీజును కూడా సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద భూమి లేదా ఆస్తి విలువలో 6 శాతం వసూలు చేస్తుండగా.. దీనిని 7.5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 7-8 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేస్తుండటం, రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్లుగా ఒక్కసారి కూడా ఈ ఫీజులు పెంచకపోవడం నేపథ్యంలో.. ఈసారి ఫీజుల పెంపుదల ప్రతిపాదనను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే భూముల విలువలను పెంచుతున్న సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచితే.. ప్రజలపై భారం పడినట్టు అవుతుందనే తర్జనభర్జన కూడా జరుగుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి మంగళవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి నెలా అదనంగా రూ.250 కోట్లు: భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీల పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ, ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలకు రూ.500 కోట్లకు అటూఇటుగా ఉంది. తాజాగా విలువలు, చార్జీల పెంపు అమల్లోకి వస్తే.. ఆదాయం 50 శాతం మేర పెరుగుతుందని అధికారులు లెక్కలు వేశారు. అంటే నెలనెలా అదనంగా రూ.250 కోట్లు వస్తాయని.. మొత్తంగా నెలకు రూ.750 కోట్ల చొప్పున ఏడాదికి రూ.9 వేల కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. ఆ లెక్కన మరో రూ.3,500 కోట్లు ఎలా సమకూర్చుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. చార్జీలతో భారమనే అభిప్రాయం భూములు, ఆస్తుల విలువలు పెంచితే.. వాటి ఆధారంగా రుణాలు కూడా కాస్త ఎక్కువగా, సులువుగా లభించే వెసులుబాటు ఉంటుందన్న అభిప్రాయముంది. అందువల్ల విలువల సవరణ వల్ల కట్టే చార్జీ పెరిగినా.. క్రయవిక్రయదారులు పెద్దగా ఇబ్బందిపడే అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. అదే ఫీజు కూడా పెంచితే భారం పెరిగిందనే భావన ఏర్పడుతుందని పేర్కొంటున్నాయి. ఈ రెండు రకాల వాదనలపై కేబినెట్ భేటీలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గతంలో రెండేళ్లకోసారి.. పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా భూములు, ఆస్తుల విలువలను సవరించేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఈ సవరణ జరగలేదు. ప్రస్తుతం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి భూముల విలువలు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. ఈ కేబినెట్ సమావేశంలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. రెండూ పెంచితే ఎలా? భూములు, ఆస్తుల విలువల పెంపుతో సరిపెడితే రిజిస్ట్రేషన్ శాఖకు ఓ మోస్తరుగా మాత్రమే ఆదాయం పెరుగుతుంది. అదే చార్జీలు కూడా పెంచితే గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. కానీ రెండూ పెంచితే ప్రజలపై భారం ఒక్కసారిగా పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు రూ.లక్ష ధరతో ఒక ఎకరం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరిగితే.. ప్రస్తుత విధానం ప్రకారం రూ.6 వేలు (6 శాతం) చార్జీల కింద కడితే సరిపోతుంది. ఇదే ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలకు పెంచితే.. ప్రస్తుత చార్జీల ప్రకారమే రూ.24 వేలు కట్టాల్సి వస్తుంది. ఇదే సమయంలో చార్జీలను 8 శాతానికి పెంచితే.. రూ.32 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే భారం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండింటినీ పెంచడంపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు, కోవిడ్‌పైనా.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ పెంపుతోపాటు 50 వేల ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వానాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో వ్యవసాయ స్థితిగతులు, పాఠశాలలు, పుస్తకాల పంపిణీ, ఇతర విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
ముందే ‘మ్యూటేషన్’
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో ఇకపై భూమి క్రయ, విక్రయాలు జరిపేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు తప్పనిసరిగా మ్యూటేషన్ ఫీజు భరించాల్సిందే. దీంతో ఆస్తులు కొనుగోలు చేసేవారు ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ భారాన్ని మోయాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి గెజిట్ జారీ అయ్యింది. ఆగస్టు 2న కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతోపాటు మున్సిపాలిటీల్లో పలు గ్రామాల విలీనం జరిగిన విషయం విదితమే. ఈ విలీనం జరిగిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించి భూ క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రధానంగా ఆ గ్రామాల సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణంపై స్పష్టత రాకపోవడంతో ఈ జాప్యం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 0.5 శాతం మ్యూటేషన్ ఫీజు సాధారణంగా ఆస్తుల కొనుగోలు సమయంలో ఇరు పార్టీలు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో కొనుగోలుదారు భూమి మార్కెట్ విలువపై 4శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో ఏ భూమికైనా ఇదే విధంగా ఉంటుంది. మున్సిపాలిటీలో మాత్రం పేరు మార్పిడికి సంబంధించి అదనంగా మ్యూటేషన్ ఫీజు భూమి విలువ మీద 0.5శాతం కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే తీసుకోవడం జరుగుతుంది. గ్రామపంచాయతీలో రిజిస్ట్రేషన్ తర్వాత నేరుగా జీపీ కార్యాలయంలో మ్యూటేషన్ ఫీజు చెల్లించి చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనం చేశారు. వాటికి సంబంధించి ఆగస్టు 2 తర్వాత రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రధానంగా ఆయా వార్డు, బ్లాక్, విస్తీర్ణం వివరాలపై స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం వ్యక్తమైంది. దీంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఆయా గ్రామాల్లో అప్పటినుంచి రిజిస్ట్రేషన్లను జరపడంలేదు. ఈ నేపథ్యంలో క్రయవిక్రయాలు చేసుకునే వారిలో ఆందోళన వ్యక్తమైంది. విలీన గ్రామాలు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన అనుకుంట గ్రామాన్ని వార్డు నెం.13లో కలిపారు. అర్లి(బి) జీపీలోని బెల్లూరి, నిషాన్ఘాట్ గ్రామాలను వార్డు నెం.3లో, రాంపూర్(ఆర్)ను వార్డు నెం.32లో, బట్టిసావర్గాం జీపీలోని ఎన్‌హెచ్‌బీ కాలనీ, టైలర్స్‌కాలనీ, పోలీసు కాలనీ, వివేకానంద కాలనీ, అగ్రజా టౌన్షిప్, ఆదర్శ్‌కాలనీ, భగత్‌సింగ్ కాలనీలను వార్డు నెం.27లో విలీనం చేశారు. మావల గ్రామపంచాయతీ పరిధిలోని దస్నాపూర్, దుర్గానగర్, కేఆర్కే కాలనీ, వికలాంగుల కాలనీలో మిగిలిన భాగంతోపాటు అటెండర్ కాలనీ, కృష్ణానగర్, ఇందిరమ్మ కాలనీలను వార్డు నెం.19లో విలీనం చేశారు. మార్కెట్ విలువ పాత పద్ధతే.. ఆయా గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమైనప్పటికీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రస్తుతం పాత విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సబ్రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులతో కలిపి మార్కెట్ రివిజన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ప్రతి రెండేళ్లకోసారి భూములకు సంబంధించి రివిజన్ చేసి మార్కెట్ విలువలను సవరించడం, పెంచడం జరుగుతుంది. ప్రస్తుతానికి విలీన గ్రామాల్లో పాత విలువలోనే రిజిస్ట్రేషన్ చేయనుండడంతో ఇప్పటికే ఆయా గ్రామాల్లో క్రయ, విక్రయాల పరంగా రిజిస్ట్రేషన్ విలువలో భారీ తేడాలు వచ్చే అవకాశం లేదు. అదనంగా మ్యూటేషన్ ఫీజును మాత్రమే భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఆస్తి పన్ను పరంగా కూడా మూడేళ్ల వరకు ఎలాంటి మార్పుచేర్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మార్కెట్ విలువలు మాత్రం రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఏదైన నిర్ణయం తీసుకుంటే సవరణ చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. సీసీఏలో నమోదు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో త్వరలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించడం జరుగుతుంది. సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం విషయంలో స్పష్టత వచ్చింది. ఆన్లైన్లో ఈ సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం మున్సిపాలిటీలోని వార్డుల్లో జతచేస్తూ సీసీఏలో నమోదు చేయాల్సి ఉంది. సోమవారం దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. – జయవంత్‌రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
రిజిస్ట్రేషన్ ధరలు యథాతథం
పెంపునకు సీఎం కేసీఆర్ నో! వార్షిక లక్ష్యం చేరుకునేందుకు ఈ మార్గం వద్దని సూచన వచ్చేనెల 1 నుంచి పోస్టాఫీసుల్లోనూ స్టాంపుల విక్రయాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రెండు షిఫ్టుల పద్ధతికి యోచన ఆగస్టు నుంచి హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలన్న రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ ఏడాది ధరల పెంపు వద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ధరల పెంపు మార్గాన్ని ఎంచుకోవద్దని రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించినట్లు తెలిసింది. ఏటా ఆగ స్టులో భూముల రిజిస్ట్రేషన్ ధరలను సమీక్షించడం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా రిజిస్ట్రేషన్ ధరలను పెంచేందుకు గత రెండునెలలుగా అధికారులు కసరత్తు చేశారు. ప్రాంతాల వారీగా భూమి ప్రస్తుత విలువపై 10 నుంచి 30 శాతం వరకు విలువ పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రజలు కోరితే ధరల తగ్గింపు.. మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక ప్రజలు కోరితే ఆయా భూముల రిజిస్ట్రేషన్ ధరలను తగ్గించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రిజిస్ట్రేషన్ ధర తగ్గింపు కోరేవారు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే సవరణల కమిటీ ఆ భూమి విలువ సమీక్షించి, తగ్గింపునకు అవసరమైన చర్యలు చేపడుతుందని వివరించారు. రిజిస్ట్రేషన్ల ధరల తగ్గింపు కోరేందుకు నిర్దిష్ట గడువు ఏమీ లేదని, ఈ ప్రక్రియ ఏడాది పొడవునా కొనసాగుతుందని తెలిపారు. పోస్టాఫీసుల ద్వారా స్టాంపులు.. రిజిస్ట్రేషన్ స్టాంపులు ప్రజలకు మరింత అందుబాటులో ఉంచేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసుల ద్వారా ఈ స్టాంపులను విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే పోస్టల్ శాఖతో సంప్రదింపులు జరిపిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు.. ఈ ప్రక్రియను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టాంపుల విక్రయానికి వెండర్‌కు ఇస్తున్నట్లే పోస్టల్ శాఖకు కూడా కమీషన్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. వెండర్లు స్టాంపులను అసలు ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కుదిరిన టైంలో.. రాష్ట్రంలో రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను షిఫ్టు పద్ధతిన నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలు, ఇతర ముఖ్య పట్టణాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తే ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టుల్లో కార్యాలయాలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానాన్ని వచ్చేనెల నుంచి హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇది విజయవంతమైతే మిగిలిన నగరాలు, పట్టణాల్లో కూడా షిఫ్టు పద్ధతిని అమలు చేస్తారు. దీనిద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, వివిధ రకాల వృత్తులు, వ్యాపారాలు చేసేవారు.. వారికి వీలైన సమయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.