landslide prone
-
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం
డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. ఘాట్ ప్రాంతాలున్న చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఆ శిధిలాల్లో చిక్కుకుని మహిళ, ఆమె 9 నెలల కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. బద్రీనాథ్– పగల్నాలా, రిషికేష్– కేదార్నాథ్ రహదారుల్లో రవాణా సైతం కొండచరియలు విరిగిపడిన కారణంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో పోటెత్తిన చాఫ్లాగద్ నది ధాటికి పక్కనే ఉన్న ఇళ్లు, భవనాలు, షాపులు కుప్పకూలి నీటిలో కొట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్లోని రిసాయి జిల్లాలో ఓ పెద్ద బండరాయి విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరోవైపు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ ల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పై నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరద కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 199కి చేరగా, కేవలం కేరళలోనే 83 మంది చనిపోయారు. అయితే, మలప్పురంలో ఇంకా 50 మంది వరకు జాడ తెలియని నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో 2.87 లక్షల మంది ఇంకా సహాయ కేంద్రాల్లోనే ఉన్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన 125 మందిని భారత వైమానిక దళం కాపాడింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో వరదల కారణంగా గత 6 రోజులుగా మూసివేసి ఉన్న ముంబై– బెంగళూరు హైవేపై సోమవారం వాహనాలకు పాక్షికంగా అనుమతి ఇచ్చారు. వర్షాలకు భారీగా ధ్వంసమైన తన నియోజకవర్గం వాయినాడ్(కేరళ)లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి, బాధితులను పరామర్శించారు. వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులను కోరారు. -
60కి చేరిన పుణె మృతుల సంఖ్య
పుణె : మహారాష్ట్రలోని పుణే జిల్లా మాలిన్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా శిథిలాల కింద 100 మందికిపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణం జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలకు అడ్డంకిగా మారాయి. భారీ వర్షాలు, పేరుకుపోయిన మట్టి, పెద్దపెద్ద బండ రాళ్ల కారణంగా శిథిలాల కింద ఉన్న వారు ప్రాణాలతో ఉండేది అనుమానంగా మారింది. -
ప్రాణాలు కాపాడిన 'రుద్ర' గావుకేక
పూణే : విపత్కర పరిస్థితుల్లో మధ్య మాలిన్ గ్రామంలో శిథిలాలు తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఇంతలో శిథిలాల మధ్య నుంచి ఓ చిన్నారి గావుకేక! కొండచరియల మధ్య చిక్కుకొని మూర్చపోయిన తల్లి ఒడిలో ఉన్న మూడు నెలల పసికందు రుద్ర బిగ్గరగా ఏడ్చింది.. దాంతో అప్రమత్తమైన సహాయక సిబ్బంది తల్లి, బిడ్డను శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కొండచరియలు విరిగిపడటం రుద్ర తల్లి ప్రమీలా లింబే ఇల్లు శిథిలాల కింద సమాధి అయింది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె ఓ ఇనుప డబ్బాలో బిడ్డతోపాటు తలదాచుకున్నారు. శిథిలాల మధ్య ఇరుక్కుపోయి సాయం కోసం అరిచి..అరిచి ఆమె మూర్ఛపోగా ఆమె ఒడిలో చిన్నారి పెట్టిన గావుకేకతో.. తల్లిబిడ్డల ప్రాణాలు దక్కాయి. వారిద్దరూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆ డబ్బాలోనే ఉండిపోయారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతసేపు డబ్బాలో ఉండి వారిద్దరూ ప్రాణాలతో బటయపడటం అద్భుతమే మరి. -
ఇంకా కొండచరియలకిందే ప్రాణాలు..
పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగి మాలిన్ గ్రామంపై పడిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఇప్పటి వరకూ 41 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. వీరిలో 16 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మూడు నెలల పసిపాప, ఆమె తల్లితో పాటు మరో 20 మందిని ప్రాణాలతో బయటకు తీయగలిగారు. ఇంకా శిథిలాల కింద 100 మందికిపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణం జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలకు అడ్డంకిగా మారాయి. భారీ వర్షాలు, పేరుకుపోయిన మట్టి, పెద్దపెద్ద బండ రాళ్ల కారణంగా శిథిలాల కింద ఉన్న వారు ప్రాణాలతో ఉండేది అనుమానంగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సమీప గ్రామాల ప్రజలు ముమ్మరంగా గాలిస్తున్నారు. జేసీబీలు, క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు గ్రామం దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో మాలిన్ గ్రామస్తులు ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతున్న చోట తమ వారు బతికే ఉంటారనే ఆశతో వెతుకులాట కొనసాగిస్తున్నారు. మరోవైపు శిథిలాల నుంచి వెలికి తీసిన మృతదేహాలకు గురువారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఇంకా శిథిలాల కింద 100 మందికిపైగా ఉండొచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ స్పష్టంచేశారు. ప్రమాదకరమైన చోట్ల నివసించే ప్రజలను వేరే ప్రాంతాకు తరలించాలని భావిస్తున్నట్టు చవాన్ చెప్పారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం మాలిన్ గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిని, సహాయక చర్యల తీరును ఆయన పరిశీలించారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సాయంగా ప్రకటించారు. ‘కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైన సాయం అందించాల్సిందిగా ప్రధాని ఆదేశించారు’’ అని రాజ్నాథ్ చెప్పారు. ఆడవుల నరికివేత, నేల కోతకు గురికావడమే ఈ దుర్ఘటనకు కారణమా అని విలేకరులు ప్రశ్నించగా.. దీనికి కారణాలను ముందుగానే చెప్పడం తొందరపాటు అవుతుందని, దీనిపై జియోలాజికల్ సర్వే సిబ్బంది విచారణ జరుపుతారని చెప్పారు. సహాయక చర్యలు పూర్తి కావడానికి మరో రెండు రోజులు పడుతుందని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని అన్నారు.