- 7.5- 8 శాతం వరకు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
- ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ కలిపి 6 శాతం వసూలు
రాష్ట్రంలో 2013 నాటి నుంచీ ఇవే ఫీజులు..
ప్రస్తుతం రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో 6 శాతాన్ని చార్జీగా వసూలు చేస్తున్నారు. ఇందులో 5.5 శాతం స్టాంపు డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటున్నారు. అదనంగా ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు రూ.100 చొప్పున యూజర్ చార్జీ, 0.01 శాతం మ్యుటేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు.
- తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. 6.5 శాతం నుంచి 7 శాతం వరకు స్టాంపు డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటారు. యూజర్ చార్జీ, మ్యుటేషన్ ఫీజు యథాతథంగా ఉంటాయని సమాచారం.
- రూ.250 కోట్లు రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీలు రెండూ పెంచితే.. ప్రతి నెలా సుమారు రూ.250 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారుల అంచనా.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రిజిస్ట్రేషన్ల ఫీజును కూడా సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద భూమి లేదా ఆస్తి విలువలో 6 శాతం వసూలు చేస్తుండగా.. దీనిని 7.5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 7-8 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేస్తుండటం, రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్లుగా ఒక్కసారి కూడా ఈ ఫీజులు పెంచకపోవడం నేపథ్యంలో.. ఈసారి ఫీజుల పెంపుదల ప్రతిపాదనను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే భూముల విలువలను పెంచుతున్న సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచితే.. ప్రజలపై భారం పడినట్టు అవుతుందనే తర్జనభర్జన కూడా జరుగుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి మంగళవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి.
ప్రతి నెలా అదనంగా రూ.250 కోట్లు: భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీల పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ, ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలకు రూ.500 కోట్లకు అటూఇటుగా ఉంది. తాజాగా విలువలు, చార్జీల పెంపు అమల్లోకి వస్తే.. ఆదాయం 50 శాతం మేర పెరుగుతుందని అధికారులు లెక్కలు వేశారు. అంటే నెలనెలా అదనంగా రూ.250 కోట్లు వస్తాయని.. మొత్తంగా నెలకు రూ.750 కోట్ల చొప్పున ఏడాదికి రూ.9 వేల కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించడం గమనార్హం. ఆ లెక్కన మరో రూ.3,500 కోట్లు ఎలా సమకూర్చుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
చార్జీలతో భారమనే అభిప్రాయం
భూములు, ఆస్తుల విలువలు పెంచితే.. వాటి ఆధారంగా రుణాలు కూడా కాస్త ఎక్కువగా, సులువుగా లభించే వెసులుబాటు ఉంటుందన్న అభిప్రాయముంది. అందువల్ల విలువల సవరణ వల్ల కట్టే చార్జీ పెరిగినా.. క్రయవిక్రయదారులు పెద్దగా ఇబ్బందిపడే అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. అదే ఫీజు కూడా పెంచితే భారం పెరిగిందనే భావన ఏర్పడుతుందని పేర్కొంటున్నాయి. ఈ రెండు రకాల వాదనలపై కేబినెట్ భేటీలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గతంలో రెండేళ్లకోసారి.. పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా భూములు, ఆస్తుల విలువలను సవరించేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఈ సవరణ జరగలేదు. ప్రస్తుతం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి భూముల విలువలు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. ఈ కేబినెట్ సమావేశంలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి.
రెండూ పెంచితే ఎలా?
భూములు, ఆస్తుల విలువల పెంపుతో సరిపెడితే రిజిస్ట్రేషన్ శాఖకు ఓ మోస్తరుగా మాత్రమే ఆదాయం పెరుగుతుంది. అదే చార్జీలు కూడా పెంచితే గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. కానీ రెండూ పెంచితే ప్రజలపై భారం ఒక్కసారిగా పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- ఉదాహరణకు రూ.లక్ష ధరతో ఒక ఎకరం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరిగితే.. ప్రస్తుత విధానం ప్రకారం రూ.6 వేలు (6 శాతం) చార్జీల కింద కడితే సరిపోతుంది.
- ఇదే ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలకు పెంచితే.. ప్రస్తుత చార్జీల ప్రకారమే రూ.24 వేలు కట్టాల్సి వస్తుంది. ఇదే సమయంలో చార్జీలను 8 శాతానికి పెంచితే.. రూ.32 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
- అంటే భారం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండింటినీ పెంచడంపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
ఉద్యోగాలు, కోవిడ్‌పైనా..
మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ పెంపుతోపాటు 50 వేల ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వానాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో వ్యవసాయ స్థితిగతులు, పాఠశాలలు, పుస్తకాల పంపిణీ, ఇతర విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment