తెలంగాణ: డాక్యుమెంట్‌ ఫీజులు, యూజర్‌ చార్జీలు భారీగా పెంపు! | Document Fees And User Charges For Land Registration In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: తెలంగాణ: డాక్యుమెంట్‌ ఫీజులు, యూజర్‌ చార్జీలు భారీగా పెంపు!

Published Sun, Sep 5 2021 1:50 AM | Last Updated on Sun, Sep 5 2021 11:21 AM

Document Fees And User Charges For Land Registration In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీని ఇటీవలే పెం చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలపై దొడ్డిదారిన మరో భారాన్ని మోపింది. క్రయవిక్రయ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్‌ ఫీజులు, యూజర్‌ చార్జీలను అడ్డగోలుగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న ఫీజులు, చార్జీలను రెండింతల నుంచి పదింతలు చేసింది. ఈ నెల రెండో తేదీ నుంచే పెంపును అమల్లోకి తెస్తూ స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి ఇటీవల అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. 

సొసైటీ రిజిస్ట్రేషన్‌ ఫీజులు కూడా.. 
సాధారణ క్రయ, విక్రయ లావాదేవీలతోపాటు సొసైటీల రిజిస్ట్రేషన్‌ ఫీజులను కూడా పెంచారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ల చట్టం–2021 కింద సొసైటీలను రిజిస్టర్‌ చేసుకునేందుకు రూ.2 వేలు ఫీజుగా ఖరారు చేశారు. ఈ సొసైటీల జనరల్‌బాడీ సమావేశాలు, కార్యవర్గ సమావేశాల మినిట్లను ఫైల్‌ చేసేందుకు.. బైలాస్, ఇతర డాక్యుమెంట్ల సర్టిఫైడ్‌ కాపీల కోసం రూ.1,000 చొప్పున ఫీజు నిర్ణయించారు. సొసైటీల తనిఖీతోపాటు డాక్యుమెంట్లను రిజిస్ట్రార్‌ కస్టడీలో ఉంచేందుకు ఏడాదికి రూ.500 ఫీజు నిర్ణయించారు. అదే విధంగా చిట్‌ఫండ్‌ చట్టం–1982 మేరకు రూ.5 లక్షల వరకు చిట్టీలను రిజిస్టర్‌ చేసేందుకు రూ.3,500.. 5లక్షల కన్నా ఎక్కువ విలువైన చిట్టీల రిజిస్ట్రేషన్‌ కోసం రూ.5 వేలు, ఆర్బిట్రేషన్‌ ఫీజు కింద రూ.2,000 వసూలు చేయనున్నారు. 
 
ఖజానాకు రూ.500 కోట్లు 
డాక్యుమెంట్‌ ఫీజులు, యూజర్‌ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి గణనీయంగానే అదనపు ఆదాయం సమకూరుతుందని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతి నెలా కనీసం లక్ష వరకు లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్‌ ఫీజును రూ.100 నుంచి రూ.500కు పెంచిన నేపథ్యంలో.. అదనంగా నెలకు రూ.4 కోట్ల వరకు రానున్నాయి. అంటే కేవలం డాక్యుమెంట్‌ చార్జీల కిందే ఏటా కనీసం రూ.50 కోట్ల అదనపు రాబడి ఉంటుందని.. ఇతర లావాదేవీలు, యూజర్‌ చార్జీలనూ కలిపితే ఏటా కనీసం రూ.500 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 
 
ఇంకా ఎంతగా పెంచుతారు? 
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూములు, ఆస్తులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంచింది. మళ్లీ ఇప్పుడు డాక్యుమెంట్‌ ఫీజులు అడ్డగోలుగా పెంచారు. ఎలాగూ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు కదా కట్టి చావండి అన్నట్టుగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. ఇంకా ఏమేం పెంచుతారు, ఎన్ని రకాల భారం మోపుతారు? ఇది సమంజసం కాదు. వెంటనే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఫీజులు, యూజర్‌ చార్జీలు తగ్గించాలి. 
కొత్త రాముగౌడ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా 
 
డాక్యుమెంట్, యూజర్‌ చార్జీల పెంపు తీరు ఇదీ.. (రూ.లలో) 
డాక్యుమెంట్‌ రకం                                గత చార్జీ    పెంచిన చార్జీ 
ర్యాటిఫికేషన్‌                                            1,000        2,000 
మార్టిగేజ్‌                                                  2,000        2,000 
ఎస్‌పీఏ                                                    1,000        3,000 
జీపీఏ                                                       1,000        5,000 
ప్రైవేట్‌ అటెండెన్స్‌                                 1,000        10,000 
వీలునామా                                               1,000        3,000 
వీలునామా విచారణ                                 1,000        5,000 
రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌                          100            500 
15 పేజీలు దాటితే                         పేజీకి రూ.ఐదు     1,000  
మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌                         10            100 
సర్టిఫైడ్‌కాపీ                                              200            500 
ఈసీ                                                         100            500 
30 ఏళ్లు దాటిన ఈసీ                                500            1,000 
(ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనని ప్రతిరకం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఫీజును రూ.3,000గా ఖరారు చేశారు)  


పెరిగిన చార్జీలు.. ఫీజులు ఇలా..

  • గతంలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కోసం స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు డాక్యుమెంట్‌ 
  • చార్జీ కింద రూ.100 తీసుకునేవారు. ఇప్పుడు రూ.500కు పెంచారు. ఈ డాక్యుమెంట్లో 15 పేజీలకు మించి ఉంటే.. ప్రతి అదనపు పేజీకి రూ.5 చొప్పున చార్జి చేసేవారు. కానీ ఇప్పుడు పేజీల సంఖ్యతో సంబంధం లేకుండా 15 పేజీలు మించిన డాక్యుమెంట్‌కు చార్జీ రూ.1,000 చేశారు. 
  • స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (ఎస్‌పీఏ) ఎవరికైనా ఇవ్వాలంటే గతంలో రూ.1,000 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు రూ.3 వేలు చేశారు. అదే జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చార్జీని రూ.1,000 నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచేశారు. 
  • రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చే వీలులేని  వ్యక్తుల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయాలంటే.. ప్రైవేట్‌ అటెండెన్స్‌ కింద గతంలో రూ.1,000 అదనపు చార్జీ తీసుకునేవారు. ఇప్పుడీ ఫీజును ఏకంగా రూ.10 వేలకు పెంచారు. 
  • సెలవు రోజున రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వస్తే.. ఇందుకు రూ. 5 వేలు ఫీజుగా ఖరారు చేశారు. 
  • ఏదైనా ఆస్తి, భూమికి సంబంధించి సర్టిఫైడ్‌ కాపీ తీసుకోవాలంటే రూ.200 చార్జీ ఉండేది. 
  • ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 
  •  ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)కు గతంలో రూ.100 ఉండగా.. ఇప్పుడు రూ.500 చేశారు. 
  • 30 ఏళ్లు దాటిన ఈసీ కావాలంటే.. గతంలో రూ.500 చార్జీ ఉండేది. ప్రస్తుతం రూ.1,000కి పెంచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement